‘‘ఎంత ప్రేమించాలో, ఎలా ప్రేమించాలో, పెదవులెపుడు కలవాలో, చేతులెపుడు పెనవేసుకోవాలో... దానికో పద్ధతుంటుంది. ప్రేమ పెరక్కుండా, మోహం బరువు కాకుండా జాగ్రత్తపడాలి. రోజుక్కొంచెంగా ఇష్టాన్ని చంపేసుకోవాలి.’’అనాది విశ్వంలో గ్రహగోళాలకావల జనించిన కాంక్షనై ఘనీభవించి, ఘనీభవించి, భ్రమిస్తూ, పరిభ్రమిస్తూ ఏమరుపాటుగా జారి భూమిని చేరి విస్ఫోటించి, అనుక్షణం జ్వలిస్తూ... చల్లార్చే రసహృదయి కోసం నిరీక్షిస్తున్నా. నన్ను నేనే దహించేసుకుంటున్నా.. జల్ తే హై జిస్ కేలియే... ఎదురుచూపులో కరిగిపోతోంది కాలం...‘‘తూ హోగా జరా పాగల్’’... రింగవుతోంది...హా మై పాగల్ హూ... పుట్టుకతోనే.కొన్ని వసంతాలు... కొన్ని శిశిరాలు..రెండిటి మధ్య పరుచుకున్న అనేకానేక మోహ శిఖరాలు... వియోగ అగాధాలు... సంతోష సంద్రాలు... దుఃఖ తీరాలు.అరచేతిలోని మొబైల్ వెక్కిరిస్తోంది...ద నంబర్ యు ఆర్ ట్రయింగ్ టు రీచ్ ఈజ్... నచ్చని వాక్యం పదే పదే వినాలంటే చాలా కష్టం.హైదరాబాద్‌లో సాయంత్రాలు ఎంత అందంగా ఉంటాయో... ట్రాఫిక్ అంత విరక్తి కలిగిస్తుంది.
పంజాగుట్ట దాటితే చాలు... పద్మవ్యూహం ఛేదించినట్టే. లా మకాన్‌లో ప్లే ఒకటి ఉంది వెళ్దామా అనిపించింది క్షణకాలం. కాని ఇంటికొచ్చేశాను. నిశ్శబ్దం... లోపలా, బయటా.రాత్రి తొమ్మిది దాటింది. బయట సన్నగా జల్లు మొదలయింది.నాకై పలికే శతతంత్రుల వీణై... నా కోసమే విచ్చుకునే పూవై... వెచ్చని కావలింతై... జోరున కురిసే జడివానయ్యే నీలూ... అలసి సొలసి నా భుజంపై వాలి... ఒళ్ళు తెలీకుండా... రాత్రెప్పుడయిందో... ఎప్పుడు తెల్లారిందో ఎవడిక్కావాలి... నీలూ పరిమళం... నీలూమయం... ఇంట్లో ఎటు తిరుగుతున్నా... నీలూ... నీలూ...డిన్నర్ అయిందనిపించి పనిలో పడ్డా.ఓ బడా కంపెనీ యాడ్ డెడ్‌లైన్ దగ్గరికొస్తోంది.
రష్ చెక్ చేద్దామని... ల్యాపీ ఆన్ చేశా... టీవీలో చోటాసా సాయా థా... ఆంఖోంమె ఆయా థా... సురేష్ వాడ్‌కర్ మనసును కరిగించేస్తున్నాడు. నా మొబైల్ సైలెంట్‌గా చూస్తోంది. పనిలో పడితే అంతే. తనకేం గుర్తుండదు. తన గురించి కూడా తాను ఆలోచించదు. ఎవరన్నా ఎదురుచూస్తున్నా పట్టదు. క్షణమొక యుగమైన కాలంలో నేను...