పెట్టుబడిదారీ సమాజాల్లో అటవీ వనరులను కొల్లగొట్టు పోతున్నది కేవలం స్మగ్లర్లో, అడవి దొంగలో అనే భ్రమను రచయిత పాఠకులకు కల్పిస్తున్నారు. కానీ అడవులనూ అక్కడి వనరులనూ కొల్లగొట్టుకు పోయేది అడవి దొంగలు మాత్రమే కాదు. ఈ దోపిడీలో ప్రధాన భాగం వారి వెనక కథ నడిపించే రాజకీయ శక్తులు, ఆ రాజకీయ శక్తులను నడిపించే బడా అంతర్జాతీయ కార్పొరేట్‌ శక్తులు. ఇంతటి నెట్వర్క్‌ను ఒక సిన్సియర్‌ ఆఫీసర్‌ తన నిజాయితీతో మార్పు చేయగలుగుతాడని చెప్పడం పాఠకులను భ్రమింపజేయటమే. 

 
సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ‘కొండపొలం’ నవలని సమీక్షించిన దేశరాజు (వివిధ, 24-08-2020) నిష్పాక్షికంగా వ్యాఖ్యానం చేయడంలో కొంత మొహమాటపడ్డారనిపించింది. 2019లో తానా నవలల పోటీలో రెండు లక్షల బహుమతి గెలుచుకుంది ‘కొండ పొలం’. ఇతివృత్తం అధోజగత్‌ సహోదరులైన గొల్లల జీవితమే అయిన ప్పటికీ రచయిత టార్గెట్‌ పాఠకులు మాత్రం మధ్యతరగతి వర్గం. అందుకోసం వారికి ఆకర్షణీయమైన కథాంశంగా ఉండేటట్టుగా జాగ్రత్త పడ్డారేమో అనిపిస్తుంది ఈ నవల చదువుతుంటే. 
 
ఇతివృత్తం: రవీంద్ర యాదవ్‌ గొల్ల యువకుడు. ఇంజనీరింగ్‌ చదివి ఉద్యోగం సాధించే నిమిత్తం హైదరాబాదులో కోచింగ్‌ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటాడు. పల్లెలో పెరిగినవాళ్లకి సహజమైన ఆత్మన్యూనతా భావం, బిడియం వీటితో పాటు ఇంగ్లీష్‌ రాకపోవడం... వీటి వల్ల ఇంటర్వ్యూలలో తరచుగా ఫెయిల్‌ అవుతుంటాడు. అలా మధ్యలో దొరికిన ఖాళీ సమయంలో తన ఊరికి వస్తాడు. అప్పటికి తన పేటలో గొల్లలందరూ గొర్రెలకు గడ్డి, నీళ్లు దొరకక కొండపొలం వెళదామనే యోచనలో ఉంటారు. కొండ పొలం అంటే- ఊళ్లో గొర్రెలకు గ్రాసం, నీరు దొరకని పరిస్థితులు ఏర్పడినప్పుడు గొల్లలు వాటిని సమీపంలో ఉన్న నల్లమల కొండలపైకి తీసుకు వెళతారు. రవి కూడా తన తండ్రి గురప్పతో గొర్రెలను తీసుకొని కొండపొలం వెళతాడు. తనలోని భయాన్ని, ఆత్మన్యూనతను పోగొట్టుకోవడానికి ఈ అరణ్యవాసం ఉపయోగపడుతుంది. ఆ క్రమంలో పులులను మించిన క్రూరమృగాలు అడవిలో స్మగ్లర్ల రూపంలో దాగి ఉన్నాయని గ్రహిస్తాడు. నిండైన ఈ అనుభవాలతో రవీంద్ర తిరిగొచ్చి తన దశను దిశను మార్చు కుంటాడు. సాఫ్ట్వేర్‌ ఇంజనీర్‌ అవాలన్న లక్ష్యాన్ని మార్చుకుని, అడవిని కాపాడాలని కష్టపడి చదివి ఫారెస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగం సంపాదిస్తాడు. 
 
ఈ నవలలో అభూత కల్పనలు, అసంభావ్యతలు చాలాచోట్ల చోటు చేసుకున్నాయి. బహుశా మసాలాలు దట్టించి చూపాలనే ఉద్దేశ్యం కావచ్చు. కానీ చిక్కని జీవితాన్ని ప్రతిబింబించే ఈ నవలలో అటు వంటి మసాలాలు దట్టిస్తే జీవితం పలచన అయ్యి నవల అసలు ప్రయోజనం దెబ్బతినే ప్రమాదముంది. రవీంద్ర యాదవ్‌ సాఫ్ట్వేర్‌ ఇంజనీర్‌ అన్న లక్ష్యాన్ని మార్చుకుని ఫారెస్ట్‌ ఆఫీసర్‌ అవుతాడు. అతను విజయం సాధించడంతో నవల ప్రయోజనం నెరవేరినట్టుగా చిత్రీకరించారు. కానీ అతని విజయానికి దోహదపడిన అతని వర్గం యథావిధిగా భూస్వామ్య విధానపు చట్రంలో అణిగిపోతూనే ఉంటారు. వాళ్ళ జీవితాలలో ఏ మార్పు రాదు. రవీంద్ర యాదవ్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌గా స్మగ్లర్ల బారినుండి అడవిని, జంతువులను రక్షించినట్టుగా చెప్పడం చాలా అసహజంగా ఉంది. పెట్టుబడిదారీ సమాజాల్లో అటవీ వనరులను కొల్లగొట్టు పోతున్నది కేవలం స్మగ్లర్లో, అడవి దొంగలో అనే భ్రమను రచయిత పాఠకులకు కల్పిస్తున్నారు.