మన ‘లోపలి ఖాళీ’లు

మనుషుల్ని ప్రేమించే తత్త్వం కోల్పోతున్నానంటూ మానసిక వైద్యుడ్ని కలుస్తాడు శంకరనారాయణ. చివరికి మనుషుల్ని ప్రేమించాలంటే తన మనసులో నిండిన చెత్తంతా తీసివేసి ఏ మాలిన్యమూ లేని ఖాళీ గ్లాసులా మార్చుకోవాలని తనకు తానే తెలుసుకుంటాడు ఆ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌. ‘లోపలి ఖాళీ’ కథాంశం మన మనసు లోతుల్ని స్పృశిస్తుంది. చిన్నప్పుడే కుటుంబమంతా దూరమైనా తనకు తానే ఎదిగి, సమాజంలో పేరున్న యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘ముక్త’ తనకు గుదిబండలా మారిన భర్త నుంచి విముక్తి కోసం చేసే యత్నమే లోపల ‘సముద్రం.. పైన ఆకాశం.’ తెలంగాణ సాయుధ పోరాటం, సహజవనరుల దోపిడీ, కార్పొరేటీకరణ, రాను రాను సమాజంలో... ముఖ్యంగా యువతలో లోపిస్తున్న నైతికత, బాధ్యతా రాహిత్యం కథాంశాలుగా సాగే లోపలిఖాళీకథా సంపుటిలోని కథలు ఆలోచింపజేస్తాయి. సమస్యల పట్ల లోతైన అవగాహన, విస్తృతమైన పరిశీలన, పొయిటిక్‌గా సాగే కథనం అదనపు ఆకర్షణలు.

- గొడవర్తి శ్రీనివాసు

లోపలి ఖాళీ (కథలు),

 రచన: రామా చంద్రమౌళి 

పేజీలు : 211, వెల: రూ. 250,

 ప్రతులకు : 93901 09993, నవోదయ