అనివార్యమైన ఒక మలుపు తిరిగి అర్ధరాత్రి

ఈ నగర హైవే పైకొచ్చావుకదా
బాధపడకు బ్రదర్‌... నీవేమీ ఒంటరివి కావు
నీకు ఈ మధ్యనే తెలుస్తోందికదా
మనిషికి హఠాన్మరణం వంటివే అందరివీ హఠాన్‌జన్మలేనని
తర్వాత్తర్వాత ఎదుగుతున్న కొద్దీ
పదేపదే.. మీ పల్లెటూర్లో మూలపడేసిన
చిరిగిన మోటబాయి తోలుతిత్తి ఎందుకు జ్ఞాపకమొస్తోందో 
 అర్థమౌతూ,
ఒడ్డున శిథిలమైన కొయ్యపడవ ఒక దుఃఖప్రతీకగా మిగిలి
సముద్రంతో నిరంతరం పోరాడిన
సాహస గాథలను వినిపిస్తూంటే... తెలుసుకుంటూ,
ఎప్పటివో అనాది గుప్తానుభూతులను నెమరు వేసుకుంటూ
దృశ్యాలను వినడం, శబ్దాలను దృశ్యించడం 
 నేర్చుకున్న తర్వాత
కొత్తగా ‘నేను ఒంటరిని కాదు’ అన్న ధైర్యం రాతిలోనుండి
  మొలకై పుడ్తూంటే
నీకునువ్వు ఒక మృతనక్షత్రానివి కావని గ్రహించిన రోజు
జలపాతోధృతిని తట్టుకుని తట్టుకుని
రాళ్ళు నున్నగా అరిగిపోవడం... త్యాగమా, అర్పణా 
          అన్న మీమాంసలో
జ్ఞానం లోపలిదీపంలా అంకురమౌతున్నప్పుడు
దేహ గుహగర్భంలో వెదుక్కుంటూనే ఉన్నావు ఆత్మశోధనలో
ఆ స్థితి స్వప్నఖచితమో, స్వర్ణప్రకాశనమో తెలియక
మళ్ళీ మళ్ళీ పడిలేస్తూ అర్ధసుషుప్తిలో నుండి అంతఃచేతనలోకి
అభిక్రమణ-
చీకటి వీధిలో
చీకటి బార్లు, చీకటి పబ్‌లు, చీకటి జిగేళ్‌ వ్యభిచారాలు
చీకటి నిశ్చలానంద గీతాల రాగధారలు
శృతిగా వీధిస్తంభం ప్రక్కన గజ్జికుక్క సన్నని ఏడుపు
పాపం... ఏడి దేవదాసు... రోడ్డుకింది పొదల అడుగున
అమ్మమ్మ ఆడిన పచ్చీసు బట్ట రెక్కలేవి
అన్నీ గళ్ళు గళ్ళు... అడుగులు అడుగులు
గుప్పిట్లో గువ్వలు... ఎరుపు పసుపు కర్ర కాయలు...
        ముందర
ఆడడానికి ఎదురుగా లేని నీకోసం ఎదురుచూస్తూ
నీ కళ్ళకోసం వెదుకుతూ.,
మనిషిలోకి మనిషి దిగడం అంటే
సముద్రంలోకి దిగుతున్నానని తెలుసుకుంటూ...
************
ఇక ఇప్పుడు చెప్పు నువ్వు ఒంటరివా?
రామా చంద్రమౌళి
93901 09993