ఒక స్నేహ మాధుర్యం, ఒక ఆత్మీయతా భావం, ఒక కార్య నిర్వహణ దీక్ష, ఒక తీయని దరహాసం పత్తిపాక మోహన్‌. దగ్గర వ్యక్తుల గురించి ఏమి రాయాలన్నా చికాకే. రాయకతప్పదని విపరీతంగా రాస్తే అదీ వికటిస్తుంది. మోహన్‌ గురించి కొన్ని మాటలే రాయగలను. ‘‘సహృదయుడు’’. ఈ మాటలోనే ఎంతో విషయం దాగి వుంది. ఎంతైనా చెప్పుకోవచ్చు.

అమృతం ఉన్నదన్న నమ్మకం నాకు లేదు కానీ, అమృతాన్నీ హాలాహలాన్నీ సమానంగా గ్రహించే గుణం మోహన్‌ది. అందుకే ఆధ్యాత్మికవాదులను ఎంత అభిమానిస్తాడో, శాస్త్రీయ విజ్ఞానవేత్తల్ని, అభ్యుదయవాదుల్ని అంతే ఆదరంగా గౌరవిస్తాడు. నేనుగాక మరొకరైతే పత్తిపాక మోహన్‌ను త్రినేత్రుడితో పోల్చేవారు, బోళా శంకరుడనేవారు. ఆ కథల్లో శంకరు నికి రాక్షసులతో వైరముండవచ్చు, కానీ మోహన్‌కు ఎవ్వరితో గొడ వలు, కోపతాపాలు, కోట్లాటలు, పగలు, ఈర్ష్యలు ఉన్నట్టు నాకు తెలియదు. ‘‘ఎవ్వని గుణమెట్లుంటె నాదేం పోయినది’’ అంటడు.
 
ఇక సాహిత్యంలో తన పని విధానమంటారా? పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, మంచి నడత కోసం, పర్యావరణం కోసం, వినోదం, విజ్ఞానం కోసం మంచి పుస్తకాలు రాశాడు. రాయడమేకాదు, పిల్లల గురించి లెక్కకు మించిన కార్యశాలలు ఏర్పాటు చేశాడు. తను చేయడమేగాక, ఎవరు చేస్తున్నా వారికి మనస్ఫూర్తిగా సహాయ సహ కారాలు అందించాడు. ఇతరేతర ఆకాంక్షా, ఆపేక్షా ఏదీ లేకుండా అదే భావి భారత పౌరులకోసం తను పడే తపన. చాలామంది రచయితలు రాస్తారు, రాసింది ప్రచురించుకుంటారు. అన్నం వండుకుని తిన్నట్టు కూర్చుంటారు. మరి మోహన్‌ అట్లాకాదు. తను తిన్నా తినకున్నా ఇతరులకు పెట్టినట్టు రచయితల గురించి చెప్పుతాడు. చదువుకుం టాడు. రచయితలను తయారు చేస్తాడు.
 
ఒక సందర్భంలో మోహన్‌ పుస్తకం అకాడమి అవార్డుకు నిలబడి నప్పుడు మాలో కొందరికి ఈ పుస్తకం పోటీలో నెగ్గగలదా అన్న మాట వచ్చింది. అప్పుడు కేవలం పుస్తకమే కాదు, ఆయా రచయితల హృదయాలు, పని విధానం, ప్రేమతో పిల్లలకెంత చేరువగా ఉన్నాయో చూడాలి; బాలల సాహిత్యం కోసం ఏ ఏ పద్ధతుల్లో సేవలు అంది స్తున్నారో గమనించి నిర్ణయం తీసుకోవడం కూడా సరియైున పద్ధతి అనుకుంటానని చెప్పాను. తన పుస్తకం ‘బాలల తాతా బాపూజీ’కి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు వచ్చింది. మోహన్‌ పుష్పంలా విచ్చు కున్నాడు. భలే సంతోషపడ్డాడు. ఆనందానికి అంతులేదన్న తీరుగా ఎంతో ఉత్సాహంగా ఆ కబురు చెప్పాడు.
 
చాలా మంది రచయితలు కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారాన్ని ఒక శిఖరంగా భావిస్తారు. దాన్ని పొంది ఇక చాలు చేసిందని కాళ్లు చాచి కూర్చునేవారు కొందరుంటారు. అలాకాకుండా బాలల సాహి త్యంలోనైతేనేం, తెలంగాణ నైతిక జీవనాన్ని, సారస్వత సంస్కృతిని వెలికితీసే ప్రయత్నంలోనైతేనేం మోహన్‌ ఇంకా ముమ్మరంగా శ్రమి స్తాడనీ, ఇప్పుడింకా బాధ్యతలు పెరిగాయని తలుస్తాను.
 
(తమ్ముడు పత్తిపాక మోహన్‌ సాహిత్య అకాడమి బాల సాహిత్య పురస్కారం అందుకుంటున్న సంబురంలో)
*********
భూపాల్‌