గోరటి వెంకన్న సాహిత్యాన్నిప్రముఖ తెలుగు స్కాలర్‌ కోయి కోటేశ్వరరావు గొప్పగా శ్లాఘిస్తూ విశ్లేషణ చేశారు. ఈ ఇరువురు కూడా హిందూ మత కుల భూస్వామ్యానికి బలైన వర్గాల నుండి వచ్చినవారే. కోయి కోటేశ్వరరావుకు మంచి పరిశోధకుడిగా పేరుంది. కాని ఆయన వెంకన్న పాటని విశ్లేషించిన తీరు మాత్రం సామాజిక చలన సూత్రాలకు విరుద్ధం.

 
పాటకు ప్రతిఘాత స్వభావం వుంటుందా? వుంటుంది. ఎలా? అది సామాజిక మార్పులను స్వాగతించకుండా పాత వ్యవస్థని కీర్తించిన ప్పుడు ప్రతిఘాత స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. సహజం గానే ఫ్యూడల్‌ భావజాలం మార్పును స్వాగతించదు. పాత వ్యవస్థనే కీర్తించి, పాడుతుంది. ఈ ఫ్యూడల్‌ వ్యవస్థ వల్ల లాభపడిన శక్తులు, వ్యక్తులు దాన్ని కీర్తించడంలో అర్థ ముంది. కాని ఫ్యూడల్‌ కులవ్యవస్థ వల్ల, దాని భావజాలం వల్ల దోపిడికి గురైన సమూహాల నుండి వచ్చిన వ్యక్తులు ఆ వ్యవస్థ ధ్వంసాన్ని శ్లాఘించడం ఏ యిజంలోకి వస్తుందో వారికే తెలియాలి. గోరటి వెంకన్న ‘పల్లెకన్నీరు పెడుతుందో’ అనే పాట కూడా ఈ కోవలోకే వస్తుంది. గోరటి వెంకన్న సాహిత్యాన్ని ప్రముఖ తెలుగు స్కాలర్‌, కోయి కోటేశ్వర రావు గొప్పగా శ్లాఘిస్తూ విశ్లేషణ చేశారు (వివిధ: 4 నవంబర్‌ 2019). ఈ ఇరువురు కూడా హిందూ మత కుల భూస్వామ్యానికి బలైన వర్గాల నుండి వచ్చినవారే. కోయి కోటేశ్వరరావుకు మంచి పరిశోధకుడిగా పేరుంది. కాని ఆయన వెంకన్న పాటని విశ్లేషించిన తీరు మాత్రం సామా జిక చలన సూత్రాలకు విరుద్ధంగా వుంది.
 
ఆయన విశ్లేషణలో ఈనాడు ‘‘వెల్లువెత్తుతున్న ప్రపంచీ కరణ ప్రభావానికి ప్రత్యామ్నాయంగా దేశీయ సంస్కారాన్ని, గ్రామీణ సాంస్కృతిక గరిమను వేయి గొంతుకలతో’’ గోరటి వెంకన్న చాటి చెప్పినట్లు రాశారు. ఆయనకు భారతీయ గ్రామీణ జీవన విధానం తెలిసే ఇది రాశారా? భారతీయ గ్రామీణ స్వభావం మీద జాతీయోద్యమ కాలంలో రెండు స్రవంతులుగా చర్చ నడిచింది. గాంధీజీ ‘‘భారతీయ పల్లెలే అభివృద్ధికి పట్టుకొమ్మల’’ని భావించారు. కాని అంబేడ్కర్‌ మాత్రం హిందూ మత ధర్మాన్ని నిరంకుశంగా ఆచరించే ప్రాంతాలుగా గ్రామాలను వర్ణించాడు. అంతేకాకుండా, బాహ్య ప్రపంచంతో సంబంధంలేని విధంగా అత్యంత ఒంటరితనంతో ఈ గ్రామాలు వుంటాయని, వాటిపై ఆరాధన అనేది అనవసరమని కూడా భావించాడు. కుల అసమానత లకు, అన్యాయాలకు పునాదిగా నిలుస్తున్న ఈ భారతీయ గ్రామాల పతనాన్ని అంబేడ్కర్‌ కోరుకున్నారు.
 
మార్క్స్‌ కూడా భారత గ్రామీణ వ్యవస్థ అనేది ధ్వంసం కాక తప్పదు అని చాలా సందర్భాలలో రాశారు. మరి ఈ గ్రామీణ విధ్వంసం గురించా ‘‘మన కాలపు వైతాళికుడు’’ కన్నీరు కారుస్తారు? పైగా కోటేశ్వరరావుగా ప్రపంచీకరణకు ప్రత్యామ్నాయంగా దేశీయ సంస్కారాన్ని గోరటి వెంకన్న వెయ్యి గొంతుకలతో చాటి చెప్పాడని రాశారు. ప్రపంచీకరణకు బ్రాహ్మణీయ ఫ్యూడల్‌ కుల సంస్కృతి ప్రత్యామ్నాయం అవుతుందా? ఇది సామాజిక చలన గతితార్కిక నియమమేనా? ఏ అంబేద్కరిస్టు లేదా మార్క్సిస్టు దీన్ని సమర్థిస్తాడా? అనేదాన్ని పరిశీలించుకోవాలి.
 
మార్క్స్‌ 1853లో ‘‘బ్రిటిష్‌ రూల్‌ ఇన్‌ ఇండియా’’ అనే వ్యాసంలో ఇలా అంటాడు: ‘‘భారత ఉపఖండంలో జరిగిన అన్ని పౌర యుద్ధాలు, దండయాత్రలు, కరువు కాటకాలు, స్వయంపోషక గ్రామీణ వ్యవస్థను మార్చలేకపోయాయి. కాని బ్రిటిష్‌వారు ప్రవేశపెట్టిన ఆవిరి ఇంజన్‌, స్వేచ్ఛా వ్యాపార విధానాలు అర్ధ - అనాగరిక సంఘాల ఆర్థిక పునాదులను ధ్వంసం చేసాయి. నిజం చెప్పాల్సివస్తే ఆసియా ఖండం తన మనుగడ అంతటిలోను ఎరిగిన ఏకైక సామాజిక విప్లవాన్ని అవి తీసుకొచ్చాయి.’’ అంటే ఏమిటన్నమాట- మనువాదం సృష్టించిన వారసత్వ కులవృత్తులు ధ్వంసం కావటాన్ని మార్క్స్‌ విప్లవ చర్యగా భావిస్తున్నారు. ఇది భారతదేశ పరిణామ దశలో పెట్టుబడిదారీ వ్యవస్థ తీసుకొచ్చిన గొప్ప మార్పు. ఈ పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం నుండి నేటి ద్రవ్య పెట్టుబడిదారీ విధానంతో ఈ మార్పులలో వేగం పెరిగింది.
 
3 వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భార తీయ గ్రామీణ కులవ్యవస్థ ధ్వంసమయ్యే ప్రక్రియకు 300 సంవత్సరాలు కూడా నిండలేదు. పెట్టుబడి నిర్వర్తించాల్సిన కర్తవ్యం ఇంకా వుంది. కాబట్టి బహుజనులు 3 వేల సంవత్స రాలుగా ఇంకా కొనసాగుతున్న బ్రాహ్మణీయ కులవ్యవస్థ గురించే ఆందోళన చెందాలి. దాని మరణాన్ని శ్లాఘిస్తూ పాటలు రాయాలి, పాడాలి. బ్రాహ్మణీయ కుల భూస్వామ్య వ్యవస్థ మరణాన్ని లిఖించడంలో పెట్టుబడి అద్భుతమైన పాత్ర నిర్వహిస్తుందని మార్క్స్‌ చెప్పే వున్నాడు.
 
అయితే పెట్టుబడిదారీ వ్యవస్థలో అంతా మంచే జరుగు తుందని చెప్పడం లేదు. ఈ వ్యవస్థలో బహుజనులకు ఉండవలసిన ప్రజాస్వామిక హక్కుల గురించి రాజకీయ పోరాటాలు చేయాలి. బ్రాహ్మణిజం, పెట్టుబడిదారీ విధానం రెండూ శత్రువులే అన్న అంబేడ్కర్‌ దృక్పథం ప్రస్తుత పరి స్థితులలో సరైనది కాదు. ప్రస్తుత లక్ష్యం మూడు వేల ఏళ్ళ బ్రాహ్మణీయ వారసత్వ కులవ్యవస్థను నిర్మూలించడమే అయి వుండాలి. మనం ద్రవ్య పెట్టుబడిదారీ వ్యవస్థలో వున్నాం. ఈ పెట్టుబడిని మరింతగా పెంచేందుకు ప్రధాని మోదీ కాలికు బలపం కట్టుకుని ప్రపంచమంతా చుట్టేస్తున్నాడు. ఈ పెట్టుబడి ఇంకా మిగిలివున్న ఫ్యూడల్‌ ఉత్పత్తి శక్తులను ధ్వంసం చేసి తీరాల్సి వుంది. అంటే కోయి కోటేశ్వరరావు పేర్కొన్న నా ఊరు, నా ప్రాంతం, నా సంస్కృతి, నా భాష, నా కులం, (ఇది నామాట) అనే సెంటిమెంటల్స్‌ అన్నిటినీ ధ్వసం చేయాల్సి వుంది. ఈ అడ్డుగోడలను తుదముట్టించి జాషువా కలలు గన్న విశ్వమానవున్ని అది తయారుచేసి తీరుతుంది. అప్పుడే ప్రపంచ కార్మికులారా ఏకంకండనే మార్క్స్‌ సూత్రీకరణకు మార్గం సుగమం అవుతుంది.
 
మనం బ్రాహ్మణవాది అనుకుంటున్న మోదీ నూతన పెట్టుబడిదారీ ఉత్పత్తి శక్తులను పెంచే పనులు చేయటం వల్ల వారసత్వ కులవృత్తులు ధ్వసం అవుతుంటే- మార్క్స్‌ వాదులు, అంబేద్కర్‌వాదులు మనువాదులుగా మారిపోయి- చాకలిపొయ్యిలు కూలిపోతున్నాయని, మాదిగడప్పు పగిలి పోతుందని, మనిషి మాయమైపోతున్నాడని కన్నీరు కార్చడం మనకాలపు వైపరీత్యం. పూర్వకాలమే బాగుందనే సెంటి మెంట్లు వదిలి భవిష్యత్తు గతంకంటే మెరుగ్గా వుంటుందనే సామాజిక గతితార్కిక నియమాలను అర్థం చేసుకోవాలి. 
 
పట్టా వెంకటేశ్వర్లు
99596 49097