విశ్వం విలాపాలతో ప్రతిధ్వనిస్తోంది. మృత్యుగోషతో ధరణి కకావికలమైపోతోంది. కనీవినీ ఎరుగని కల్లోలం దేశాన్ని కుదిపేస్తోంది. భయంతో సమాజాలు వణికిపోతున్నాయి. మానవజాతి దుఃఖంతోదహించుకుపోతోంది.శవాల గుట్టగా మారిన భారత్, సకల అస్త్రశస్త్రాల్నీ సమకూర్చుకొని సమస్త రణ నైపుణ్యాలతో యుద్ధం చేయవలసిన సమయంలో యుద్ధాన్నే విస్మరించిన ప్రజాస్వామ్య భారత్, ప్రజల ప్రాణ రక్షణకు పూచీ పడాల్సిన సమయంలో నిష్పూచిగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన భారత్, ప్రజలు శవాలుగా మారుతున్న ఒక వికృత దృశ్యం.
కోవిడ్ వార్డులో పేషెంట్స్‌ని చూస్తున్నడా. నివేదిత హృదయం భరించలేని వేదనతో క్రుంగిపోయింది. రోగులు పడుతున్న యాతన, బ్రతకటం కోసం వాళ్ళు చేస్తున్న పోరాటం, వాళ్ళను బ్రతికించడం కోసం మొత్తం వైద్య సిబ్బంది చేస్తున్న యుద్ధం, ఈ యుద్ధంలో తాము ఓడిపోయి, తమ కళ్ళముందే ఊపిరి ఆగి, మనిషి శవంగా మారి, ఒక పేకెట్‌గా మడచబడి తన వారి తోడు లేకుండా ఒంటరిగా లయస్ధానానికి తరలింప బడుతున్నప్పుడు... ఇంతకంటే ఏమీ చెయ్యలేకపోయామన్న నిస్సహాయత, నిస్పృహ, తీరని దుఃఖం మనసును, శరీరాన్ని ఘనీభవింపజేస్తున్నాయి.అనునిత్యం రోగుల వేదనను, పోరాటాన్ని, మరణాల్ని అతి సమీపం నుండి చూస్తున్న డాక్టర్లు, నర్సులు ఇతర ఆరోగ్య సిబ్బంది అలసిపోతున్నారు. మానసికంగా క్రుంగి పోతున్నారు. వారిని ఆక్రుంగుబాటు నుండి పైకి లాగడం అతి కష్టంగా ఉన్నప్పటికి వారికి ప్రేరణ నిచ్చి, విశ్రాంతి నిచ్చి, శిక్షణనిచ్చి, నైపుణ్యాల్ని పెంచి వారిని నిబద్ధత కలిగిన పోరాటయోధులుగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తూ, ఒకోసారి తనే డీలాపడిపోతూ, మళ్ళీ తనకు తాను ప్రేరణనిచ్చుకుంటూ ఒక బలమైన దళపతిగా నిలవడానికి ప్రయత్నిస్తూంది నివేదిత.
ప్రపంచాన్ని అల్లల్లాడించిన కొరోనా ప్రమాదం ఇంకా తొలగిపోలేదని, అలసత్వం పనికిరాదని, అనుక్షణం అప్రమత్తతతో ఉండాలని, రెండవ వేవ్ వస్తుందని ఎలుగెత్తి హెచ్చరిస్తున్నప్పటికీ, పెడచెవిని పెట్టి ఎటు వంటి జాగ్రత్తల్నీ తీసుకోకుండా విచ్చలవిడిగా తిరిగిన ప్రజలు, ప్రజల ప్రాణాలకు రవ్వంత విలువ కూడా ఇవ్వకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించిన రాజకీయపార్టీలు, ఎలక్షన్లు పెట్టకపోతే ప్రాణం పోతుందన్నట్లు హడావిడిగా ఎలక్షన్లను నిర్వహించిన ఎలక్షన్ కమిషన్, లక్షలమంది ప్రజలు గుమిగూడే కుంభమేళాలు, ఇతర మత సమావేశాల్ని నిరోధించకపోవడం, యుద్ధ ప్రాతిపదికన ప్రజలందరికీ వేక్సిన్ వేసే బాధ్యత తీసుకోవలసిన ప్రభుత్వాల నిర్లక్ష్యం, అస్తవ్యస్త ప్రణాళికల మూలంగా సక్రమంగా వేక్సినేషన్ కార్యక్రమం అమలు కాకపోవడం, కేవలం ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన జరిగిన వ్యాధి విజృంభణ, ఎన్నో నివారించ గలిగిన మరణాలు .... చివరకు అత్యవసరమైన మందులు కొరత, బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరత, ఊహకందనంత ఖర్చు, డబ్బు లేని వారికి చావే గతి లాగా తయారయిన పరిస్ధితిని తలచుకుంటే అదుపు చేసుకోలేని ఆగ్రహం కలుగుతోంది నివేదితకు.