కులాన్ని చర్చించే కథలు
కులం భారతీయ సమాజసాహిత్యాల నుంచి విడదీయరాని బతుకుచిత్రం. కులం నేపథ్యంతో వచ్చిన కథల్లోని సార్వజనీనతను ప్రామాణికంగా తీసుకొని 42 రచనలను ‘కులం కథ’ పేరుతో ప్రకటించారు సంపాదకులు. భాగ్యరెడ్డి వర్మ ‘వెట్టి మాదిగ’ కథ మాదిగలపై పటేళ్ల దౌర్జన్యాన్ని వర్ణిస్తుంది. వేలూరి శివరామశాస్త్రి ‘మాలదాసరి’ భక్తికి, ఓర్పుకు, సాయానికి కులం అక్కర్లేదని నిరూపిస్తుంది. చిలుకూరి దేవపుత్ర ‘ఊడలమర్రి’లో పంచాయతీ ఎన్నికల్లో దళితులకు రిజర్వేషన్ వచ్చినప్పుడు, వారిపై గ్రామపెద్దలు చేసిన దాడుల్ని కళ్లకు కడుతుంది. మంజరి ‘నిమిత్త మాత్రుడు’ బతికినంత కాలం కులం వెంటాడుతూనే ఉంటుందని వివరిస్తుంది. రావుల కిరణ్మయి ‘గంగిరెద్దు’లో కులస్వభాన్ని ఎదిరించిన రామలచ్చిమి పాత్ర ఆదర్శంగా నిలుస్తుంది. అంకురార్పణగా గోపిని కరుణాకర్ ‘కుమ్మరి చక్రం’ కులపురాణాల తత్వాన్ని వెల్లడిస్తే, ఉప సంహారంగా స్వామి ‘నిన్నటి ఊపిరి’ కులమతాల అడ్డుగోడలను చరిత్ర సాక్షిగా పెకలించి వేస్తుంది. 1927 నుంచి 2019 వరకు వచ్చిన సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక మార్పులను కులం కోణం నుంచి ప్రతిబింబిస్తున్నాయి ఈ కథలు.
- ఎ. రవీంద్రబాబు
కులం కథ (కథలు)
సంపాదకులు: కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్ళి మురళీమోహన్
పేజీలు: 367, వెల: రూ. 250,
ప్రతులకు: 0866 - 2436642 / 43