ఇది తప్పొప్పుల, మంచిచెడ్డల చర్చ కాదు. ప్రేమాద్వేషాల లొంగుబాటు కాదు. కంటికి కనిపించిన వాటిని అంచనా కట్టడం కాదు. కంటికి కనపడని వాటిని శోధించడం కాదు. ఊరికే అలా ఆమె భుజంమీద చెయ్యేసి నడుస్తూ పోవడం. 1904-1986 మధ్య జీవించిన ఆ నడక చెప్పినవి అర్థమయినంత వరకూ అక్షరాలలో పొదగడం. చైనా రచయిత్రి, విప్లవకారిణి, జియాంగ్ బింగ్జిని ఈమధ్య తెలుసుకున్నాను. చైనా విప్లవంలో స్త్రీలపాత్ర గురించి లోకానికి తెలిసిన మూసకి బింగ్జి భిన్నమైన రూపం. ఇది చాలాకాలం అణచిపెట్టిన రూపం. కళకీ- విప్లవ కార్యాచరణకి, స్త్రీగా రాయడానికి- విప్లవోద్యమ మిలిటరీ జనరల్‌గా రాయడానికి, మనసు చెపుతున్న దానికీ- పార్టీ ఆదేశించిన దానికి, ప్రేమకీ- తోడుకీ మధ్య సుదీర్ఘ ఘర్షణే ఆమె జీవితం. విప్లవ ప్రతీఘాత శక్తులలో ఒకరిగా ముద్ర పడి ఆత్మవిమర్శ (జియాంతావ్) రాయాల్సి రావడం, ఆ ఒత్తిడిని కూడా ఆమె కళాత్మకంగా వ్యక్తీకరించడం ఆమె జీవితంలోకెల్లా శిఖరాయమాన సందర్భం.
ఎలాంటి జీవితం బింగ్జిది! మూడో ఏటే తండ్రిని పోగొట్టు కుంది. పదహారో ఏట మామకొడుకుతో పెళ్లిని ఎదిరించి లిన్లీ నుంచి షాంఘై పారిపోయింది. వెళ్తూవెళ్తూ స్థానిక దినపత్రికలో ఈ పెళ్లి ఉదంతం అంతా రాసి తన శరీరం మీద తనకే హక్కు ఉంది తప్ప కుటుంబానికి, బంధువులకి కాదని చెప్పింది. షాంఘై ఆమెకి కొత్త బంగారులోకం. అక్కడ గొప్ప కవులు, రచయితలు, కళాకారులను కలిసింది, హాలీవుడ్ సినిమాలను మక్కువతో చూసింది. అనార్కిస్ట్ పార్టీలో చేరింది. జాతీయ సంస్కరణగా వచ్చిన ‘న్యూ విమెన్’, యూరోపియన్ ఫెమినిజం నుంచి గ్రహించిన ‘మోడ్రన్ గాళ్’ కాన్సెప్ట్స్ ఆమెని ఉక్కిరిబిక్కిరి చేసాయి. అదే సమయంలో చైనా యువత రాజకీయాలను తమ చేతుల్లోకి తీసుకుని నడిపిన ఉద్యమంలో చురుకుగా పాల్గొని ‘మే ఫోర్త్ ఇంటలెక్చ్యువల్’గా పేరు పడింది. ఆ ఉద్యమంలోని కొన్నివర్గాలు స్త్రీ పురుష, కుటుంబ, వివాహసంబంధాల విషయంలో విప్లవాత్మక భావాలను ప్రచారం చేసి, ఆచరణలోకి తీసుకురావడం సమాజపు మార్పుగా పరిగణించేవారు. వారిలో బింగ్జి కూడా ఉంది.
కవి, జర్నలిస్టు అయిన ‘హు యెపిన్’ ప్రేమని అంగీకరించి ఇరవై ఒకటో ఏట పెళ్లి చేసుకుంది బింగ్జి. అదే సమయంలో ‘కాంగ్విన్’ని ప్రేమించింది. ఇద్దరితో కలిసి ఒకే ఇంట్లో జీవించింది. మానసిక ఒత్తిడిని తట్టుకోలేక యెపిన్ ఒకరినే తేల్చుకోమంటే ప్రేమ లేకున్నా యెపిన్ తోనే ఉండడానికి నిశ్చయించుకుంది. చిన్నతనంలోనే పడిన బరువైన ప్రభావాల ఫలితం 1928 నాటికే ఆమె రాసిన మిస్ సోఫియా డైరీ, డైరీ ఆఫ్ సూయిసైడ్, ఏ విమెన్ ఇన్ ద డార్క్‌నెస్ వంటి కథలు. యెపిన్, బింగ్జి బంధం వెలిసిపోతున్న రోజుల్లోనే యెపిన్ ‘చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ’ కార్యకలాపాల్లో చురుకుగా ఉండేవాడు. 1931లో కుట్రకేసుల అభియోగంతో కౌమింటాంగ్ ప్రభుత్వం ఉరి తీసిన ‘అయిదుగురు అమరవీరుల’లో యెపిన్ ఒకరు. తర్వాత బింగ్జి, యెపిన్ వల్ల పుట్టిన బిడ్డని తల్లికి అప్పగించి, కాంగ్విన్‌తో బాంధవ్యాన్ని పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నం చేసింది. అప్పటికే వేరొక స్త్రీని పెళ్లి చేసుకున్న అతను తిరస్కరించాడు.
సిసిపిలో సభ్యురాలైన బింగ్జిమీద కూడా నిర్బంధం పెరగడంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. ‘అమరవీరుల’ బంధువులను ఇంటర్వ్యూ చేస్తున్న అమెరికన్ రైటర్ స్మెడ్లీకి అనువాదకుడిగా వచ్చిన ‘ఫెంగ్ డా’ పరిచయం, బంధం ఆమెకి ఊరట నిచ్చింది. యెపిన్ లా జీవితమంతా ఆక్రమించే ప్రేమ కాకుండా ఒక పక్కన నిలబడి శ్రేయోభిలాషిగా ఆమె పట్ల శ్రద్ధగా ఉండడం వల్ల ఆ కాలంలో బింగ్జి ప్రశాంతంగా ఉంది. ఆమె ఆలోచనలు, ఆచరణలలోకి పార్టీ రాజకీయాలు, విప్లవం వచ్చి చేరాయి. సోషలిస్ట్ రియలిజానికి ఉదాహరణగా రాసిన ‘ప్రవాహం’ పెద్దకథ పార్టీ సర్కిల్స్ లో మంచిపేరు తెచ్చింది.
రెండేళ్ళ తర్వాత ఒకనాటి అర్ధరాత్రి తలుపు తెరిచి చూస్తే కౌమింటాంగ్ పోలీసులు, వెనకాల ఫెంగ్ డా. పోలీసుల ఒత్తిడికి లొంగి అతనిచ్చిన సమాచారం ఆధారంగా ఇద్దరూ అరెస్టయ్యారు. ఇద్దరినీ నిర్బంధంలో ఉంచారు. ఆ కాలంలో అతనితో ఒకబిడ్డని కన్నది బింగ్జి. మూడేళ్ళ తర్వాత ‘ఫెంగ్ డా’ని వదిలి పార్టీ సాయంతో కమ్యూనిస్ట్ స్థావరమైన యానన్ పారిపోయింది. చైనా విప్లవోద్యమంలోకి గొప్ప రచయితలు చేరడం బింగ్జితోనే మొదలు. మావో ఆమెని స్వాగతిస్తూ ‘నిన్నటి మహిళా మేధావి, నేటి మిలటరీ జనరల్’ అని ప్రశంసించాడు. పార్టీలో ఆర్ అండ్ లిటరేచర్ విభాగంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించింది. యానన్ చేరిన ఆరేళ్ళకి తనకన్నా పదమూడేళ్ళు చిన్నవాడయిన ‘చెన్-మింగ్’ని పెళ్లి చేసుకుంది. ఆమె మరణం వరకూ వారి బంధం కొనసాగింది.
యూరోపియన్ ఫెమినిజానికీ వర్గస్పృహ లేకపోవడం, సిసిపికి జెండర్ స్పృహ లేకపోవడం ఆమెని కలవరపెట్టేవి. వాటి ప్రతిఫలనాలే ‘జియా విలేజ్‌లో ఉన్నపుడు’ కథ, ‘మార్చ్8 ఆలోచనలు’, ‘జీవితం - రచన’ వ్యాసాలు. జియావిలేజ్ కథలో జపాన్ సైనికుల చేత అపహరించబడిన పార్టీ యువతి, అక్కడ ఒక అధికారికి భార్యగా ఉండి శత్రు రహస్యాలను పార్టీకి చేరవేసేది. శరీరానికి, మనసుకి ఎంత అవమానం జరిగినా పార్టీ మేలుకోసం ఓర్చుకుని చివరికి అనేకవ్యాధులతో తిరిగి వచ్చాక, గ్రామం, ఆమెని స్వీకరించలేదు. వందలమందితో పడుకున్న ఆమె అపవిత్రురాలని ఎడంగా పెట్టారు. చివరికి చికిత్స కోసం యానన్ వెళ్లి ఆరోగ్యవంతురాలై రాజకీయ తరగతులకి హాజరవుతున్నట్లు కథ ముగించింది బింగ్జి. ఇది పార్టీ మీద పరోక్ష విమర్శ పెట్టిన కథగా సంచలనం సృష్టించింది.
తను ఎడిటర్‌గా ఉన్న లిబరేషన్ డైలీలో రాసిన ‘మార్చ్8 ఆలోచనలు’ వ్యాసం మహిళల హక్కుల్ని రక్షించడానికి పార్టీ విధానాలు సరిపోవని, ఉదాహరణగా అనేకఅంశాల్ని ప్రస్తావించింది. ‘ఐ మైసెల్ఫ్ యామ్ ఏ విమన్’ అంటూ స్త్రీ సహానుభూతితో రాయడం వల్ల ఈ వ్యాసం పార్టీ నుంచి మహిళల్ని వేరుచేసే కుట్రగా వివాదాస్పదమయింది. మావో, ఇతర మేధావులు వ్యతిరేకించడంతో వ్యాసాన్ని వెనక్కి తీసుకుని సవరణతో ప్రచురించి, ఎడిటర్ పదవికి రాజీనామా చేసింది. ‘జీవితం - రచన’ వ్యాసంలో ‘ప్రజల వద్దకి తరలండి’ అని ఆమె ఇచ్చిన నినాదం, కళాకారులకి వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలని చేసిన వ్యాఖ్య పార్టీలో కల్లోలం రేపాయి. ‘కళలు, సాహిత్యం రాజకీయాలకి అనుబంధంగా ఉండాలని’ యానన్ ఫోరంలో మావో చేసిన సూత్రీకరణకి ఈ వివాదాలన్నీ కూడా ముఖ్యకారణం.
తర్వాత ఆరేళ్ళకి, పార్టీ నేతృత్వంలో జరుగుతున్న భూసంస్కరణల నేపథ్యంలో ‘ద సన్ షైన్స్ ఓవర్ ద సంఘన్ రివర్’ నవల రాసింది. స్త్రీ ప్రత్యేక సమస్యల ఊసు లేకుండా కేవల వర్గస్పృహ నవల అంతరార్థం. ఈ నవల 1951లో అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన ‘స్టాలిన్ సాహిత్య బహుమతి’ని పొందింది. దీనితో ప్రాభవం పెరిగి చైనా కల్చరల్ అంబాసిడర్ స్థాయిలో అనేకదేశాలు పర్యటించింది. పార్టీ ఆర్ట్ అండ్ కల్చర్ విభాగంలో కీలకపదవిలో ఉన్న ‘జు యాంగ్’ ఇదంతా సహించలేకపోయాడు. ఆధిపత్య పోరుకి తెర లేచింది. 1955 నాటికి ‘గొప్ప ముందడుగు’, ‘గ్రేట్ డిబేట్’లో భాగంగా విప్లవ ప్రతీఘాత శక్తుల రచనలని పునఃసమీక్షించే క్లాసులు మొదలయ్యాయి. బింగ్జి మీద కూడా ట్రయల్స్ మొదలయ్యాయి.
స్త్రీ ఆత్మాశ్రయత నుంచి బైటకి రాలేకపోవడం, కళ, రాజకీయాలు వేర్వేరని చెప్పడం, విప్లవ రచయితలని ప్రజలవద్దకి తరలమని చెప్పడం ద్వారా పార్టీకి దూరం చేయడం, పుస్తకారాధన (వన్ బుకిజం), ఎడిటోరియల్ డ్యూటీలలో వ్యక్తిగత నియంత్రణ, ‘ఫెంగ్ డా’ విప్లవద్రోహి అని తెలిసి కూడా అతనితో కలిసి జీవించి బిడ్డని కనడం తప్పులుగా ప్రకటించారు. మిస్ సోఫియా డైరీ కథలో సెల్ఫ్ సెంటర్డ్, ఎమోషనల్, డిప్రెస్డ్, అబ్సెసివ్, డెలీరియం లక్షణాలున్న సోఫియా, తన మానసిక వైకల్యాలను దాటడానికి కామవాంఛని ఆశ్రయించిదనీ, సోఫియా మరెవరో కాదు బింగ్జినే అన్నారు. యాంటీ పార్టీయిస్ట్, బిగ్ రైటిస్ట్, వ్యక్తివాదం, విశృంఖల లైంగిక సంబంధాలు, వంటి అనేక ఆరోపణలు చేసింది పార్టీ. వాటిమీద ఆమె ఇరవై పేజీల ఆత్మవిమర్శ రాసింది. సెద్ధాంతికంగా తన తప్పులన్నీ అంగీకరించింది. అయితే బలవంతంగా, విధిలేక రాయవలసి వచ్చినప్పటి స్థితిని ఆమె నర్మగర్భంగా, వ్యంగ్యంగా వ్యక్తీకరించింది.
యెపిన్ మరణం, తన మీద నిర్బంధం, అజ్ఞాతం వంటి అనేక సమస్యలతో కుంగిపోయి ఉండడం వల్ల ఆ ఒత్తిడిలో వర్గ పోరాటం గురించి చురుకుగా ఆలోచించలేకపోయానని, తోడు కోసం ‘ఫెంగ్ డా’కి ఒక అవకాశం ఇచ్చానని అంటుంది. ‘‘ఏ వర్గపు స్త్రీ అయినా స్త్రీగా ఆమె ప్రత్యేక తరగతి. ఆ తరగతిని రాజకీయంగా సామాజికంగా నిర్మాణం చేయనిదే విప్లవం సిద్ధించదు. రచయితలు ప్రజలమధ్య తిరుగాడినపుడే జీవితపు సారాన్ని అర్థం చేసుకుంటారు. చేయిపట్టి దారి చూపడానికి రచయితలు చిన్నపిల్లలు కారు. మంచిరచన చేయగలిగినంత కాలం ఎవరికీ తల వంచనక్కర్లేదు. ఉత్తమ పురుషలో రాసిన స్త్రీల రచనల్ని పురుషులు అంచనా కట్టడంలో ఒక విషాదం ఉంటుంది’’ అంటుంది బింగ్జి. పార్టీ తనని క్షమించడం కోసం ఆమె ‘జియాంతావ్’ని పలుమార్లు తిరగరాసింది. ట్రయల్స్ జరుగుతున్న కాలంలో ఒక రోజు మావోతో కలిసి భోజనం చేసిన అనంతరం పచార్లు చేస్తుండగా అతను ‘ఒక వ్యక్తిని కొన్నిఘటనలు, కొన్నిరోజుల ఆధారంగా అంచనా కట్టలేమని, కొన్ని దశాబ్దాలు పడుతుందని’ అన్నాడని ఒక చోట ప్రస్తావించింది.
పార్టీ ఆమె ఆత్మవిమర్శని తిరస్కరిస్తూ ‘ఈ జియాంతావ్ స్వీయదృష్టితో, దొంగ ఏడుపుతో, అన్యాయానికి గురైన చిన్నభార్య రాసినట్లు ఉందని’ వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్య పార్టీకి ఉన్న పితృస్వామిక స్వభావానికి ప్రతీకగా భావించింది బింగ్జి. తర్వాత ఆమెని అన్ని పదవుల నుంచి తొలగించి పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసారు. ఆమె రచనలన్నీ నిషేధించారు. సగంలో ఉన్న రచనలను రెడ్ ఆర్మీ ఎడిటింగ్ కోసం పట్టుకు వెళ్లి తిరిగి ఇవ్వలేదు. అయిదేళ్ళ జైలుశిక్ష తర్వాత, మారుమూల గ్రామప్రాంతాల్లో మానవశ్రమతో బతకమని ఆదేశించారు. పన్నెండేళ్ళు ప్రవాసంలో జీవించింది. ఇన్ని శిక్షలు విధించిన సిసిపి ఆమె రచనల ప్రభావాన్ని ఆపలేకపోయింది. తర్వాతి నలభై ఏళ్ల కాలంలో చైనాలో స్త్రీల విముక్తి గురించి చేపట్టిన ప్రతి కార్యక్రమంలో, సాంస్కృతిక విప్లవసందర్భంలోనూ ‘మార్చ్ 8 ఆలోచనలు’ వ్యాసంలోని సూచనలని పరిగణనలోకి తీసుకున్నారు.
మావో మరణించాక ఆమె బహిష్కరణ రద్దయి, తర్వాత రెండేళ్ళకి పార్టీ సభ్యత్వం తిరిగి పొందింది. అప్పటికి ఆమె వయసు డెబ్భై అయిదేళ్ళకి పైనే. తన రచనల మీద నిషేధం తొలిగి చర్చలోకి వచ్చాక వివిధ దేశాలు తిరిగింది. కోల్పోయిన గౌరవాన్ని సంపాదించుకుంది. జీవితం పట్ల జియాంగ్ బింగ్జికున్న మోహం గొప్పది, నిగూఢమైనది. అందుకే ఎనభై మూడో ఏట మరణశయ్య మీద ఉన్నపుడు కూడా తన సహచరుడిని ‘ఇంకో ముద్దు కావాలి’ అని అడగగలిగింది.
కె. ఎన్. మల్లీశ్వరి