బాబా అని ముందు పిలిచింది ఎవరు

పేరు ఏదయినా, రూపం ఏదయినా అన్ని జీవుల్లోనూ ఉన్న ఆత్మ ఒక్కటే! ‘సబ్‌ కా మాలిక్‌ ఏక్‌’ అంటూ తనని ఏ రూపంలో ఆరాధిస్తే ఆ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తూ అన్నింటా తానేనని నిరూపించిన కలియుగ ప్రత్యక్షదైవం సాయిబాబా! తన పదహారవ ఏట ఒకసారి, ఇరవయ్యో ఏట మరోసారి షిరిడిలో అడుగు పెట్టి, అరవై ఏళ్ళ పాటు షిరిడిలో సంచరించిన దేవదేవుడు సాయిబాబా! అతని జన్మ రహస్యాలు ఎవరికీ తెలియవు. కాని అతని జీవిత విశేషాలు అందరూ తెలుసుకోదగినవి. పదే పదే పఠించదగినవి. ఆ విశేషాల సమాహారమే ఈ  సాయి పారాయణం. ఆంధ్రజ్యోతి సాహిత్యం పాఠకులకు ఇది ప్రత్యేకం.

షిరిడిమహారాష్ట్రలో ఓ చిన్న గ్రామం. అప్పుడే తెల్లగా తెల్లారింది. తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు. మారుతి మందిరంలో పువ్వులు కోసుకుని, పూజ చేసుకునేందుకు ఇంటి నుంచి బయల్దేరింది ఓ వృద్ధురాలు. అడుగులో అడుగు వేసుకుని మెల్లగా నడుస్తోంది. ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూడాలనుకుందామె. తలెత్తి చూసింది. వేపచెట్టు మీదుగా ఉదయిస్తున్న సూర్యుడితో పాటు, ఆ చెట్టు కింద ధ్యానంలో ఉండి, సూర్యుడిలా వెలిగిపోతున్న ఓ యువకుడు కనిపించాడామెకి.కనిపించిన ఆ యువకునికి పదహారేళ్ళ వయసు ఉంటుంది. తెల్లటి పొడుగాటి కఫిని ధరించాడతను. తలకి టోపిలా రుమాలు చుట్టి ముడి వేశాడు. భుజాన్న జోలె వేలాడుతోంది. ఎడమ వైపున సటకా ఉంది.ఎవరితడు? పట్టి పట్టి చూసిందామె.ఈ ఊరి వాడు కాదు.మరెక్కడి వాడు?ఎక్కడి వాడయితేనేం? ముస్లిం అయితే ఉండేందుకు మసీదు ఉంది. హిందువయితే ఉండేందుకు మారుతి మందిరం ఉంది. అక్కడెక్కడా ఉండక, ఈ వేపచెట్టు కింద ఉన్నాడేం పాపం?‘‘బాబు’’ అని పిలవబోయిందామె. అయితే ఆ మాట ‘బాబా’గా ఆమె నోటి వెంట వెలువడింది. ‘బాబా’ అంటే తండ్రి అని అర్థం.‘‘బాబా’’కళ్ళు తెరిచాడు బాబా. కరుణతో చూశాడామెను. చల్లగా అనిపించిందామెకు.‘‘నీ పేరేమిటి?’’ అడిగింది. నవ్వాడు బాబా.‘‘పేరడిగితే నవ్వుతావేమిటి? నీ పేరేమిటి?’’ రెట్టించిందామె.‘‘నువ్వు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలుకుతాను.’’ అన్నాడు బాబా.