ఉత్తరాంధ్ర జనజీవన గమనం
‘బహుళ’చరిత్ర పరిణామాన్ని, తాత్విక ధారని, ఉద్వేగపు ప్రకంపనాల్ని రచనగా మలచడం అంత తేలికైన పనికాదు. ఒక నిగూఢ సంచలిత స్వభావంలోంచి పుట్టుకొచ్చే మనో నిబ్బరం కావాలి. పొలమారని జీవనచట్రంలోంచి మాట్లాడాలి. పోట్లాడాలి. కథకుడిగా, నవలాకారుడిగా, ఉద్యమకారుడిగా పాఠకలోకానికి తెలిసిన అట్టాడ అప్పల్నాయుడు గత వర్తమాన, భవిష్యత్తు కాలాల నుంచి ఓ వాస్తవిక ఎపిక్‌ను అలా అందించాడు. అదే ‘బహుళ’ నవల. ఈ బృహత్ రచన అయిదు దశాబ్దాల ఉత్తరాంధ్ర చరిత్రను బలంగా కాల్పనీకరించింది. గ్రామీణ భూస్వామ్య వ్యవస్థ నుంచి ప్రపంచీకరణ వరకు సాగిన, సాగుతున్న మనిషి మనుగడను నిక్షిప్తం చేసింది. శ్రీకాకుళం జిల్లా, గంగువాడ నేపథ్యంగా ఓ కుటుంబ జీవనచిత్రం మన ముందు కదలాడినా నక్సల్బరీ, చీలికలైన వామపక్ష ఉద్యమాలు, బహుళ ఏకీకరణే అవసరమన్న రచయిత అభిప్రాయాలు బలంగా కనిపిస్తాయి. పెదనారాయుడు, కనకంనాయుడు, నారాయుడు, బలరాం, రాధేయ, సత్యకాం, బంగారమ్మ, అన్నపూర్ణ, సంధ్య... ఒక్కోపాత్ర ఒక్కో చారిత్రక సంధి దశల్లోంచి, సిద్ధాంత భూమికల్లోంచి మనతో మమేకమవుతుంది. ఉత్తరాంధ్ర భౌగోళిక స్వరూపం మొత్తం మన కళ్ల ముందు కదులుతుంది. నాగావళి, వంశధార నదుల సవ్వడులు, తప్పెటగుళ్లు లాంటి పల్లె బతుకుల కళారూపాలు, పెదనారాయుడి వీరగాధలు, సంబరాలు, కులాల మధ్య అంతరాలు, భూమికోసం భుక్తికోసం జరిగిన పోరాటాలు, వలసలు, అరెస్టులు, నిర్బంధాలు... ఎన్నింటికో ఈ బహుళ సాక్షిగా నిలుస్తుంది. అక్షరం ముక్క రాని రైతు భూమికోసం ప్రజల పక్షాన పోరాడిన కాలం నుంచి తెలుగు సరిగా మాట్లాడడం రాని నేటి తరం వరకు సాగిన శ్రీకాకుళం ప్రజల అంతర్ బహిర్ యుద్ధారావమే ఈ నవల. ‘పెద్ద పల్లెంలో ఆరబోసిన వరి పిండిలాగుంది ఆకాశం తెల్లగా, పుచ్చ పువ్వుల్లాగ వెన్నెల.’ ‘వాతావరణం దుఃఖ శ్వాస తీసుకుంది’, ‘నాగావళి నది నీళ్ల మీద పొద్దు కదలాడుతోంది. దోసిళ్లతో పొద్దుని యెగరబోస్తుంది ప్రమీల’ లాంటి అప్పల్నాయుడి కవితా వాక్యాలు అక్కడక్కడా మన మనసులపై అలల్లా తేలాడుతాయి. ఇక ఉత్తారాంధ్ర భాష ఈ నవలలోని బంగారమ్మ ప్రేమలా కట్టిపడేస్తుంది. కథనం జ్ఞాపకాల కలబోతల్లోంచి ప్లాష్ బ్యాక్‌లతో మనపై తుఫానులా కురుస్తుంది. మొత్తంగా ‘బహుళ’ కూలిపోయిన ఆశల్లోంచి కొంగొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టాలంటుంది.
- ఎ. రవీంద్రబాబు
బహుళ (నవల),
రచన: అట్టాడ అప్పల్నాయుడు
పేజీలు: 467, వెల: రూ.300
ప్రతులకు: 94400 31961,
ప్రముఖ పుస్తకాల కేంద్రాలు