చిక్కనైన సాహిత్య పరామర్శ
సద్విమర్శ చేయాలంటే సృజనకారుడ్ని మించిన ప్రతిభాశక్తి ఉండాలి. లోచూపుతో కూడిన అధ్యయనం కావాలి. కవి, కథకులు ఆకెళ్ళ రవిప్రకాష్ అచ్చంగా ఇలా రాసిన సాహిత్య వ్యాసాలను ‘చంద్రుణ్ణి చూపించే వేలు’ పేరిట ముద్రించారు. 15 వ్యాసాలున్న ఈ పుస్తకంలో కవిత్వం, కథల మీద అనుభవం, తార్కికత, నిర్మాణాత్మక వ్యూహాలను అనుసరించి రవిప్రకాష్ చేసిన విమర్శ గాఢతతో నిండి కనిపిస్తుంది. మొదటి మూడు వ్యాసాలు ప్రముఖ కవి ఇస్మాయిల్‌తో తనకున్న సాన్నిహిత్యాన్ని, వారి కవిత్వంలోని నిశ్శబ్దం, ధ్వని, భాష, శైలిని విశ్లేషించేవి. ఇక నాలుగోది ఇస్మాయిల్ ఆత్మను పట్టించే ఇంటర్వ్యూ. రవి శంకర్, రవూఫ్‌లను దగ్గర నుంచి చూసి, వారి కవిత్వంలోని విశ్వసత్యాలను, వస్తు నవ్యతను, ప్రపంచాన్ని లోబరుచుకునే కవిత్వ సమ్మోహన రహస్యాలను వివరించారు. మరో వ్యాసంలో ప్రసాదమూర్తి కవిత్వంలోని గ్రామీణ యుద్ధ బీభత్సాన్ని, ఉద్యమ పరిణామాన్ని తెలియజేశారు. ‘యానాంలో ఫ్రెంచి పాలనకు దర్పణాలు దేవదానంరాజు కథలు’, ‘కాలానికి మిగిలే కవి బివివి’, ‘ప్రయోగవాద కవి ప్రసేన్’, ‘గోదావరి జిల్లాల కవిత్వానికి వారసుడు బొల్లోజు బాబా’ వ్యాసాలు పాఠకులకు కొత్తవిషయాలను పరిచయం చేస్తాయి. ‘నాజూకైన నగర కవిత్వం’లో వాడ్రేవు చినవీరభద్రుడి ‘నీటి రంగులు చిత్రం’ సంపుటిలోని ప్రతీకల్ని, క్రాస్ కల్చర్‌లోని కనెక్టివిటీని అద్భుతంగా వివరించారు. అంగలకుర్తి విద్యాసాగర్ ‘భద్రాచలం మన్నెం కతలు’ - వారి కవిత్వం గురించి రాసిన వ్యాసాలలో కథల్లోని భాషని, గిరిజనుల నేపథ్యాన్ని, అతడి హృదయాన్ని పట్టుకున్న రవిప్రకాష్, కవిత్వంలో పర్యావరణంపై వారికున్న ఇష్టాన్నీ వెల్లడించారు.
- ఎ. రవీంద్రబాబు
చంద్రుణ్ణి చూపించే వేలు (విమర్శ),
రచన: ఆకెళ్ళ రవిప్రకాష్‌పేజీలు: 88, వెల: రూ.100,
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు.