కలకంఠి కంట కన్నీళ్లు ...

పాలపర్తి జ్యోతిష్మతికి జీవితపు లోతులను నిశ్శబ్దంగా పరిశీలిస్తూ బయటికి కనబడని సంక్లిష్టతలను అర్థం చేసుకోగల సృజనాత్మకమైన నేర్పుంది. ఆ అనుశీలనతో తను పొందిన అనుభూతులను చిక్కని, చిన్న కథలుగా మలచి అందించే నైపుణ్యమూ ఉంది. ఈమె కథలన్నీ చిన్నవి, స్పష్టమైన ఏదో ఒక తాత్విక సందేశాన్నిచ్చేవి. పాఠకుడి హృదయంలో సంవేదనాత్మక చింతనను మిగిల్చేవి. ఒకేసారి ‘మనసు కోతివంటిది’, ‘ఈ పాపం ఎవరిది?’ అనే రెండు పుస్తకాలను అందించారు. రెండవ పుస్తకంలో ఒక నవలిక కూడా ఉంది. ఐతే ఈ రచనలన్నింటిలోనూ రచయిత్రి న్యాయమైన స్త్రీ సంబంధ సమస్యలను సహానుభూతితో చర్చించి ప్రత్యేకంగా వాటిని ‘స్త్రీ వాద కథలు’ అని ఉటంకించారు. తనగురించి తాను స్పష్టంగా చెప్పుకుంటూ ‘స్త్రీనై ఉండి స్త్రీవాదిని కావడం, స్త్రీవాద రచయిత్రిని అనిపించుకోవడం నామోషీగా ఎలా భావిస్తాను? సాటి స్త్రీలు పడ్తున్న ఇబ్బందులు, కష్టాలు చూస్తూకూడా రాయకపోవడం తప్పు. అందుకు రాస్తున్నాను నేను స్త్రీవాద సాహిత్యాన్ని’ అని చెప్పారు ముందుమాటలో. ఆ కోణంలో ‘ఉగ్రవాది తల్లి’, ‘శోకం’ వంటి చాలా కథలు అలరిస్తాయి. జ్ఞాపకముండే మంచి కథలివి.    

- రామా చంద్రమౌళి 

మనసు కోతివంటిది (కథలు

పేజీలు: 209, వెల: రూ.150

ఈ పాపం ఎవరిది? (నవలిక మరియు కథలు) 

పేజీలు: 161, వెల: రూ. 150

రచన: పాలపర్తి జ్యోతిష్మతి, ప్రతులకు: 97011 15600