ఇక భయం లేదు 

ఇక భయానికి అర్థం లేదు.
భయం పునాదుల మీద ఏదీ నిర్మాణం కాదు.

మునిగితే, ఇక మునక కూడా సామూహికమే
పొంగిన జనసాగరాలకు ఇక ఏ సైనిక దేహాలు
చెలియలికట్టలు కాలేవు.
 
అంతఃపురాలలోని అభ్యంతరమందిరాల్ని కాదని పొంగే హృత్‌ ఘోషకు ఇక నేల ఒక చాచిన చెవి బతుకును వొట్టి కనికట్టు చేసి బొమ్మలు అమ్ముకునేటోడా ఇలాగైతే బజారులో నిలబడి అరవడానికి నువ్వు, గుడిసె బయటికొచ్చి బేరమాడడానికి నేను... ఎవరమూ వుండం ఎవరూ లేకపోవడం కన్న నువ్వు మాత్రమే లేకపోవడం చాల చాల బాగుంటుందని అరిచేతులలో మొలిచిన గొంతులతో అరిచేతుల్లో మొలిచిన చెవులకు కొత్త స్వరాలు చేరవేస్తున్నాం, సృష్టికర్తలం మేము మా ఆకాశాల్ని మేము మిగిల్చుకున్నాం మా చందమామల్ని మేము.
 
మరి మాకు ఏ చెక్పోస్టులు లేవు, చైనాగోడలు లేవు మేము అన్ని గోడల్ని విస్మరించే రెక్కలున్న డెక్కలం, అసలు ఎగరకుండానే జగమంతా విస్తరించేట్టు వేరు దన్నిన వృక్షాలం అబద్ధం, మా ఆదిమధ్యాంత శత్రువని యేనాడో ప్రకటించాం మా పిల్లలలకు మాతృ పితృ భాషల సరిహద్దులు కూడా లేవు మా ఆడపిల్లలకు బ్రాలూ, గాజులూ పరిమితులు విధించలేవు మగపిల్లలు మగతనం కత్తులతో సొంత శిరస్సులు నరుక్కోరు అసాసిన్‌లూ షహీద్‌లూ కారు. ఉరేయ్‌, అంతా ఐపోయింది భూమి నీదన్నావు, కాదన్నాం. మాట నీదన్నావు, కాదన్నాం అబద్ధం, మోసం వినా ఏదీ నీది కాదు, పోరా, మాకవి అక్కర్లేదు పనితనం తెలిసినోడిదే పనీ, ఫలితం.
 
మావి మేం లాక్కుంటాం కర్మణ్యేవాధికారులం, ఫలితాల అధికారులం మేమే రొరేయ్‌! మేము కాపాడుతాం ఈ నేలను. ఇది నీటి పాలు కాకుండా మేము కాపాడుతాం సాగరాల్ని. వేడెక్కి పొంగి పొరలకుండా మనిషిని కాపాడుతాం, అతడొక యంత్రమై గడ్డకట్టకుండా పల్లె పేరిట పాటలు పాడమింక; ఎందుకవి? నిన్నటి భాషలు ఏ ప్రదేశం గొప్పలు ప్రకటించే జెండాలకూ కొయ్యలం కాము ఇక ఈ ప్రపంచం సమస్తం మాదే. అర్కిటిక్‌ టు ఆంటార్కిటిక్‌ తూర్పు, పడమర... ప్రతి దేశమూ ఇక చెమటోడ్చే వాడిదే మాకున్నది ఒకే భాష. మాటను ప్రతి మనిషికి చేర్చే భాష మాకున్నది ఒకే యాస. కౌగిలి వెచ్చదనం నేర్పించే యాస ఉన్నది ఒకే జెండా, దాని మీదొక రెక్కలున్న చెమట చుక్క పెట్టుబడీ! నువ్వే వుంచుకో, అట్టిపెట్టుకో భాషలనూ, దేశాల్ని.
 
ఇక నువ్వు మాకు అక్కర్లేదు. మేము నేల మీది నక్షత్రాలం. నువ్వూ ఒక చుక్కవే గాని, నువ్వు చనిపోయిన దానివి పగిలిపోయిన నక్షత్రానివి, సూపర్నోవావి, బ్లాక్‌ హోల్‌వి గుడ్‌ బై సరిహద్దుల్లో గోడలకూ, మానవ హనన గొడవలకూ, మనిషికి ఆకాశాన్ని అందనివ్వని భూ భగవంతుల బాబెల్‌ కుట్రలకూ గుడ్‌ బై..
 
హెచ్చార్కె
+1 609 647 2863
(అమెరికా ఎన్నికల్లో... బెర్నీ శాండర్స్‌తో కలిసి నడుస్తున్న అలెగ్జాండ్రియా ఒకాసియో కార్తెజ్‌, ఇలాపన్‌ ఒమర్‌, రషీదా త్లాయిబ్‌ తదితర యువ డెమొక్రటిక్‌ సోషలిస్టులు కల్పిస్తున్న ఆశలు... ఈ పద్యానికి ఒక సందర్భం.)