హనుమంతుడు అనే పేరు వజ్రఘాతం వల్ల, మారుతి అనే పేరు తండ్రి వాయుదేవుని మారుతమనే పేరు వల్ల, ఆంజ నేయుడు అనే పేరు తల్లి పేరుతో వచ్చినాయి. కాని తల్లి ఆంజనేయుడికి పెట్టుకున్న అసలు పేరేమిటి?

*************************** 

‘షోడశి’పుస్తకంలో ‘‘శ్రీసుందరకాండకు పేరెట్లు వచ్చినది’’ అనే అధ్యాయంలో ఆసక్తికరమైన చర్చ లేవదీశారు శేషేంద్ర శర్మ. ‘‘హనుమంతుడు సుందరుడగుట, సుందర హనుమన్మంత్రమని యొకటి యుండుట, హనుమంతుడు నివసించిన స్థానములలో ఒకదానికి సుందరనగరమనే పేరు ఉండుట...’’ ఇలా అనేక కారణాలని అంటారు శేషేంద్ర. ‘‘వాల్మీకి వేదముననుసరించి శ్రీ రామాయణము వ్రాసెననుట న్యాయమే అనిపించును. ఇది యొక పెద్ద గొడవ. ఇది నిరూపించుటకు నాకు శ్రీ శర్మగారికున్నంత యోపికలో సగమైన నుండవలయును. నాకు లేనిదే అది’’ అంటూ విశ్వనాథ ‘షోడశి’ పుస్తకానికి ముందుమాటలో శేషేంద్రశర్మకు ఒక అద్భుతమైన ప్రమాణ పత్రాన్ని ఇచ్చారు.  

 
గుంటూరు శేషేంద్ర శర్మ రచనల్లో ‘షోడశి - రామాయణ రహస్యాలు’ గ్రంథానికి ఒక విశిష్టత ఉంది. అనేకానేక ఉత్తమ లక్షణాలతోపాటు కవిసమ్రాట్‌ విశ్వనాథ వారిచ్చిన యోగ్యతాపత్రం చెప్పుకోదగ్గ దీని మరో విశిష్ఠత. ‘షోడశి’కి వ్రాసిన ముందుమాటలో శేషేంద్ర లోచూపును ప్రస్తావిస్తూ శేషేంద్ర తనకు ఆహా పుట్టించాడంటారు విశ్వనాథ: ‘‘ఆశ్చర్యములలో నాశ్చర్య మేమనగా భారతము రామాయణమునకు ప్రతిబింబమని (శేషేంద్రశర్మగారు) చేసిన ప్రతిపాదన. సంపూర్ణముగా ప్రతిబింబము కాకపోయినను శ్రీశర్మగారు చూపిం చిన స్థలములలోని ప్రతిబింబత్వము నాకాహా పుట్టించినవి. శ్లోకములు శ్లోకములు చరణములు చరణములు వానియంతట వానినే భగవంతు డైన వ్యాసుడు వాడుకొనెను.... వాల్మీకిని యథేచ్ఛగా వాడుకొన్న వారిలో మెదటి వాడు వ్యాసుడు.’’ 
 
శేషేంద్రను లోతైన మనిషి అంటూ కవి సమ్రాట్‌ ఈ విధంగా పేర్కొన్నారు: ‘‘శ్రీశర్మ గారికి నాకు నేడెనిమిదేండ్ల నుండి చెలిమి గలదు. వారింత లోతైన మనిషియని నేనను కొనలేదు. అప్పుడప్పుడు నైషధము నుండి కొన్ని శ్లోకములు దేవీ పరముగా వారన్వయిం చినప్పుడు నేను వారికవి యాదృచ్ఛికముగా తోచిన విషయములనుకొన్నాను గాని శ్రీవిద్యా విషయము నింత లోతుగా తెలిసిన వారనుకొన లేదు. వారీ గ్రంథమును వ్రాసినందుకు తెలుగువారే కాదు. భారతీయులందరును కృతజ్ఞులుగా నుండ వలసిన విషయము.’’ తనకు నచ్చకపోతే నిర్మొహమాటంగా మొహంమీదే దులిపేయగల సాహసం విశ్వనాథగారికుందని వేరే చెప్పనవసరం లేదు. ఆయన ఎవరినైనా మెచ్చుకోవడం సులువుగా జరగదు. ఆయన శేషేంద్రను అభినందించడానికి ఉపయోగించిన వాక్యాలు, భాష చూడాల్సిందే: ‘‘శ్రీశర్మగారు త్రిజటా స్వప్నమును గాయంత్రీ మంత్రము లోని పాదముల సంఖ్యయు నక్షర ముల సంఖ్యయు తీసికొని అది గాయత్రీ మంత్రమునకు నొక విధ మైన వ్యాఖ్యయని నిరూపించుట మిక్కిలి యూహాస్ఫోరకముగాను న్నది; వారి శ్రద్ధను నిరూపించు చున్నది. ఇది పారాయణము చేయ నెంచెడి వారికి శ్రీశర్మగారు చేసిన యుపకారమింతయని చెప్ప రాదు. ఒక గ్రంథకర్త ఒక మహా విషయమును వ్రాయును. సహజ ముగా నతడెంత గొప్పపని చేసెనని పరులు ప్రశంసింప వలెనని యతని కుండుట వాడెంత గ్రంథ కర్తయైునను జీవిలక్షణము. ప్రశంసించెడి వారు గూడనెట్లు ప్రశంసింతురు. పెదవితో ప్రశంసింతురు. నిజముగ బ్రశంసించెడి వాడెవడనగా త్రిజటా స్వప్నములోని యీ రహస్యమును తెలిసికొని దానిని ప్రధానముగా తన పారాయణములో పెట్టుకొనెడి వాడు.’’