అర్రు పగిలేదాకా కొర్రు పట్టాల

 

మెడపై మట్టి చారల మబ్బుల్లోంచి
ఒక మెరుపు పుట్టుకురావాల
అరచేతిలో కోండ్రు గెర్రెలు బాగుంటే చాలదు
కరుకు బండపై కొర్రలు నలిగినట్లు కాదు
కర్రబట్టిన చేతి కింద నెర్రులు పూడాల
ఎర్రమట్టికి ఆనవాళ్ళమై
జగతికి ప్రణమిల్లాల 
 
విసిరిన గింజల ఎసురు మరిగినట్లు కాదు
కాడి తప్పిన కాడిమాను కాళ్ళీడ్చినట్లు కాదు
ఎండు చెత్త కప్పడానికి
గడ్డిపూలతో వెలుగు నింపాల
మట్టి పరిమళం మాగాణి నవ్వాల
అప్పుడే ఎర్రమట్టికి ఆనవాళ్ళమౌతాం
 
కరువు చెరువు కళ్ళల్లో తొనికినట్లు కాదు
అరువు బండ గుండెలపై వాలినట్లు కాదు
చెమట చుక్క పచ్చబొట్లై మిగిలిపోవాల
చర్నాకోల చైతన్యం అణువణువు నిండి వుండాల
 
గాలి విసురుకు బతుకుచెట్టు కొమ్మలిరిగినట్లు కాదు
గులకరాళ్ళ పంట రాశికి హారతిచ్చినట్లు కాదు
వెదురుబుట్ట నిండా గింజలు నవ్వినట్లుండాల
నాగలిపోటు నేలను ముద్దాడినట్లుండాల
అక్కడే ఎర్రమట్టి ఆనవాళ్ళకు వారసులౌతాం
చెట్టు వేరు పట్టు పిడికిలి బిగిసుదనానికి
చుక్కానీలమౌతాం 
 
గూడొదిలిన బతుకుపిట్టలమై గమ్యం మరచినట్లు కాదు
మిగులులేని బొంతలో మెతుకు తొంగున్నట్లు కాదు
ఇస్తరాకు కడుపు నిండుగా తులతూగాల
చుట్టు కుదురు ముద్ద లోతుల్లో ఆకలి ఇంకిపోవాల
అప్పుడే
ఎర్రమట్టికి ఆనవాళ్ళమై రెక్కలు తొడుగుతాం
నేలతల్లి పాదాల్ని తడిపి పంటదీస్తాం
 
నరెద్దుల రాజారెడ్డి
96660 16636