‘‘ప్రొజాయిక్‌ లైఫ్‌లో పడకూడదు కవి’’

కదలడు-వదలడు, చిక్కడు-దొరకడు, వాడే-వీడు లాంటి టైటిల్స్‌ హెచ్చార్కేకి సరిగ్గా సరిపోతాయి. ఎప్పటికప్పుడు ఒపీనియన్స్‌ ఛేంజ్‌ చేసే హెచ్చార్కేతో మిత్రులకు చిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. అంతా ‘అబద్ధం’ అంటూ తెలుగు సాహిత్యాన్ని కొన్ని దశాబ్దాల క్రితమే హెచ్చరించి, నిజం ఏమిటో మాత్రం మనల్నే తెలుసుకోమంటాడు. కథ, కవిత, పాట, విమర్శ, పత్రికా రచన.. ఇలా అన్ని ప్రక్రియల్లో వేలు పెట్టి.. తనదైన దిశలోనే సాగుతున్నాడు. అగ్రరాజ్యం అమెరికాలోని న్యూజెర్సీలోని పెన్నింగ్టన్‌, వెనుకబడ్డ రాయలసీమలోని కర్నూలు జిల్లా నంద్యాల తాలూకాలోని గని మధ్య చక్కెర్లు కొడుతూ తనదైన రస్తా నిర్మించుకున్న హెచ్చార్కే జ్ఞాత, అజ్ఞాత ముఖాలను పాఠకుల ముందుంచే ప్రయత్నమే ఈ సంభాషణ.
 
ప్రశ్న: యాభై ఏళ్ల కవిత్వ రచనలో మీరు ఏమి సాధించారనుకుంటున్నారు?
హెచ్చార్కే: నేను ప్రారంభంలో ఏం సాధించాలనుకున్నానో అది సాధించాను. కొంతమంది స్నేహితులయ్యారు. కవిత్వం రాస్తున్నానని చెప్పినప్పుడు తమ్మినేని పుల్లయ్య అని నా బియ్యెస్సీ ఫ్రెండు ‘‘ఒరే నీలో ఆర్టిస్టున్నాడురా!’’ అని మెచ్చుకుంటే సంతోషం వేసింది. బిఎస్సీ సెకండ్‌ ఇయర్‌లో ఉండగా జ్యోతిలో ఒక పొయెమ్‌ వచ్చింది, ‘జీవితం, కాయితం’ అన్నది దాని హెడింగ్‌. పుల్లయ్య మెచ్చు కున్నది దాన్ని. ఈ మెచ్చికోళ్లే నేను సాధించింది.
 
ప్రశ్న: ఈ ప్రయాణంలో మీ కవిత్వం ఎలా పరిణామం చెందింది? 
హెచ్చార్కే:  నా కవిత్వం నిర్దిష్టత నుంచి అనిర్దిష్టత వైపు ఎక్కువ జరిగింది అనుకుంటాను. కవిత్వంలో నేరుగా కనపడి చెప్పడం కాకుండా, off-the-camera చెప్పడం అలవాటైంది. 
 
ప్రశ్న: అంటే నినాదంలా కాకుండా అనా?
హెచ్చార్కే: అవును. అయితే ఆ తర్వాత కూడా నినాదం అంటే నాకేమీ చెడు అభిప్రాయం లేదు. కొన్ని నినాదాలు గొప్ప కవిత్వాలనుకుంటాను. ‘జీనా హై తో మర్‌నా సీఖో’ అన్నది గొప్ప కవిత అనుకుంటాను. కాబట్టి కవిత్వంలో ఆ డైరెక్ట్‌నెస్‌ తప్పని అనుకోవటం లేదు. కానీ నాలోనే ఆ మార్పు జరిగింది. దానికి కారణం ఈస్థటిక్స్‌ కాదు, పాలిటిక్సే. 
 
ప్రశ్న: మీ కవిత్వంపై ప్రభావాల గురించి చెప్పండి?
హెచ్చార్కే: మా వూరు, రాయలసీమ, నా మీది పెద్ద ప్రభావం. మా మద్దిలేటి వాగు అంటే నాకు విపరీతమైన ప్రేమ. ఆ వాగులో ఇసుకన్నా విపరీతమైన ప్రేమ. నా బాల్యం మీద మాత్రం నాకు ప్రేమ లేదు. నాకు నా ‘మాల్గుడీ డేస్‌’ లేవు అనుకుంటూ ఉంటాను. అందుకే నా ‘అబద్ధం’ కవితా సంపుటిలో నా ‘‘భాస్కరశతకోత్పలమాలావృత భయంకర బాల్య సశేషాన్ని చెబుతున్నాను నేను’’ అని రాశాను. బాల్యం కాకుండా మిగిలిందే కదా మన జీవితం. కానీ ఆ మద్దిలేటి వాగన్నా, ఇసుకన్నా.. అది మటుకు ఇష్టం నాకు. అక్కడ నిజమైన స్నేహితులు దొరికారు నాకు. ఆ తర్వాత చాలా హిపోక్రసీని చూశాను నేను. అక్కడ ఆ స్నేహితుల్లో అది కనపడేది కాదు. ఇక కవిత్వ ప్రభావాల విషయానికొస్తే--ఫస్ట్‌ అండ్‌ ఫోర్‌మోస్ట్‌--శ్రీశ్రీ. ఆయన చెప్పే పద్ధతి, ఆయనలోని ‘రా’నెస్‌ నాకు చాలా ఇష్టం. తిలక్‌ వెల్‌కట్‌ డైమండ్‌ అయితే, శ్రీశ్రీ అన్‌కట్‌ డైమండ్‌. శ్రీశ్రీ ఇన్‌ఫ్లుయెన్స్‌ నా మీద రెండు రకాలుగా ఉంది. మొదట ఇష్టం వల్ల కలిగిన ఇన్‌ఫ్లుయెన్స్‌ అయితే, రెండోది ఆయన్నించి దూరం జరిగే ప్రయత్నం ద్వారా కలిగిన ఇన్‌ఫ్లుయెన్స్‌. ఇంకా నా సీనియర్‌ పొయెట్స్‌లో నగ్నముని నాకు ఇష్టం. ‘సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్‌’ నగ్నమునిలో భలే ఉంటుంది. మొదటి చరణంలో చెప్పిందాన్ని నిషేధిస్తున్నట్టుగా (నిషిద్ధాక్షరిలా) రెండో చరణం ఉంటుంది. ఆ ఎలిమెంట్‌ ఆఫ్‌ సర్‌ప్రైజ్‌ లేకుండా మంచి కళ ఉండదనేది నా అభిప్రాయం. 
 
ప్రశ్న: మీకు కమ్యూనిస్టు రాజకీయాలతో పరిచయం ఎలా జరిగింది?
హెచ్చార్కే: లయోలా కాలేజ్‌లో ఉండగా చండ్ర పుల్లారెడ్డి దగ్గరకు వెళ్ళి కమ్యూనిస్టు పార్టీలో పని చేస్తానని అడిగాను. ఆయన నిరుత్సాహపరిచాడు. అప్పుడే వాళ్ళు సిపిఎం నుంచి బైటకు వస్తున్నారు. అది కారణం కావొచ్చు. తరువాత ఆయనే నన్ను పాలిటిక్స్‌లో దింపాడు. ఎమ్మే కాగానే మా వూళ్ళో నాకు తెలిసిన పేద పిల్లలందరితోనూ ఒక రైతు కూలీ సంఘం పెట్టాను. భలే గడిచింది మాకు. గద్దర్‌ పాటలూ, వంగపండు పాటలూ... ఏవంటే అవి పాడుకునేవాళ్ళం. జల్ల మీద ఒక పెట్రోమాక్స్‌ లైటు పెట్టి ‘‘మల్లిగాడ్ని నేను.. దొర జీత గాణ్ణి నేను...’’ అని ఎగురుకుంటూ పాడి, ‘‘కామ్రేడ్స్‌’’ అని ఉపన్యాసం ఇచ్చి, విప్లవ రాజకీయాల గురించి చెప్పి వచ్చేవాళ్లం. సంఘం పెట్టాకా మాకు అనిపించింది--మన ఊరికి మాత్రమే సంఘం ఉంటే సరిపోదు కదా, ఇది కాదు మనం చేయాల్సింది అనిపించింది. అలా ఏదన్నా కమ్యూనిస్టు పార్టీలో చేరాలనుకున్నాం. అప్పుడు తరిమెల నాగిరెడ్డి గ్రూపు నుంచి మండ్ల సుబ్బారెడ్డిని మా ఊరికి పిలిపించుకున్నాం. ఆయన మాట్లాడుతూ చెప్పిన రాజకీయాలకన్నా హ్యూమన్‌ రిలేషన్స్‌ విషయంలో ఆయన అభిప్రాయాలు అసహ్యంగా అనిపించాయి. రాధక్కకు, చండ్రపుల్లారెడ్డికి సంబంధాల వల్ల పార్టీ చెడిపోయిందన్నాడు. ఇక అదేం కమ్యూనిస్ట్‌ పార్టీ అనుకున్నాను. వర్గ శత్రు నిర్మూలన అనేదాన్ని నేనెప్పుడూ సమర్థించలేదు. ఒక భూ స్వామిని చంపితే మిగతా భూస్వాములు పారిపోతారు, ఊరు మనదై పోతుంది. అది కదా చారుమజుందార్‌ చెప్పిన వర్గ శత్రు నిర్మూలన సారాంశం. ఎమ్మే రెండేళ్ళలో... చదువుతున్నప్పుడు విరసంలో పని చేశాను కదా, అప్పుడు కూడా ఆ విషయంలో విభేదించాను. 
 
ప్రశ్న: సాయుధ వర్గ పంథా మీద కూడా మీ అభిప్రాయం ఈ మధ్య మారినట్టుంది?
హెచ్చార్కే: ఈ మధ్య ఏమీ మారలేదు. 1986 నాటికే మారింది. అది మారగానే నేను పార్టీ వదిలేశాను.