దళిత సౌందర్య శాస్త్రం

తెలంగాణ సాహిత్యంలో ఇప్పుడు పునరుజ్జీవ దశ కొనసాగుతోంది. ‘తెలంగాణ దళిత సాహిత్యం సంస్కృతి, కళారూపాలు’ పై నిర్వహించిన జాతీయ సదస్సులో సమర్పించిన 20 పరిశోధన పత్రాల సంకలనం ఇది. దశాబ్దాలుగా వివక్షకు, నిర్లక్ష్యానికి గురైన దళిత్‌ ఈస్తటిక్స్‌ను, వైభవాన్ని ఇప్పటి తరాలకు తెలియజేయడానికి తెలంగాణ సారస్వత పరిషత్తు చేసిన ఈ ప్రయత్నం అభినందనీయం. ఉత్పత్తి కులాల భాషను సాహిత్యంలోకి రాకుండా ఉక్కుచట్రాలు బిగించిన వ్యాకరణవేత్తల విధానాన్ని చర్చించిన జూపాక సుభద్ర వ్యాసం ఆలోచనాత్మకం. ఈ నేలమీద మొదటి పాట ఈ దేశ మూలవాసుల నోటి నుండే పుట్టిందని ప్రతిపాదిస్తూ రాసిన పసునూరి రవీందర్‌ వ్యాసం కొత్త ద్వారాలు తెరుస్తుంది. తెలంగాణ దళిత సాహిత్య పరిణామాన్ని వివరించిన సి. కాశీం, తాళపత్ర రచన మీద బానాల రాజమౌళి కృషిని తెల్పుతూ సాగిన డా. గోగు శ్యామల, మాదిగ చరిత్ర గురించి రాసిన గుర్రం సీతారాములు, దళిత కళా రూపాల నేపథ్యాన్ని పరిచయం చేస్తూ గడ్డం మోహన్‌రావు రాసిన వ్యాసాలు ఈ పుస్తకానికే కొత్త వెలుగు. తెలంగాణ దళిత సాహిత్యం సంస్కృతి, కళారూపాలపై ముందు ముందు జరిగే పరిశోధనలకు, అధ్యయనానికి, ఒక స్థూల అవగాహనకు ఈ పుస్తకమెంతో ఉపయుక్తం.

- వెల్దండిశ్రీధర్‌

తెలంగాణ దళిత సాహిత్యం సంస్కృతి, కళారూపాలు

ప్రధాన సంపాదకులు: ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, పేజీలు: 307,వెల: రూ. 150,

ప్రతులకు: తెలంగాణ సారస్వత పరిషత్తు, హైదరాబాద్‌.