వాన కురిస్తే

నాలో కూడా కురిసేది.
ఉరుము ఉరిమితే
నాలోపల కూడా ఉరిమేది.
మెరుపు మెరిస్తే
నా లోపల కూడా మెరిసేది.
 
వాగులూ వంకలూ
ఉన్మాదంగా ఊగుతున్న చెట్లూ
చీకటి మూసిన ఆకాశాలూ
తళ తళ మిరుమిట్లూ
ఫెళ ఫెళ భగ్నతరు విస్ఫోటనలూ
అన్నీ నా లోపల కూడా
ప్రజ్వలించేవి ప్రతిధ్వనించేవి
 
అపుడు నేను వేరు
తాను వేరూ కానట్టుండేది
ఇపుడేమిటి ఇలా?
ఏరు ఎవరోలా అనిపిస్తోంది
ఎవరో ఏరులా కనిపిస్తుంది.
 
ఎడమ పాదం మీద
ఎంతో అమాయకంగా
ఉదయించిన కొనగోరంతటి
చిట్టి చంద్రవంక అటుసాగి,
ఇటు సాగి, అటు ఎగిరి ఇటు ఎగిరి,
ఇటు పొరిలి అటు పొరిలి,
ఇటు లేచి అటు లేచి
పాదపదపదపత్రతతినొక
భయదకానన హేల చేసి
దష్ట దహనపుకీల చేసి
కాలినిండా కణకణానా
ఢమరుకాలై త్రిశూలాలై
జివ్వు జివ్వున రివ్వు రివ్వున
నొప్పికణికలు చిందుతుంటే
ఏకమై ఆ ఇనుడు భానుడు
కారు చిక్కని ఏ నిశీధిలో
చిక్కుకున్నారో.
 
అంకుశ పీడిత పీడ
మృత్యు సన్నిభ ‘అడుగడుగు జాడ’.
బాధవయసు యేమో కానీ
డెబ్బయ్యేళ్ళ అనుభవాల
ఈ ముళ్ళకంప కొట్టుకొచ్చి
‘నా తల్లి’ ఇంటికి, అరవై రోజులు.
మిగిలిందేమున్నది ఇంక,
పులి నోటికి పూర్తిగా
చిక్కినట్టే ఉంది ఈ జింక! 
 
దేవిప్రియ (అముద్రిత ఆఖరు కవిత)