తెలుగులో వచ్చిన ఆత్మకథలు చాలా తక్కువ. అందులోనూ మహిళలు రాసినవి అతి తక్కువ. ఆత్మకథ అంటేనే ఆత్మస్తుతి, పరనింద లేని వాస్తవిక కథనం. కాళ్ళకూరి శేషమ్మగారి ‘చదువు తీర్చిన జీవితం’ ఆత్మకథలో ఆమెలోని క్రమశిక్షణ, నిజాయితీ, విలువలు కనిపిస్తాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి చిన్నకుటుంబాల వరకు సాగిన సామాజిక ప్రస్థానంలో స్త్రీ స్థానం ఎలా ఉందో అర్థమవుతుంది. చదువే లక్ష్యంగా శేషమ్మగారు సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకం. ఆమె ప్రతిభ, పట్టుదల, అడ్డంకులను అధిగమించిన తీరు ఆదర్శంగా నిలుస్తుంది. కుటుంబ బాధ్యతలను ఎంత చక్కగా నిర్వర్తించారో, ఉపాధ్యాయురాలిగా కూడా అంతే ఉన్నతంగా పనిచేశారు. వీరి దృష్టిలో చదువు అంటే కేవలం క్లాసు పుస్తకాలే కాదు, సాహిత్యం, సమాజం, పత్రికలు వగైరా ... వీటినుంచి ఎంతో నేర్చుకోవచ్చని ఆచరించి చూపారు. ఆశావహ దృక్పథంతో ముందుకు ఎలా వెళ్లాలో, ఓర్పుతో ఎలా నడుచుకోవాలో, కార్యసాధన ఎంత ముఖ్యమో వీరి జీవితం ద్వారా గ్రహించవచ్చు. సుమారు ఐదు దశాబ్దాల విద్యావిధానంలో వచ్చిన మార్పులను ఈ పుస్తకం పట్టి చూపిస్తుంది. కలలు నెరవేర్చుకోవాలని తపించే మహిళలకు ఈ పుస్తకం ప్రేరణ ఇస్తుంది అనడంలో సందేహం లేదు.- శ్రీభవ్య

చదువు తీర్చిన జీవితం(ఒక సామాన్య మహిళ ఆత్మకథ)

రచన: కాళ్ళకూరి శేషమ్మ

పేజీలు: 149, వెల: రూ.120,

ప్రతులకు: 98854 01882,9989051200,

నవోదయ బుక్‌హౌస్‌