‘‘ఏమండీ.. ముఖానికా పేపరు కాస్త అడ్డం తీస్తారా’’ అంటూ పొగలు కక్కుతున్న కాఫీతో దర్శనమిచ్చింది శ్రీమతి. కప్పు అందుకోబోతుండగా, ‘‘పై వాటా ఖాళీ అయ్యి మూడు నెలలవుతోంది. రెంటుకిచ్చేదేమైనా ఉందా లేదా?’’ అంటూ మొదలు పెట్టింది.

‘‘నీకు తెలియనిదేముంది సృజనా. రోజూ పేపర్లో, టీవీలో చూస్తూనే ఉన్నావు కదా. కరోనా ఎంత తీవ్రంగా ఉందో. మన కుప్పంలో కూడా ప్రతి రోజూ కేసులు వందకు తగ్గడం లేదు. ఈ పరిస్థితుల్లో వేరే ఎవరినో అద్దెకు తెచ్చి పెట్టుకుని, మనందరి ప్రాణాలను ప్రమాదంలో పడేయమంటావా. ఇళ్లను అద్దెకివ్వడం కాదుకదా... చాలామంది ఓనర్లు, అద్దెకున్న వాళ్ళను ఇప్పటికే ఖాళీ చేయించేశారు.’’‘‘ఇంటిమీదున్న లోను, నెలనెలా కట్టాల్సిన చీటీలు, ఎల్లైసీ, ప్రీమియంలు.. వీటి సంగతేమిజేస్తం మరి?’’‘‘నిజమేననుకో.. ఇట్లాంటి కాలం వస్తుందని కలలోనైనా అనుకున్నామా? ప్రాణాలు నిలుపుకోవడం ముఖ్యం కదా’’ నా వాదనకు తల ఒగ్గిందో లేదో గానీ ఖాళీ కప్పు తీసుకుని వంటగదిలోకి నడిచింది. హమ్మయ్య ఇప్పటికైతే తప్పింది అనుకుంటూ ఉండగా, ‘‘సార్‌..’’ అంటూ బయట నుంచి వినిపించింది. ఒక యువ జంట గేటుకావల నిలబడి ఉంది.

‘‘సృజనా... ఆ మాస్కు ఇలా తీసుకు రా...’’ అంటూ లేచి నిలబడ్డాను వాళ్లు గేటు తీసుకుని ఎక్కడ వచ్చేస్తారో అనే ఆందోళనతో. అంతదాకా మెడలో వేలాడుతున్న మాస్కులను మూతులమీదకు గబగబా లాగేసుకుంటూ ‘‘ఇల్లు.. అద్దెకుందని తెలిసి వచ్చాం సార్‌’’ అంది అమ్మాయి.‘హబ్బే.. లేదు’ అని నా గొంతులోని మాట బయటకు రాకముందే, ‘‘ఉందుంది.. రండి’’ అంటూ ఊడిపడింది సృజన.‘‘పైవాటా చూపించి రండి’’ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా తాళాలు నా చేతిలో పెట్టింది. నాకు మాత్రమే అర్థమయ్యేలా కళ్లలో లాలన రంగరించి విసిరింది. గ్రిల్‌ గేటు ఓపెన్‌ చేస్తూ, ఎవరన్నట్టుగా చూశాను వాళ్ల వైపు.‘‘మాది గుడుపల్లె మండలం సంగనపల్లె సార్‌. ఇక్కడ కుప్పం ఇండస్ట్రియల్‌ ఎస్టేట్లో ఒక ఫ్యాక్టరీలో ఆయన సూపర్‌వైజర్‌. నైట్‌ షిఫ్టులప్పుడు వచ్చి పోవాలంటే ఏనుగుల భయం. అందుకే టౌన్‌లో ఉందామనుకుంటా ఉండాం’’ అని వివరణ ఇచ్చింది ఆ అమ్మాయి.