తెలుగు సాహిత్యంపై గ్లోబలైజేషన్‌ ప్రభావం ఏమిటి? ఆ ప్రభావాన్ని సరిగా గమనించాలంటే గ్లోబలైజేషన్‌ ఏమిటని ప్రశ్నించుకోవాలి. దాన్ని ఒక భావనగా, ఒక పదంగా చూడాలి. భావనగా చూస్తే మానవుడు ప్రపంచమంతటా విస్తరించటం మొదటి గ్లోబలైజేషన్‌. 


ఒక ప్రాంతంలోని భావాలు, సైన్సు ఇతర ప్రాంతాలకు విస్తరించటం అందులోని ఒక దశ. ఇది సరుకుల కదలికతో ముడిపడి సాగింది. అంటే వర్తకంతో బాటు ఇచ్చిపుచ్చుకోటాలు నడిచాయి. ఈ భావాలలో దైవాన్ని కనుగొన్నామన్న నమ్మకం ప్రధానమైనది. కనుగొన్న దైవాన్ని తెలియనివాళ్లకు తెలియబరచటం వ్యక్తులకి ఒక చోదకశక్తి. అది గుంపులను ఏకీకృతం చెయ్యటంలో కొంత పని చేసింది,
 
పదంగా చూస్తే ‘గ్లోబల్‌’ అనే పదం 400 ఏళ్లుగా ఉన్నట్టు చెపుతారు. ‘గ్లోబలైజేషన్‌’ అనే పదం వాడుక 1960ల్లో మొదలైందంటారు. ఆ తర్వాత ఆర్థికశాస్త్ర నిపుణులు గ్లోబలైజేషన్‌ దశలు మూడింటిని గుర్తించారు. 1870 నుంచి మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభం వరకూ మొదటి దశ. రెండవ ప్రపంచయుద్ధం తరవాత నుంచి 1989 కోల్డ్‌వార్‌ ముగిసే వరకూ రెండవ దశ, అప్పటి నుంచి నేటి వరకూ సాగుతున్నది మూడవ దశ.
 
వేటకు, పశుపాలనకు,  ఆహార సేకరణకు మానవులు పదుల సంఖ్యలో సాధించిన పరస్పర సహకారం తొలి గ్లోబలైజేషన్‌కి సరిపోయింది. వేలాది లక్షలాదిమందిని సమీకరించి చేసిన దండయాత్రలు రెండవదశ గ్లోబలైజేషన్‌కి గుర్తులు. ఈ దశలోనే సరుకులను దూరప్రాంతాల నుంచి తీసుకువచ్చి లాభాలు గడించే వర్తక వ్యాపారాలు ఆరంభమయ్యాయి. 
 
పారిశ్రామిక యుగారంభంతో మూడవదశ గ్లోబలైజేషన్‌ మొదలైంది. ఈ దశలోనే వర్తక వాణిజ్యాల ద్వారా పోగుపడిన సంపదకి పెట్టుబడి అనే రూపం వచ్చింది. పెట్టుబడిదారుడికి మానవజాతిని నడిపే అధికారం కోసం పెనుగులాటడం ముఖ్యమయింది. ప్రాణి భవిష్యత్తునే సందేహింపజేసే వర్తమాన స్థాయికి ఇది చేరుకుంది. సంపద పోగుపడటానికి కావలసినవి మానవ శ్రమ, పెట్టుబడీ. అవి సరుకుల రూపంలో కనిపిస్తాయి. ఈ రెండూ ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కదలాలి. అంటే సరుకులు కదలాలి. ఈ కదలికకి అడ్డుపడే అన్ని రకాల సరిహద్దులనూ తొలగించుకోవటమే ఈ దశకి చోదకశక్తి. 
 
పారిశ్రామిక యుగంతో సరుకుల ఉత్పత్తి పెరిగింది. ఆ సరుకులు కొనుక్కునే లేదా వాడుకునే జనం కావాలి. అలాంటి మార్కెట్లు, అంటే దేశాలు, కొందరి చేతులలో ఉన్నాయి. ఈ మార్కెట్లలో అమ్ముకోటానికి వారు అంగీకరించరు. మరి పారిశ్రామికంగా సాధించిన ఉత్పత్తిని ఏం చెయ్యాలి? దాని కోసం యుద్ధాలు మెదలయాయి. ఈ యుద్ధంలో ఓడిన దేశాలే కాదు, గెలిచిన దేశాలూ నాశనం అయ్యాయి. ఈ విషయాన్ని గ్రహించిన వ్యాపారులు రాజకీయ నేతృత్వాల ఆధ్వర్యంలో ఒక ఒడంబడిక చేసుకున్నారు. అది బ్రెటన్‌ వుడ్‌ ఒడంబడిక. 1944 జూలైలో అంతర్జాతీయ ద్రవ్యవిధానం, స్వేచ్ఛావాణిజ్యం ఏర్పాట్లు ఆరంభమయాయి. ఇప్పుడు మనం చర్చిస్తున్న గ్లోబలైజేషన్‌ అనబడే పదానికి పునాది అక్కడ ఏర్పడింది.
 
సోషలిస్టు భావాల వ్యాప్తికి మూలం ఆహార సమస్య అన్న విషయం గ్రహించాయి అభివృద్ధి చెందిన దేశాలు. ప్రపంచ శాంతి సాధనకి ఆహార సమస్య పరిష్కరించాలన్న వ్యూహం ఆరంభమయింది. ‘ఆకలిపై యుద్ధంలో మెతుకే ఆయుధం’ అన్న నినాదం వచ్చింది (పియల్‌ 480). సాంకేతిక రంగంలో పరిశోధనలు మెదలయాయి. వ్యవసాయరంగంలో విత్తనాలు, రసాయనిక ఎరువులు, యాంత్రీకరణ వంటివి ప్రవేశించాయి. ఇవన్నీ మన వ్యవసాయరంగంపై పెనుమార్పులు తెచ్చాయి. పల్లెలలో మార్పులు వేగవంతమయాయి. 
1944లో కొన్ని దేశాల మధ్య ఒడంబడిక GATT (General Agreement on Trade and Tariff)తో  స్వేచ్ఛా వాణిజ్యానికి న్యాయబద్ధత ఇచ్చింది. ఈ ఒడంబడిక 23 దేశాల మధ్య ఆరంభమయింది. స్వాతంత్ర్యానంతరం జూలై 1948లోనే గాట్‌ ఒడంబడికలో అప్పటికే ఉన్న 108 దేశాలలో మన దేశం కూడా సభ్యత్వం తీసుకుంది.
 
1991లో ఉరుగ్వేలో జరిగిన గాట్‌ సమావేశాలలో డంకెల్‌ ప్రతిపాదనలు వచ్చాయి. వ్యవసాయ సబ్సిడీల రద్దు లేదా కోత నిష్పక్షపాత వాణిజ్యానికి షరతు అన్న డంకెల్‌ ప్రతిపాదనలపై, ‘డంకెలోడా ఓరి మాయలోడా’ అంటూ తెలుగు సాహిత్యం వెంటనే ధ్వజమెత్తింది. మన దేశ వ్యవసాయంపై ఈ ప్రతిపాదనల ప్రభావం ప్రత్యక్షంగా ఆరంభమయింది. ప్రచ్ఛన్న యుద్ధం ముగియటం; తూర్పు యారప్‌, సోవియట్‌ రష్యాలలో కమ్యూనిస్టు ప్రభుత్వాల పతనం; అస్తిత్వ వాదాల ఆరంభం; అదే సమయంలో ఈ ప్రతిపాదనలూ వెంటవెంటనే జరిగాయి. ప్రజల ప్రతిఘటన సాహిత్యంలోనూ, కొంత ప్రతిపక్ష రాజకీయ స్వరంలోనూ, ప్రభుత్వ పక్షం ఊగిసలాటలోనూ వ్యక్తమైనా- అన్నింటికీ తెరదించుతూ 1995లో గాట్‌ రూపాంతరమైన WTO ఒప్పందంపై భారతదేశం సంతకం పెట్టింది. దీనిపై ‘సంతకం పెట్టిన వేళ్లు’ అద్దేపల్లి రామమోహనరావు కవిత రాసారు. ఇది గ్లోబలైజేషన్‌పై మొదటి వ్యతిరిక్త స్వరంగా భావిస్తారు. ఆయనే ‘పొగచూరిన ఆకాశం’ అనే కవితా సంపుటాన్ని గ్లోబలైజేషన్‌కి వ్యతిరేకంగా ప్రచురించారు. క్రమంగా WTO ఒప్పందానికి అవసరమైన ఆర్థిక సంస్కరణలు మన దేశంలో వేగం పుంజుకున్నాయి. 
 
మనం గ్లోబలైజేషన్‌ అంటున్న దానిని యూరప్‌ దేశాలలో అమెరికనైజేషన్‌ అంటున్నారు. ఆ దేశాలలో ఉన్న ప్రజా సంక్షేమ విధానాలు, కార్మిక చట్టాల అమలు వంటి వాటిని ప్రొటెక్షనిజమ్‌గా ఈ గ్లోబలైజేషన్‌ నిర్దేశిస్తుంది. సరుకుల ఉత్పత్తిలో తమ దేశ పౌరులకు ప్రత్యేక రాయితీలు, సంరక్ష ణలు ఇవ్వరాదన్నది స్వేచ్ఛావిపణిలో పోల్గొనటానికి నిబంధన. దాని పట్ల సాధారణ జనానీకంలో వ్యతిరేకత ఉంది. ఇంతకీ దేశాలు అనబడే సార్వభౌమత్వం కలిగిన దేశాలకి ఈ గ్లోబలైజేషన్‌ ఏం చెపుతుంది. ఆయా దేశ పౌరులని డబ్బు సంపాదించండి, డబ్బు ఖర్చుపెట్టండి అంటుంది. సంపాదించటానికి మనిషి శ్రమని అమ్ముకుని తనే ఒక సరుకు అవాలి. ఖర్చుపెట్టటానికి సరుకులు కొనాలి. ప్రభుత్వాలకి ఏం చెపుతుంది. వ్యాపారులకి సంధానకర్తగా ఉండండి. మీరు వ్యాపారం విడిచిపెట్టండి (లిబరలైజేషన్‌), ప్రజలని అదుపుచేసే పని మాత్రమే (సైన్యం, పోలీసుల ద్వారా) మీది అని నిర్దేశిస్తుంది.  
 
క్రమంగా తెలుగు సాహిత్యంలో ‘గ్లోబలైజేషన్‌’ పదం వాడుక పెరిగింది. ‘గ్లోబల్‌ ఖడ్గం’, ‘గ్లోబలి’ వంటి పదబంధాలు పుట్టాయి. కవిత్వం నుంచి కథానికా ప్రక్రియకి ఈ పదం విస్తరించింది. గ్లోబలైజేషన్‌ కథా సంకలనాలు వచ్చాయి. ఇలా విస్తారంగా వెలువడిన రచనల ఉమ్మడి లక్షణం ఈ గ్లోబలైజేషన్‌ వ్యతిరేకతే. ఇది ప్రధానంగా వ్యవసాయరంగంలో పల్లెలలో వచ్చిన మార్పులనే కేంద్రం చేసుకుంది. చాలా ముందే ఆరంభించిన గ్రీన్‌ రివల్యూషన్‌ ఫలితాలు ఈ సమ యానికి పూర్తిగా కనిపించసాగాయి. వేల సంవత్సరాలుగా సాంప్రదాయక వ్యవసాయంతోనే స్వయం సంపూర్ణంగా నిలిచింది గ్రామవ్యవస్థ. కరువులూ, వరదలూ, మహమ్మారుల వంటి రోగాలూ గ్రామాలను నాశనం చేసినా భారతీయ గ్రామ వ్యవస్థ తన సాంప్రదాయ జ్ఞానంతో నిలబడింది. ఆంగ్లేయపాలన దానిని అంతగా కదిలించకుండానే ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే విధానాలు చేపట్టింది. గ్లోబలైజేషన్‌ వల్ల గ్రామాలు తమ స్వయంసంపూర్ణత కోల్పోవటంతో కలిగిన విషాదం, అభద్రత సాహిత్యంలో బలంగా వ్యక్తమయాయి. సాహిత్యంలో జీవితమంటే గ్రామజీవితం మాత్రమే అనేంత బలంగా రచయితలు సృజించారు. విమర్శకులు శ్లాఘించారు. 1960లలో మొదలై 90ల నాటికి నిరాశాజనకంగా మారిన వ్యవసాయం, తిండి పెట్టని చేతి వృత్తులూ, మారిపోతున్న కుల సమీకరణాలూ తెలుగు సాహిత్యంలో బలంగా వ్యక్తం కాసాగాయి. 
 
మొదట్లో- గ్లోబలైజేషన్‌ అంటే మానవజాతి ఏకమవటమనే అర్థంలో తెలుగు సాహిత్యం మార్పుని స్వాగతించింది. విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను.. విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోస్తాను.. నేను సైతం నేను సైతం అంటూ శ్రీశ్రీ కవిత్వం చెప్పటం అలాంటి స్వాగతమే. నేను మనిషి ముఖాన్ని ప్రేమిస్తాను అనటంలోనూ ఆ స్వాగతమే ఉంది. విశ్వమానవ భావనకు పట్టిన హారతి శ్రీశ్రీ కవిత్వం. 
 
1990ల వరకూ సమస్త రకాల బాధితుల, దుఃఖితుల, పీడితుల పక్షాన నిలవటమే సాహిత్య స్థాయికి గీటురాయి అన్న భావన తెలుగు సాహిత్యంలో ఉండేది. తర్వాత పరిస్థితి మారింది. బాధితులందరూ ఒకటి కాదు. వారి వారి బాధలు వేరు. పుట్టుక ద్వారా కలిగే బాధలు వేరు. ఆర్థిక అసమానతల కన్న ముందుగా పుట్టుకతో వచ్చిన సామాజిక అసమానతలు తొలగాలి అనే ఎరుక ప్రవేశించింది. దాంతో వారి పక్షాన నిలిచిన సాహిత్యం చీలిపోసాగింది. సాహిత్యకర్త, విశ్లేషకుల పుట్టు సమూహం ఒక ప్రధాన అర్హత అయింది. ఎవరి బాధలు వారే చెప్పుకోవాలన్న వాదనల బలపడ్డాయి. ఈ పరిణామాలని హేతుబద్ధం చేస్తూ పోస్ట్‌మాడర్నిజం సిద్ధాంతం ఈ ‘ఖండఖండాల పరిష్కారా’లదే భవిష్యత్తుగా తేల్చటం, దానిని తెలుగు సాహిత్య సమాజం అంగీకరించటం, ప్రస్తుతించటం, సాహిత్య విమర్శలో దానిని అనుసరించటం జరిగింది. ఇవన్నీ గ్లోబలైజేషన్‌ యుగంగా భావించే కాలంలోనే జరగటం ఒక విశేషం. ఇది కాకతాళీయమో దీని వెనక ఏదైనా సంబంధముందో విజ్ఞులు ఆలోచించాలి.
 
గ్లోబలైజేషన్‌ తాలూకు ప్రభావాలన్నీ తెలుగు సాహిత్యం తీసుకుంటోందా? -అంటే వస్తువుగా స్వీకరించిందా? గ్రామాలలో మార్పులు తీసుకుంది. గతమే మేలనే ధోరణిలో ఆ మార్పుల పట్ల ఆవేదన ప్రటించింది. సరే. కొత్తవృత్తులు పుడుతున్నాయి. అవి సాహిత్యంలోకి ప్రవేశిస్తున్నాయా? వాటి పట్ల మన వైఖరి ఏమిటి? శ్రమ కదలికకీ శ్రామికుని కదలికకీ ఉన్న తేడా ఏమిటి? నేను కొన్ని ప్యాక్టరీలు చూసాను. వాటిని Sweatshops  (చెమట దుకాణాలు) అంటున్నారు. శ్రమ చవకగా లభించే దేశాలలోని ఈ ఫ్యాక్టరీలలో ఉత్పత్తి జరుగుతుంది. ఇందులో తయారయే వస్తువు ఆ దేశపు మార్కెట్లకి నేరుగా వెళ్లదు. ఉదాహరణకి నైక్‌ చెప్పుల తయారీ తీసుకోండి. మేకిన్‌ ఇండియా నినాదానికీ దీనికీ ఉన్న సంబంధం గమనించండి. ఇలాంటివి సాహిత్యంలోకి తగినంతగా వస్తున్నాయా? సినిమాల ప్రపంచవ్యాప్త విడుదలల్లో ఎవరి డబ్బు ఎవరికి చేరుతోంది? ఎక్కడి శ్రమ ఎక్కడికి తరలుతోంది? వీటన్నింటినీ మనం స్వీకరిస్తున్నామా? సాహిత్యానికీ సమాజానికీ సంబంధం ఉందని, ఉండాలని తెలుగువాడు భావిస్తాడు. అందుకే ఈ ప్రశ్నలు. 
 
మరో ముఖ్యమైన ప్రశ్న. ఒక భావనగా చూస్తే గ్లోబలైజేషన్‌ మానవజాతిని ఏకం చేస్తోంది. వ్యక్తి తాను ప్రధానంగా మానవుడిననే అనుకోవాలి. మిగిలిన గుర్తింపులన్నీ కేవలం కొన్ని అవసరాల కోసం పుట్టినవే అని గ్రహించాలి. ఈ దిశలో సాగుతున్నట్లు కనిపించే ప్రస్థానంలో చాలా రక్తపాతం జరిగింది. ఎంతో మానవ హననం జరిగింది. రాజకీయంగా వేర్వేరు దేశాలలో ఉన్నాం. ప్రపంచంలో కొన్ని దేశాలలో శ్రమ చవకగా లభిస్తోంది. కారణం వారు తతిమ్మా దేశాల కన్న విద్య, ఆహారం, వైద్యం వంటి కనీస మానవాభివృద్ధి ఫలితాలను అందుకోలేకపోవటం. ఇవి వారికి సొంతమయే రోజులు వారే తెచ్చుకోవాలా? చైతన్యం కలిగిన వ్యక్తులుగా మనం చేయగలిగింది ఏమైనా ఉందా అని ఆలోచించుకోవాలి. వర్తమాన గ్లోబలైజేషన్‌ వ్యాపారుల ఆధ్వర్యంలో వారి ప్రయోజనాలకోసం నడుస్తున్నదే. అంటే మానవ ప్రవృత్తిలోని దురాశ చేతిలోనే అంతా ఉంది. ఇది ఇంతవరకూ సాగిన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందా మానవ జాతి మొత్తాన్ని ముగిస్తుందా అనేది మనం వేసుకోవలసిన ప్రశ్న. తన దురాశతో మానవుడు నశిస్తాడా వివేకంతో కొనసాగుతాడా? 
 
ఏ దేశం నుంచి వచ్చినా కొత్త ఆలోచనలనైనా తెలుగు సాహిత్యం స్వాగతిస్తుంది. మార్పుని స్వాగతించటమే మన ప్రధాన లక్షణమని అనుకోవాలి. సమాజంలో భిన్న సమస్యల పట్ల సూక్షస్థాయిలో (micro level) ఈనాడు తెలుగు సాహిత్యకారుడు స్పందిస్తున్నాడు. తాము వ్యతిరేకిస్తున్న పరిస్థితులకి కారణాలు గతంలో వెతుకుతున్నాడు. నానాటికీ మానవ జీవనం సంక్లిష్టమవుతోంది. స్థూలస్థాయి (macro level)లో వర్తమానాన్ని పరిశీలిస్తే తప్ప మనం ఫిర్యాదు చేస్తున్న పరిస్థితులకి పరిష్కారాలు లభించవు. ఫిర్యాదులకు మాత్రం బలం చేకూరుతుంది. మనది పరిష్కారాలు వెతికే స్వభావం. అందుకు తగిన లోతైన పరిశీలనాశక్తీ, వివేచనా తెలుగు సాహిత్యకారునికి ఉందని మన సాహిత్యం లోగడ ఋజువు చేసింది. 
 
గ్లోబలైజేషన్‌ నాశనం చేస్తున్నది గ్రామాలనే కాదు. నగరాలనే కాదు. మానవుడిని అది పెకలించివేస్తోంది. రాబోయే కాలంలో అన్ని దేశాలలో మనుషులూ ‘పనికొచ్చేమనుషులూ’ - ‘పనికిరాని మనుషులూ’ అనబడే వర్గాలుగా చీలిపోబోతున్నారు. చైతన్యం కలిగిన వ్యక్తులుగా సాహిత్యకారులు చేయ్యగలిగింది ఒక్కటే. వేయి కళ్లతో మార్పులని గమనించాలి. వేయినోళ్లతో వీటిని మనకి అర్థమైన మేరకు వివరించాలి. చైతన్యం కలిగిన మనుషుల సంఖ్య పెంచాలి. గత కీర్తనతో ఆగిపోకూడదు. వర్తమానాన్ని ఆవేశాలతో నింపకూడదు. భవిష్యత్తుపై నమ్మకం కలిగించాలి. 
 
***********
వివిన మూర్తి