భార్గవికి వంద రెక్కలున్నాయి.ఇప్పుడిప్పుడే భార్గవి తన లోపల నుంచి వినపడే చప్పుళ్ళకు అర్థాలు వెతుకుతోంది. అవి ఇప్పుడే కాదు. ఎప్పుడూ వచ్చేవే. కాని ఒకప్పుడు ఆ శబ్దాలలోని అర్థాలను పట్టుకునే శక్తి, చదువు, తీరిక ఏమీ లేవు. కాని తనకు రెక్కలు మాత్రం ఉన్నాయి. వాటిని పిల్లల బాగోగుల కోసమే వినియోగించింది. ఎదురైన ప్రతి ఎదురు దెబ్బకీ ఆమె రెక్కలు మరింత దృఢపరుచుకుంది. తన లోపల కూడా రెక్కలున్నాయని, అవి టపటపా కొట్టుకుంటున్నాయని ఇప్పుడిప్పుడే ఆమె వింటోంది. ఈ మధ్యనే తనకంతా బోధపడుతోంది.
ఇప్పుడుగాని భార్గవిని అడిగితే ప్రతి స్త్రీకి వంద రెక్కలుంటాయని ఖచ్చితంగా చెప్తుంది. తనకంత వాదనాపటిమ లేదు కానీ, ఈ విషయంలో ఆమె మానసిక స్పందనకు అక్షరాలు తొడిగితే, తుంచే కొద్దీ మరింత ఏపుగా మొలిచే ఆకుల్లా ఆడవాళ్ళలో రెక్కలు కూడా మొలవడం ఆగవని అర్థమవుతుంది. ఐతే, ఆ రెక్కలకు కొన్ని నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి. అవి ఎగర కూడదు. ఈదాలి. ఊహల ఆశల కలల ఆకాశాల వైపు ఆ రెక్కలు కన్నెత్తి చూడకూడదు. సంసారాల కష్టనష్టాలు, ఈతిబాధలు, హింస దౌర్జన్యాల సముద్రాలను మాత్రం ఈదడానికి ఆ రెక్కలు విచ్చుకోవాలి. రెక్కలు ముక్కలు చేసుకోవడానికే తను పుట్టానని భావించే స్త్రీ, ఆ రెక్కలకి రంగులు వేసుకోవచ్చని తెలుసుకుంటే ఏమవుతుంది? భార్గవి ఎవరితోనూ ఇలాంటి వాదన పెట్టుకోవాలనుకోవడం లేదు. అసలు అలా వాదించవచ్చని ఆమెకు తెలీనే తెలీదు.ఫోను మోగింది. అమెరికా నుంచి చిన్న కూతురు వాట్సాప్ వీడియో కాల్.