చేసినతప్పు చెబితే పోతుంది కదా అనేది సామెత. అక్కిత్తం దీర్ఘ కవిత ‘ఇరవయ్యో శతాబ్దపు ఇతిహాసం’ చేసిన పని ఇదే. ఇది ఒక నేర సమ్మత పత్రం (confessional statement). తొలి దశలో అభ్యుదయం వైపు నిలబడిన ఈ కవి తరువాతి కాలంలో రాజకీయ రంగంలో జరిగిన హింసాపరమైన అతిపోకడల వల్ల విసుగు చెంది వాటిని ఖండిస్తూ, మానవత్వాన్ని వెలిగించమని కోరి వ్రాసిన దీర్ఘ కవిత ఈ పుస్తకం.

 
‘‘పరుల కోసం
నేనొక కన్నీటి బొట్టు రాల్చినప్పుడు
నాలో ఉదయిస్తాయి
వేల వేల సూర్య మండలాలు
పరుల కోసం
నేనొక చిరునవ్వు చిలికితే
నా మదిలో ఊగుతుంది
నిత్య నిర్మల పున్నమి
తెలియలేదిది, ఇన్నాళ్ళు
ఇదే నిత్యానంద రహస్యమని
ఎంత నష్టపోయానో, గుర్తొచ్చి
వెక్కి వెక్కి ఏడుస్తున్నానిప్పుడు’’
 
‘ఇరవయ్యో శతాబ్దపు ఇతిహాసం’ అనే దీర్ఘ కవిత మొదటి పేజీలోనే కవి వ్రాసిన పంక్తులు ఇవి. ఇలాంటి ఒక దృక్పథం కలిగిన కవి మానవత్వానికి పెద్ద పీట వేస్తారననేది ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు కదా. ఈ పంక్తులు వ్రాసినది 2019కి గాను జ్ఞానపీఠ పురస్కారానికి ఎన్నికైన మలయాళ కవి శ్రీ అక్కిత్తం అచ్యుతన్‌ నంబూదిరి. 1958లో వెలువడిన తన ‘ఇరవయ్యో శతాబ్దపు ఇతిహాసం’ (ఇరుపతాం నూటాంటిన్టే ఇతిహాసం) దీర్ఘ కవిత ప్రారంభంలో ఈ పంక్తులు వ్రాసారు. (ఈ పుస్తకానికి నా తెలుగు అనువాదం 2008లో ప్రచురితమైంది.)
 
18-3-1926లో సంప్రదాయబద్ధమైన ఒక నంబూదిరి కుటుంబంలో జన్మించారు అక్కిత్తం. అలనాటి సమాజంలో వీచిన సాంస్కృతిక సామాజిక పునరుజ్జీవపు గాలి అగ్రకులస్తులూ, భూస్వాములు అయిన నంబూదిరి సమాజాన్ని కుదిపి వేసింది. ఎన్నో కుటుంబాలను అభ్యుదయంవైపు నడిపిం చింది. ఆ కాలంలోనే కవిత్వం వ్రాయడం ప్రారంభించారు అక్కిత్తం. మనసులో అంకురించిన హేతువాదం, సమాజం లోని కొన్నిటిని ప్రశ్నించడానికి ప్రేరణ ఇచ్చింది. కానీ పుట్టుక వల్ల సంక్రమించిన అనుభవాలు, సంప్ర దాయాలు, తమను అనుసరించమని హెచ్చరించాయి. తీవ్ర సంఘర్షణకి గురైంది అతని మనసు. తొలి దశలో వ్రాసిన ‘బ్రహ్మ సూత్రం’ మొదలగు కవి తల్లో ఈ సంఘర్షణ కనబ డుతుంది. తరువాత కాలంలో, జరిగిన వర్గపోరాటాలు తెచ్చిపెట్టిన హింస వల్ల విసుగుచెంది మనసు విరిగి నిష్కల్మష స్నేహపుబాటవైపు అడుగులు వేసాడు కవి. అప్పుడే ఇరవయ్యో శతాబ్దపు ఇతిహాసం అనే దీర్ఘ కవిత వ్రాసాడు.
 
ఇంచుమించు 55 పుస్తకాలు రచించారు ఈ కవి. వాట్లో కొన్ని బాల సాహిత్యానికి చెందినవి; మరి కొన్ని అనువాదాలు. మిగతా సంపుటాలన్నీ కవిత్వమే. ‘బలిదర్శనం’ (1973) గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం అందుకున్నారు. ‘బలిదర్శనం’, ‘ఇరవయ్యో శతాబ్దపు ఇతిహాసం’, ‘నిమిష క్షేత్రం’, ‘ఎంపిక చేసిన కవితలు’, ‘ముత్యపు స్పర్శ’, ‘మానస పూజ’, ‘అమృత ఘటిక’, ‘గాజుల గలగలలు’, ‘పంచవర్ణ చిలకలు’ మొదలైనవి అక్కిత్తం ముఖ్య రచనల్లో కొన్ని. అంతేకాక శ్రీమద్‌ భాగవతానికి మలయాళ అనువాదం కూడా రచించారు ఈ కవి .
 
చేసిన తప్పు చెబితే పోతుంది కదా అనేది సామెత. అక్కిత్తం దీర్ఘకవిత ‘ఇరవయ్యో శతాబ్దపు ఇతిహాసం’ చేసిన పని ఇదే. ఇది ఒక నేర సమ్మత పత్రం (confessional statement). తొలి దశలో అభ్యుదయం వైపు నిలబడిన ఈ కవి తరువాతి కాలంలో రాజకీయ రంగంలో జరిగిన హింసాపరమైన అతిపోకడల వల్ల విసుగుచెంది వాటిని ఖండిస్తూ, మానవ త్వాన్ని వెలిగించమని కోరి వ్రాసిన దీర్ఘ కవిత ఈ పుస్తకం.
 
‘‘జీవన ప్రేమా!
నీ శిలువ గాయమై నా గుండె నుంచి
పశ్చాత్తాప భావనల నెత్తురు పారుతోంది
గుండెలోని నరాలు
అలసిపోతున్నాయి పూర్తిగా’’
- అంటారు ఈ పుస్తకంలో.
 
జీవిత వాస్తవికతలను, వాటి భయంకరమూ జుగుప్సాకరమూ అయిన రీతిలోనే ఆవిష్కరించడంకోసం, గగురుపుట్టించే ప్రతీకలను వాడడానికి కూడా అసలు సందేహించరు ఈ కవి. ఉదాహరణకి: ‘‘కాకి చీలుస్తుంది రోడ్డుపైన/ చచ్చినదాని కనుపాపలు/ రొమ్ము పీకుతోంది చనుబాలు కోసం/ నర వర్గ నవాతిథి’’ అనే పంక్తి చూడండి. మలయాళ సాహిత్యంలోనేకాక మలయాళీల గుండెల్లో కూడా నిలిచిపోయిన: ‘‘వెలుగు దుఃఖమే బాబు/ చీకటేగా సుఖప్రథం’’ అనే పంక్తి వ్రాసింది కూడా ఈ కవియే.
 
సమకాలీన సమాజంలోని విలువల పతనం గురించి తిరువోనం (మలయాళీల ఓనం పండుగ) గురించిన పురావృత్తాన్ని నేపథ్యంగా తీసుకొని రచించిన కావ్యం ‘బలిదర్శనం’. ఈ పుస్తకానికే కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం లభించింది. తన కవిత్వం గురించి అక్కిత్తం ఇలా అన్నారు:
 
‘‘ ‘మనిషి అవగాహనతో అందుకునే దానికన్నా ఉన్నతంగా ఉండాలి అతని సాధనా ప్రయాస’ అని అన్నాడు రాబర్ట్‌ బ్రౌనింగ్‌. అయితే నా సాధనా యత్నాలు నా అవగాహనా పరిధిని అధిగమించి ఎదిగాయా లేవా అని అడిగితే నేను చెప్పలేను. కానీ స్వర్గం మాట అంటారా- నేను దాన్ని నా రచనలో అనుభవించగలిగాను. నా జీవితం, కవిత్వం విడతీయరానిది. నేనేం చేస్తానో అదే వ్రాస్తాను; ఏం వ్రాస్తానో అదే చేస్తాను. నా జీవితాన్ని నా కవిత్వంలో చదవవచ్చు. నా ఏడున్నరేళ్ళ వయ స్సులోనే సంస్కృతం, జ్యోతిశ్శాస్త్రం, ఋగ్వేదం వగైరాలు నేర్చుకోనారంభించాను. ఋగ్వేదం చివరలో ‘సంపద సూక్తం’ అనే సూక్తం ఒకటి వుంది. అందులో సమానం అనే మాట పది సార్లకు పైగా పునరావృతమవుతుంది. అప్పట్లో, మహాకవి వల్లధోల్‌ చేసిన ఋగ్వేద మలయాళ అనువాదం, ఆ సూక్తం తాలూకు అర్థమేమిటో విపులంగా తెలుసుకోవడానికి ఉపయోగపడింది.
 
ఈ నేపథ్యంలో, ఇ.ఎం.ఎస్‌. వ్రాసిన ‘సోషలిజం ఎందుకు’, సి. అచ్యుత మీనోన్‌ వ్రాసిన ‘సోవియట్‌ నాడు’, వెండెల్‌ విల్కీ వ్రాసిన ‘ఒకే ప్రపంచం’ మొదలగు గ్రంథాలు నా సామాజిక దృక్పథాన్ని విస్తృత పర్చుకోవడంలో, జీవితాన్ని దర్శించే పద్ధతిని ఏర్పరు చుకోవడంలో తోడ్పడ్డాయి. ఈ రచ నలు నన్ను కార్ల్‌మార్క్స్‌ కృషి వైపు నడిపించాయి. ఆయన వ్రాసింది నన్ను ఎక్కువగా ఆకట్టుకుంది. క్లుప్తంగా చెప్పాలంటే సంపద సూక్తమే సామ్యవాదాన్ని ప్రవచించిన మొదటి రచనయని నా నమ్మకం. సమస్త ప్రాణకోటి సమానులే అనే భారతీయ వేదదర్శనంతో మార్క్స్‌కి పరిచయం వున్నట్లు ఎటువంటి దాఖలాలూ లేవు. అయినా, మన సూక్తి దర్శమైన వసుధైక కుటుంబమనే భావాన్ని తన చింతనలో మిళితం చేసుకున్నాడు.
 
కాలగమనంలో ఏ ప్రభుత్వాలూ పరిపాలించ నవసరం లేని ఒక సమాజం ఏర్పడుతుందనే ఆలోచన అతనిది. తమని తామే పరిపాలించుకోగలిగిన క్రమశిక్షణ, సన్నద్ధత కలిగి, భారతీయ పురాచింతన నిర్వచించిన దైవత్వ దశకి చేరుకుంటారు జనం. అరబిందో దృక్కోణం వంటిదే మార్క్స్‌ది కూడా. జ్ఞానపర మైన, భౌతికపరమైన, మానసికమైన, శారీరకమైన, ఆధ్యాత్మిక మైన దర్శనాల మధ్య ఎటువంటి తేడానూ ఏనాడూ నేను గుర్తించ లేదు. రాజకీయం కులం మతం వగైరాలేవీ నా మానవ దృక్పథాన్ని ప్రభావితం చేయవు’’ అని చెప్తున్నారు అక్కిత్తం. ఈ కవిని జ్ఞానపీఠ పురస్కారం వరించడం సాహిత్య ప్రపంచానికి ఎంతో ఆనందదాయకం.
 
ఎల్‌. ఆర్‌. స్వామి
99490 75859