వాళ్ళు ఇల్లు చేరాలి
కళ్ళల్లో కడపటి ఆశల్ని మొలిపించుకొని
గుండెలపై వలస ముద్రల్ని పొడిపించుకొని
ముళ్ళదారుల్ని, మైలురాళ్ళను, మానవనైజాలను
వెక్కిరిస్తూ, ధిక్కరిస్తూ, దిగులు గుట్టల్ని మోసుకెల్తున్న
వాళ్ళు ఇల్లు చేరాలి.
ఆది మానవుడి ఆకలి వేటకాదీ నడక
ఆధునిక అంతరాల కంచెలపై
పావురాల నెత్తుటి పాదముద్రల పాట.
రాత్రీ పగల్ల కాలగతులను కాల్చుకుంటూ వెళుతున్న
వాళ్ళు ఇల్లు చేరాలి.
కరచాలనాలకు దూరమైన కథ ఇప్పటిదేం కాదు
మూతికి ముంత - ముడ్డికి తాటాకు కట్టిన చేతులే
మూకుమ్మడి సానిటైజర్ స్నానాలు చేయిస్తున్నాయి
రూపం మారిన అన్‌టచబుల్ ఆట.
ఆజ్ఞల గండాలు దాటి అగ్నిపునీతులై
వాళ్ళు వాళ్ళ ఇల్లు చేరాలి.
కాళ్ళల్లో తిరిగిన పిల్లి పిల్లకు కంకెడు
ముద్దవేసిన కారుణ్య మెటు పాయె
చూరులో పిట్టల కోసం వరి గొలుసులు కట్టిన
మానవత్వమేమై పోయే
కంటి రెప్పలకు తాళాలేసుకున్న
మన ఇంటి గుమ్మాలను దాటుకుంటూ
కదిలి పోతున్న కళేబరాల గుంపు
వాళ్ళ వాళ్ళ ఇళ్ళకు చేరాలి.
ఇల్లు చేరాక ఏమౌతుంది?
ఇప్పుడు సమాధానం దొరకని ప్రశ్నొకటి సలపరిస్తుంది.
అటునుంచి ఇటు - ఇటు నుంచి అటు
ఆకలి తరిమే వేటలో
నడక ఆగేదెప్పుడు?
ఆకలి లేని లోకానికి సాగిపోతున్న
కొత్త దారుల్ని ఈ పాదాలకెవరైనా పరిచయం చేస్తారా?
గాజోజు నాగభూషణం
98854 62052.