‘‘అడవీ/ నువ్వంటే నాకిష్టం/ రేపటి దేశానికి/ ఈనాటి తల్లివి నువ్వు/ రేపటి ఆకాశానికి/ ఈనాడే పూసిన సూర్యపుష్పానివి నువ్వు’’ అంటూ దేశ భవిష్యత్తును కాంక్షించిన అమ్మచెట్టు నిలువునా కూలిపోయింది. కవిత్వపు నీటిపుట్ట భళ్లున పగిలిపోయింది. తుపానుతుమ్మెద తీరం దాటిపోయింది. చివరికి పిట్ట కూడా ఎగిరి పోయింది. శనివారం హైదరాబాద్‌లో తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన దేవిప్రియ, పైన తన కవిత్వంలో చెప్పిన అన్నీ తనే అయి మౌనంగా వెళ్లిపోయాడు. మౌనంగా, ముభావంగా, పలకరిస్తే తప్ప పలకనట్లుండే దేవిప్రియ లోలోపల చెట్లున్నాయి, నీటిపుట్టలున్నాయి, గంధకుటిలున్నాయి, అరణ్యాలున్నాయి, గాలిరంగులున్నాయి, చేపచిలుకలున్నాయి, వీటన్నిటితో దాదాపు నలభై దశాబ్దాల తెలుగు పాత్రికేయ, సాహిత్య, సినీ, కళారంగాలలో ఒక బలమైన ముద్ర వేశాడు దేవిప్రియ.
గుంటూరు జిల్లా తాడికొండలో పుట్టిన దేవిప్రియ, నూనూగు మీసాల నూత్న యవ్వనంలోనే ప్రజావాహిని పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు- అక్కడ మొదలైన దేవిప్రియ పాత్రికేయ వ్యక్తిత్వం వికసించి ‘ప్రజాతంత్ర’ వార పత్రికలో శ్రీశ్రీ చేత ఆత్మకథ రాయించడం, అది సంచలనాలకు గురికావడం, ‘అనంతం’ ఆత్మచరిత్రాత్మక కథనం పేరుతో పుస్తకంగా రూపొందడం అందరికీ తెలిసిందే. కవిత్వాన్ని, పాత్రికేయ వృత్తిని జోడుగు ర్రాల్లా స్వారీ చేసిన కవి మరొకరు కనిపిం చరు. ‘‘నాకు రెండు నిధులున్నాయి/ నాలుక మీద కవిత్వం/ తల మీద దారిద్య్రం/ నాకు రెండు విధులున్నాయి/ కవిత్వ నిత్య నిబద్ధం/ దారిద్య్ర విముక్తి యుద్ధం’’ అని ‘నీటిపుట్ట’లో ప్రకటించిన దేవిప్రియ చివరి శ్వాస వరకు ఆ రెంటి మీద యుద్ధం ప్రకటించాడని, ఆయన రచనలు, వృత్తి జీవితం, నిబద్ధత తెలియ చెప్తాయి. వజ్రానికి బహుకోణాలు ఉన్నట్టు దేవిప్రియ సాహితీ, వృత్తిగత, వ్యక్తి జీవితంలో అనేక పార్శ్వాలు తళుక్కున మెరుస్తాయి. అవేమీ ఆయనకు అలవోకగా సిద్ధించినవి గావు. ఎప్పటికప్పుడు తనను తాను వాటి కోసం సిద్ధం చేసుకుంటూ, అందివచ్చినప్పుడు సంతృప్తిపడీ, కలిసిరానప్పుడు నిర్వే దపడీ కాకుండా ఒక స్థితప్రజ్ఞత్వంతో దాన్ని సాధించుకున్నాడు.
పైకి ఏమీ పట్టించుకోనట్టు ఉండే ఈ కవిలో ఇన్ని ఎలా సిద్ధించాయి అంటే, అది నిత్యం లోపల రగిలే నిప్పు- అది కవిత్వమా! జర్నలిజమా! సినిమాయా! ప్రయో గమా! కాదు వీటన్నిటినీ మించి వాటిని తాను సాధించగలననే ఒక ధీమా! ఒక నమ్మకం! ఒక విశ్వాసం! అది దేవిప్రియ కలిగి ఉండటమే కాదు, దశాబ్దాల తెలుగు సాహితీ కళా ప్రపంచాలకు కలిగించాడు, నిరూపించాడు. ఆయన సినిమా ప్రయత్నాల జయాపజయాలను పక్కనపెడితే, ప్రజావాగ్గేయకారుడు గద్దర్ మీద రూపొందించిన ‘ప్రజాయుద్ధనౌక గద్దర్’ లాంటి డాక్యుమెంటరీ మళ్లీ మళ్లీ మనం నిర్మించుకోగలమా అనిపిస్తుంది. ఒక పక్క కవిత్వంలో ‘అమ్మ చెట్టు’ నుండి మొదలుపెట్టి... ‘ఇంకొకప్పుడు’ వరకూ దాదాపు పది సంపుటాల కవిత్వంలో దేవిప్రియ రాసింది ఎప్పుడూ తుడవ లేదు. పైగంబర కవులతో ప్రారంభం అయిన ఆయన కవితా ప్రస్థానం సమాజంలోని అన్ని గాలులను సాదరంగా ఆహ్వానించింది. తొలి నుండీ కవిత్వంలోనూ, జీవితంలోనూ వామ పక్షానికి రెక్కచాపిన దేవిప్రియ అస్తిత్వ ఉద్యమాల ఉరవడిలో తనూ లోప లికి చూసుకోక తప్పలేదు. ‘‘రంజానంతా నాకు/ ఖసీదాలు పాడుకుంటూ/ తప్పెట వాయించుకుంటూ/ తొలి వెలుగు కంబలి కప్పుకుని/ మా అమ్మమ్మ ఇచ్చే హిదియా కోసం వేచి వుండే ఫకీరు’’ నుండి 1990ల నాటి బాబ్రీ విధ్వంసం తర్వాత ‘‘బాబ్రీ మసీదు/ ఇప్పుడొక రెక్కలు విరిచిన ప్రాంతం/ కుప్పకూలిన చోటే కునారిల్లుతున్న/ శతాబ్దాల శిథిల శకలాలు/ రాజకీయ చరిత్రగా మారిన/ ఆధ్యాత్మిక పరంపర’’ అనడం ఆయనలోని రాజకీయ చైతన్యానికి ప్రతీక. శ్రీశ్రీ తర్వాత కవిత్వంలో అన్ని ప్రయోగాలు చేసింది దేవి ప్రియే!