ఒక్కొక్కరిదీ ఒక్కోరకమైన జీవనపోరాటం. తమ బతుకేదో తాము బతుకుదామనుకునే వారిదీ పోరాటమే, పరుల కోసం బతకా లనుకునేవారిదీ పోరాటమే. ఎవరి జీవితం వారికి చిత్రమైనదైనట్టే, పోరాటమూ బహు విచిత్రమైనది. ఒక్కొక్కరి అనుభవంలో ఒక్కోతీరుగా పోరాటం రూపం మార్చుకుంటుంది. ఎవడి అనుభవం వాడిదే. ఆ అనుభవాలను అన్వయించుకుంటూ చేసే పోరాటాలు తాత్కాలిక విజయాలనే అందిస్తాయి. అందుకే సమున్నత మానవ వికాసం కోసం అందరి అనుభవాలు క్రోడీకరించిన వైవిధ్య ప్రజా పోరాటాలు కావాలి అంటుంది ‘బహుళ’ నవల.

 
ఉత్తరాంధ్ర రచయిత అట్టాడ అప్పల్నాయుడు వినిపిస్తున్న ఆత్మకథనాత్మక గానం ‘బహుళ’. విభిన్న చారిత్రక దశల్లో మానవ పోరాట పరిణామ క్రమాన్ని పొదివి పట్టుకున్న అరుదైన పాఠ్య గ్రంథం ఇది. నాలుగైదు తరాల మానవ పోరాట సజీవ చరిత్రకు నిర్దిష్ట దర్పణం ‘బహుళ’ నవల. చరిత్రకారులు చరిత్ర రికార్డు చేసే పద్ధతి వేరు. ఆ శాస్త్రీయ దృక్కోణాలు, ఆ తీరు భిన్నమైనవి. వీటికి మానవోద్వేగాలతో సంబంధం ఉండదు. ఒక రచయిత చరిత్రను రికార్డు చేయడమంటే.. ఆయా కాల వ్యవధుల్లోని మనుషుల కలలనీ, కన్నీళ్లనీ; బతుకు ఆరాట, పోరాటాలనీ; కళలు, సాంస్కృతిక సంబంధాలు; హార్దిక, ఆర్థిక ఉత్థాన పతనాలు.. ఒకటేమిటి మొత్తం ఆ కాలప్రవాహ మంతటినీ కాగితాల మీదుగా పారించడమే. ఆ భగీరథ యత్నాన్ని చిత్తశుద్ధితో సాధించాడు అప్పల్నాయుడు. 
 

స్వాతంత్ర్యానికి పూర్వం పెదనారాయుడు దగ్గర నుంచి మొదలుపెడితే, నాలుగు తరాల తరువాత సత్యకాం వరకూ-ప్రజల కోసం నిలబడటంలోని కష్టానికి నిలువెత్తు సజీవ సాక్ష్యాలు ఇందులోని పాత్రలు. పెదనారాయుడు ప్రజలకు అండగా నిలిచి తెల్లదొరలను సైతం ఎదిరించి గ్రామీణులందరికీ ఆరాధ్యదైవంగా నిలుస్తాడు. అనూహ్యరీతిలో, అతి భయంకరంగా హత్యకు గురైన పెదనారాయుడు బోనెల పాటలో, ఒగ్గుపాటలో, బుర్రకథలో మరింత కాల్పనికతను సంతరించుకుని పల్లె జనంలో పౌరుషాగ్నిని రగిలిస్తూనే ఉంటాడు. ఆ లక్షణాలు పెద్దకొడుకైన గుంపస్వామికి రావుగానీ, రెండో కొడుకు రామస్వామికి బానే అబ్బుతాయి. కుల గోత్రాలు లెక్కచేయకుండా న్యాయంవైపు, సత్యం వైపు నిలబడతాడు రామస్వామి. కానీ, భార్య వదిలిపెట్టి వెళ్లిపోవడం వల్ల తాగుడుకు బానిసై పోతాడు. కంటికి రెప్పలా చూసుకునే కూతురుతో వుంటూ అణగారిన వర్గాలవారికి అండగా నిలు స్తూంటాడు. 

అతికిరాతకంగా జరిగిన తండ్రి హత్యే భయపెట్టిందో, మారుతున్న పరిస్థితుల్లో తన మాట చెల్లుబాటు కాదనుకున్నాడో మునసబు పదవి వున్నా గుంపస్వామి మూగివాడిలా మిగిలిపోతాడు. పెదనారాయుడి కూతురు వరాలమ్మ కొడుకు నారాయుడి తరం వచ్చేసరికి బతుకుపోరాటమే ప్రధానమైపోతుంది. మొదట భిలాయ్‌, తరువాత అండమాన్‌ వలసపోతాడు. గొల్లపడుచును లేపుకెళ్లి ఓ కొడుకును కన్న నారాయుడు, కొంతకాలానికి తిరిగొచ్చి మేనకోడలినే వివాహం చేసుకుంటాడు. మొదటి భార్య బంగారమ్మ ఎవరికీ చెప్పకుండా అదృశ్యమైపోతుంది. మొదటి భార్య, రెండో భార్య పిల్లలతో బతుకు ఈడ్చడానికి ఆ పల్లెలో నారా యుడు పడరానిపాట్లు పడతాడు. ఎన్నో కలలు కన్న స్వాతంత్య్రం ఎటువంటి ఫలితాలను అందివ్వకపోవడం నారాయుడి తరంలోని యువకు లందరినీ నిరాశకు గురిచేస్తుంది.

మన జీవితా లను మనమే మార్చుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల రాజకీయాల్లోకి దిగుతాడు గుంపస్వామి కొడుకు కనకం నాయుడు. ఆధిపత్యాన్ని, రాజ్యాన్ని వ్యతిరేకిం చకుండా.. రాజ్యాంగం కల్పించిన వెసులబాటుల తోనే ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కనకం నాయుడిలాంటి వాళ్లు శతవిధాలా ప్రయ త్నించి తలబొప్పిగట్టించుకుంటారు. రాజులు, కోటలు, జమీందార్లతో తలపడి ఎదురుదెబ్బలు తింటాడు. కొంతకాలం గడిచేసరికి ఓడలు బళ్లవుతాయి.. రాజ్యమంటే- కోటలుగాదు, రాజులుగాదు, జమీం దార్లుగాదు.. కేవలం ఓట్లు మాత్రమే. మరోవైపు కింది కులాల్లో రాజకీయ చైతన్యం తలెత్తుతుంది. అయితే, వాళ్లని ఆధిపత్య వర్గాలు తమ చెప్పు చేతల్లో నడిపిస్తూ ఉంటాయి. కరణాలు, మునస బులు, తహశీల్దార్లు.. మరీ ముఖ్యంగా పోలీసుల ప్రాబల్యం పెరిగిపోతుంది. హింస అనివార్యమవు తుంది. దాంతో ప్రతిఘటన పెల్లుబుకుతుంది.