నువ్వొక ఉత్తరమే కదా రాశావు, 

ఉభయకుశలోపరి అని కాకుండా
ఉరిబిగుసుకుంటోన్న పాట గొంతులోంచి
నొప్పి సలుపుతోన్న గాయం నిప్పుల పొయ్యిలోంచి
ఎర్రగా కాలి కాలి నల్ల బడ్డ కచికల్నేరుకునే కదా రాశావు
 
నీ రక్త సంబంధం నీకుంది
వాళ్ళింకా సాలెగూట్లోనే చిక్కుకోడాన్ని చూసి,
పగిలిన అద్దంలో కూడా ముక్కలు ముక్కలవ్వడాన్ని చూసి
దుఃఖపు వాన యింకలేని చాలీ చాలని ఇరుకు నేలైపోయావు
నువ్వాళ్ళ కోసం పస్తుండి, నిద్ర కాచి, అంటు తెగి మూలుగుతున్న
పచ్చటి బతుకు కలల్నేగా రాశావు
 
నీ కారణం నీకుంది
ఉన్నట్టుండేం జరగలేదు, ఉబుసుపోక్కూడా కాదు
భగవద్గీత వేరు, బైబిల్లానూ లేదు; అస్సలు నీకూపిరాళ్ళేదు
నువ్వో రాముణ్ణి కాదన్న వాడి వనవాసాన్ని చూసి
మరో వాల్మీకిలానే రాశావు; నీది మాత్రం రామాయణమెందుక్కాదు?
కిరాతుడి మూక బాణం తగిలి, నాన్న పోయాక
అమ్మ భోరు భోరున ఏడ్చినప్పుడే కదా రాశావు.
 
నీ బాధ్యత నీకుంది
దేశమేదైనా నీకు ప్రజలక్కడి అక్షరాల్లో దేవుళ్ళలా కనబడతారు
వాద్యాల్లోకి, వర్ణ చిత్రాల్లోకి, తెరమీది పాత్రల్లోకి
అలవోగ్గా జొరబడతారు
యుద్ధ హెచ్చరికైనా, ప్రణయ సందేశమైనా,
వాళ్ళ నిశ్శబ్దానికి రెక్కలు తొడిగి కాలాన్ని
స్వేచ్ఛగా ఎగరాలనే కదా రాశావు
 
నీ నమ్మకం నీకుంది
గుండె సిరాతో రాసిందెప్పుడూ తేలిగ్గా ఆరిపోదు
రాజద్రోహమనిపించుకునేంత నేరం చెయ్యడం సులువు కాదు
ఇప్పుడు నిజం మాట్లాడేవాళ్ళందర్నీ నేరస్థులేనంటున్నారు
నువ్వా నిజ పాదాలకి, ముందుగా నమస్కరించే కదా రాశావు
 
నేనింకేం మాట్లాడ్డానికైనా భయపడదల్చుకోలేదు
సంకెళ్ళతో నిల్చున్నవాళ్ళ వైపుకెళ్ళి నన్నొక వాగ్దానం చేసిరమ్మనే కదా
కన్నీళ్ళు దోసిలిపట్టి రాశావు
 
శ్రీరామ్‌
99634 82597