దశరథుని పుత్రకామేష్ఠి

సూర్యోదయం అయింది. వాల్మీకి ఆశ్రమానికి నారదమహర్షి విచ్చేశాడు. అతనికి అన్ని సపర్యలూ చేశాడు వాల్మీకి. తర్వాత ఇలా ప్రశ్నించాడతన్ని.‘‘మహర్షీ! లోకంలో పరాక్రమ, జ్ఞాన సద్గుణాల్లో సర్వశ్రేష్టుడు ఎవరు? అటువంటి వ్యక్తి ఉన్నాడా? ఉంటే దయచేసి అతని గురించి వివరించండి.’’సమాధానంగా సన్నగా నవ్వాడు నారదుడు.‘‘ఇది నా వేడుకోలు స్వామీ! అనుగ్రహిం చండి.’’ చేతులు జోడించి నమస్కరించాడు వాల్మీకి. అతని హృదయవేదనను అర్థం చేసు కున్నాడు నారదుడు. చెప్పాడిలా.‘‘సద్గుణాల్లో సర్వశ్రేష్టుడు లేకనేం, ఉన్నాడు. అతని పేరు శ్రీరామచంద్రుడు. అయోధ్యను ఏలు తున్నాడు.’’ అన్నాడు. తర్వాత రామకథను సంగ్ర హంగా వివరించి, వెళ్ళిపోయాడు అక్కణ్ణుంచి. నారదుడు చెప్పిన రామకథను పదేపదే మననం చేసుకున్నాడు వాల్మీకి. అద్భుతం, అమోఘం అను కున్నాడు. అంతలో శిష్యుడు భరద్వాజుడు వచ్చాడక్కడకి. ఇద్దరూ స్నానానికి బయల్దేరారు. తమసానదిని సమీపించారు. దారిలో ఓ చెట్టు మీద క్రౌంచపక్షుల జంటను గమనించాడు వాల్మీకి. చాలా ఉల్లాసంగా ఉన్నాయవి. ప్రేమో న్మత్తంగా ప్రవర్తిస్తున్నాయి. అంతలో ఓ బాణం వచ్చి జంటలోని మగపక్షిని కూల్చింది. ప్రాణాలు కోల్పోయి చెట్టుపై నుంచి కిందపడింది మగపక్షి. దానిని చూసి ఆడపక్షి రోదించసాగింది. చూశా డది వాల్మీకి.

జాలితో చలించిపోయాడతను. ఆవే దన చెందాడు. ఆ ఆవేదన ఆవేశమయింది. తల తిప్పి చూశాడిటు. తన బాణానికి నేల కూలిన పక్షికోసం పరుగున వస్తున్న బోయ కనిపించాడు. రక్తారుణనేత్రా లతో ఇలా శపించాడతన్ని.‘‘మానిషాద ప్రతిష్ఠాం త్వ, మగమః శాశ్వతీం సమాః,యత్‌ క్రౌంచ మిథునాదేక, మవధీః కామ మోహితమ్‌.’’‘‘ఓయీ బోయా! ప్రేమోన్మత్తమై ఉన్న ఈ జంట పక్షులలో ఒకదాన్ని చంపిన కారణంగా కల కాలం నువ్వు అప్రతిష్ట పాలవుదువుగాక.’’ముని శాపానికి భయపడ్డాడు బోయ. అక్క ణ్ణుంచి పరుగందుకున్నాడు. భయపడి పారి పోతున్న బోయని చూసి, తలవిదిల్చాడు వాల్మీకి. జాలి చెందాడు. శాంతించాడు. మధనపడ్డాడు.తనకేమయింది? ఎందుకిలా ప్రవర్తించాడు? అనుకున్నాడు. తర్వాత శాపాన్ని తలపోశాడు. చక్కని పదాల పొందికతో, రెండు సమపాదాలతో, శ్లోకమయిన తన మాటలకు తానే విస్తు పోయాడు వాల్మీకి. ఆ మానసికావస్థలోనే శిష్యుని సహా స్నానం ముగించుకుని, ఆశ్రమానికి చేరు కున్నాడు. మౌనంగా కూర్చున్నాడక్కడ. కళ్ళు మూసుకున్నాడు. జరిగిన దాని గురించి ఆలో చించసాగాడు.ఎవరో వచ్చిన అలికిడి అయింది. కళ్ళు తెరచి చూశాడు. సృష్టికర్త, చతుర్ముఖుడు సాక్షాత్తు బ్రహ్మ. సాక్షాత్కరించాడక్కడ. దేవతలతోనూ, ఋషులతోనూ తరలి వచ్చాడు. అతనికి చేతులు జోడించి, నమస్కరిస్తూ లేచి నిల్చున్నాడు వాల్మీకి.‘‘వాల్మీకీ! నువ్వెలాంటి పాపకార్యమూ చెయ్య లేదు. మంచిపనే చేశావు. చేసిన మంచిపనికి ఆనందించు. నా ఆదేశానుసారం, వాణి నీ వాక్కులో ప్రవేశించింది. దాని ఫలితమే శోకంతో నువ్వు పలికిన వాక్కు, శ్లోకరూపం దాల్చింది.’’ అన్నాడు బ్రహ్మ. అవునా! అన్నట్టుగా ఆశ్చర్య పోయాడు వాల్మీకి.‘‘నారదుడు చెప్పిన రామకథను నువ్విందాక పలికావే శ్లోకం, ఆ శ్లోక ఛందస్సులోనే కావ్యంగా రచించు. అది లోకకల్యాణకారకమవుతుంది. తర తరాలూ వర్థిల్లుతుంది.’’ఆనందంతో చలించిపోయాడు వాల్మీకి.‘‘నా అనుగ్రహంతో రామకథలోని పాత్రలు ఏఏ పనులు చేపట్టిందీ, వారేం మాట్లాడిందీ, ఎలా ఆలోచించిందీ అన్నీ నీ దివ్యదృష్టికి అందు తాయి. అలా అందడమేకాదు, నా ఆశీస్సులతో నువ్వు రచించిన మహాకావ్యం ఈ విశ్వం అంతటా వ్యాపించి, కులపర్వతాలూ, సాగరాలూ, సూర్య చంద్రులూ ఉన్నంతకాలం వర్థిల్లుతుంది. నీ కావ్యం సహా నువ్వు కూడా కీర్తిమంతుడ వవుతావు. తర్వాత మాలోకాన్ని అలంకరిస్తావు.’’ అన్నాడు బ్రహ్మ.‘‘దైవానుగ్రహం’’ అన్నాడు వాల్మీకి.తలవంచాడు. ఋషులూ, దేవతలుసహా బ్రహ్మఅదృశ్యుడయ్యాడు. బ్రహ్మోపదేశానికీ, ఆదేశానికీ ఆనందించి, వాల్మీకి రామకథను రచించేందుకు సిద్ధమయ్యాడు. ధ్యానమగ్నుడయ్యాడు. రామకథ అంతా అతని కళ్ళకు బొమ్మ కట్టింది.