రాత్రి చలిమంటల వెలుగులో 

చెట్ల రంగులు
రకరకాలుగా కనబడుతున్నాయి.
రాలుతున్న ఆకులు
గాలికి వూగిపోతున్నాయి.
 
బొంగురు గొంతుకలతో కొన్ని 
గుసగుసగా,
కీచుగొంతుకతో మరికొన్ని
కిచకిచమంటు పక్షులు
వింత భాషల్లో సంభాషిస్తున్నాయి.
 
పక్షుల తోకల రంగులు
ఆకుల్లా కనబడుతూ గాలికి వూగుతున్నాయి.
 
సూర్యుడు అస్తమించినందుకు
సంతాప సూచకమో ఏమో
కుక్కలు రోదిస్తున్నాయి.
 
కదులుతున్న గాలికి
చెలరేగుతూ మంటలు.
 
కిటికీలోంచి తదేకంగా చూస్తూనే వున్నాను.
 
నక్షత్రాలు గుమిగూడడం
రాత్రి నలుపుదేరడం
నాలోపల భయం ఆవరించడం
అన్ని గమనిస్తూనే వున్నాను.
 
రాత్రి గడిచిన కొద్దీ
నలుపు ఆధిపత్యం
స్పష్టంగా తెలుస్తోంది.
 
వయసు పైబడిన కొద్దీ
నా మనసు మీద
దుఃఖానిదే ఆధిపత్యం
అని మరీమరీ అనిపిస్తోంది.
 
ఆకెళ్ళ రవి ప్రకాష్‌
94905 17777