ఒక సంచారి మోహ లేఖలు

అందమైన మంజూషలో మోహ లేఖలు దాచి ‘ఎల్లో రిబ్బన్‌’ పూముడితో పద్మ అందించినపదహారో అక్షర కానుకిది. ఇందులోని నిత్యసంచారికీ తిలక్‌ అహల్యకూ అతి దగ్గరి భావసారూప్యత. ‘పువ్వు విరిసినా, మబ్బు మెరిసినా, వానలో తడిసినా, గాలిపొర కదిలినా చలించిపోయే వీరికిఅనునిత్యం ఊరట కావాలి, ప్రేమ కావాలి, అక్కున చేర్చి లాలించే హృదయం కావాలి.’ కనిపించని దూరాల్లోని సహచరుడికి ఒక ప్రేమిక రాసిన ఈ తూలికాక్షరాలన్నీ భావతుంపరలే. రోజూ వాకిట రాలిన శేఫాలికల్ని నిర్దయగా తొక్కిన మనమే ఈ లేఖలు చదివిన ప్రభావంతో మర్నాడు ఆపువ్వుల్నే అపురూపంగా ఏరి ఆఘ్రాణిస్తాం. నిన్నటిదాకా వినని బాల్కనీలోని పక్షుల కువకువల్ని చెవులారావింటూ పరవశిస్తాం. మావిచివుళ్లు మేసి కూసే పికాల స్వరంతో గొంతు కలుపుతాం. తిలక్‌ కవిత్వాన్ని చలం వచనాన్ని గంధంలా అరగదీసి పన్నీరులా చిలకరించిన పద్మ పదలాలిత్యానికి కరిగి ముగ్ధులమవుతాం. ‘పసి అలల రెక్కల్లోంచి విరిగే నీలివర్ణపు తుంపరలు, అరచేతిలో గోరింట పూయించిన చుక్కల చందమామలు, హిమ సౌగంధాన్ని నెమరేస్తున్న లేతాకు పచ్చని గాలులు..’ - లేఖలనిండా మోహపు పారవశ్యమే. ఈ అక్షరాల లాహిరిలో మనమంతా ఆ హిమాలయ సానువుల్లో మంచుపూలు ఏరుకుంటూ, నదుల లంకల్లో గాలికి వయ్యారాలొలికే గరికపూలను గుండెకదుముకుంటూ, కడలి ఇసుకలో మెత్తని ‘పద’ధ్వనులు వింటూ.. కానరానిదిగంతాల్లో ఈ సంచారితో కలిసి అడుగులేస్తాం. మొగలిపువ్వుంటే రంపపు కరకుదనానికి బదులు .. నూనూగు పొత్తు పరిమళమని స్ఫురించేవారికే ఈ లేఖల సారాంశం సొంతమవుతుంది. ఆనక, ఈలవేస్తూ కృష్ణశాస్త్రి చిరుగాలి తరగలా, చిన్నారి పడవలా పసరు రెక్కలు పరచి పరుగులిడతారు.

- తహిరో

ఎల్లో రిబ్బన్‌ (మోహ లేఖలు),

రచన: కుప్పిలి పద్మపేజీలు: 88,

వెల: రూ. 100, ప్రతులకు: నవోదయ 040 - 2465 2387