పోయింది - బావకు పెదమేనత్త. ముందూవెనుకా ఎవరూ లేకపోవడం వలన అన్నీ బావే చేశాడు. తీరా పాడె లేపాల్సిన వేళకి ఓ భుజం తక్కువపడింది. అటూ ఇటూ తేరిచూసి - బావ, పాడె కాంట్రాక్టరునే ఓ చెయ్యి వేయమన్నాడు. అతడు చిత్రంగా ఓ నవ్వు నవ్వి ‘నా పని ఇంత వరకే సార్.. కావాలంటే చెప్పండి...’ అంటూ, మరో కాంట్రాక్టుకు సంకేతం ఇచ్చాడు. ఈలోగా ‘గోవిందా అంటూ ఎత్తండ్రా’ అనే పొలికేకతో పాడె ముందువైపు బొంగు పట్టుకుని నిల్చున్నాడు, ఎప్పుడొచ్చాడో గానీ.. వీరామామ!ఆమె ఆఖరి యాత్ర మొదలైంది.
స్మశానంలోకి వెళ్లాక దింపుడుకళ్లెం అంటూ పాడె దించారు. అలవాటు కొద్దీ పేరుపెట్టి మూడుసార్లు అత్త చెవిలో పిలిచాడు బావ. ఆనక తీసుకెళ్లి కాష్టం మీద పడుకోబెట్టారు. భుజాన నీళ్లకుండ ఎలా పట్టుకోవాలో కూడా తెలియకుండా.. జారిపోతున్న పంచెని ఓ చేత్తో సర్దుకుంటూ బావ కాష్టం చుట్టూ తిరుగుతున్నాడు.దూరంగా ఓ చెట్టుకింద సమాధి మీద కూర్చుని ఉన్నాడు వీరామామ. నేను దగ్గరికెళ్లేసరికి, ఓ కొబ్బరి ముక్క అందించాడు. చేయిచాచబోయి ఉలిక్కిపడ్డా న్నేను. దింపుడుకళ్లేనికి దించినప్పుడు పాడె దగ్గర కొట్టిన టెంకాయ అది. ఓ చిప్ప తెచ్చుకుని సమాధిమీద గచ్చుపై కొట్టుకుని తింటున్నాడు మామ. వీరామామను మా వాళ్లలో కొందరు ‘వితండం గాడు’ అని ముద్దుగా ఎందుకంటారో అప్పుడు అర్థమైంది నాకు.
అత్తకు కపాలమోక్షం జరిగిపోయి, అందరం ఇంటికొచ్చినాక మెస్ నుంచి భోజనాలు వచ్చేదాకా కూడా మామయ్య ఆగలేదు. ‘‘పాడె మోస్తివే... పాలనాటికి ఉండాల్సిందే.. భుజాల్ని పాలతో తడుపుకోవాల’’ అని బావ హెచ్చరిస్తే ‘‘మీ అత్త తిరిగొచ్చి నన్ను మింగేయదులేరా’’ అని నవ్వేశాడు. ‘‘రాత్రి రైలుకి ప్రీమియం తత్కాల్లో రిజర్వు చేస్తా మామా’’ అని అక్క వారిస్తే ‘‘మీ సిటీలో దుడ్లు చెట్లకు కాస్తండాయా తల్లీ... నా బతుక్కి మద్దేనం పేసింజరు చాల్దా’’ అని తేల్చేశాడు. ‘‘తొలినుంచీ నీదంతా యితండమే...’’ అని అక్క విసుక్కుంది. నేనెటూ ఖాళీగా ఉన్నాను కాబట్టి మోటారు సైకిలుమీద స్టేషనుకు తీస్కెళ్లాను. ‘‘ఈ ట్రిప్పులో పల్లెకొస్తా మామా.. పొలం అమ్మేయాల’’ అన్నాను. ‘‘కౌలు నా కొడుకులు కతలు చెప్తావుంటే నువు మాత్రం ఏం జేస్తావులే.. రా.. బానే గిడతందిలే..’’ అంటూ రైలెక్కేశాడు.