ఊహించని మలుపులతో, హాస్యం, వ్యంగ్యం, సస్పెన్స్‌లతో సాగిపోయి కొస మెరుపుతో ముగిసే ఓ హెన్రీ (విలియం సిడ్ని పోర్టర్‌) కథలకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. ఓ హెన్రీ అనగానే గుర్తొచ్చే ‘క్రిస్మస్‌ బహుమతి’ కథతో పాటు ఆయన రాసిన వందల కథల్లో నుంచి ఎంపిక చేసిన 21 కథల అనువాద పుస్తకమిది. సామాన్యుల జీవితాలను, సరళమైన శైలిలో రాయడం వలన ఓ హెన్రీ కథలు ఎప్పటికీ బతికే ఉంటాయి. ఆయన కథల్లోని సామాన్య పాత్రలు, చదివింపచేసే శైలి, కథను నడిపించే విధానం, పదాల ఎంపిక, పాత్ర చిత్రణ ఇవన్నీ కూడా ఆయనను అమెరికాకు చెందిన ఉత్తమ కథకుడిగా తీర్చిదిద్దాయి. వేగంగా రాస్తూనే కథకు పాపులారిటీ కల్పించిన రచయితల్లో ఓ హెన్రీ ఒకరు. ‘ప్రేమ పక్షులు’, ‘నగరం యొక్క కంఠ ధ్వని’, హృదయాలు - హస్తాలు’, ‘ఆఖరి పత్రం’ లాంటి కథలు చదువుతున్నప్పుడు రచయిత కథా విలక్షణతకు అచ్చెరువొందుతాం. అనువాదకుని చేయిని దాటుకొని అక్కడక్కడ పడిన కొన్ని కృతక వాక్యాలు మినహా అనువాదం కూడా చాలా సాఫీగా సాగింది. పాత్రల పేర్లు, ప్రదేశాల పేర్లు తీసివేస్తే ఇవి తెలుగు నేల మీద జరిగిన కథలేమో అనేంత బావుంది అనువాదం. ఔత్సాహిక కథా రచయితల్తో పాటు కథా ప్రేమికులంతా చదివి తీరవలసిన కథలివి.

- వెల్దండి శ్రీధర్

ఓ హెన్రీ కథలు, అనువాదం: శ్రీరాగి

పేజీలు: 120, వెల: రూ. 100

ప్రతులకు: పల్లవి పబ్లికేషన్స్‌ - 98661 15655