నువ్వు ఇంట్లో సమూహంగా...

నడిరోడ్లో నేను ఒంటరిగా...
ఇరువురమూ క్వారంటైన్డ్‌!
చిక్కటి అడవి బాటల్లో
దారి తప్పిపోయిన లేగదూడ...
తల్లి పొదుగు చేరేది ఎప్పటికి!
 
అక్కడక్కడా తెలిసిన జాడల్లా
నీ కోసం, నీ నడ్డిమీదే విరిగే లాఠీల్లా
కళ్లల్లో మండే ఒత్తులే, ఖాకీలు!
 
గడప ‘లక్ష్మణరేఖ’ దాటితే
కాటు పడుతుందనే భయం..
హెచ్చరికలే పాదాలకు బేడీలు!
 
కర్తవ్యాచరణలో పడకుంటే
వేటుకు వెరవరాదనే సంశయం..
విధులే, విడచబడిన కళ్లేలు!
 
పగటి వెలుగుల కాంతిలో 
పరచుకున్న తారు నీడలే వీధి.. 
చీకట్లయి ఆకసాన్ని కమ్మితే, నిశీధి!
 
ఊరు- నిద్రపోయిన స్మశానం
దారి- సిద్ధం చేసిన వధ్యశిల
మానవ కలయికలే మరణశాసనాలు!
 
అవధానంలో నిషిద్ధాక్షరిలా
సంఘ నిషేధాలకు నిషేధంగా,
వెలిగా బలిగా, ఇవి నిషిద్ధ బతుకులు!
తూము చుట్టూ రంధ్రాల్లోంచి
చిప్పిలి, కారిపోయే నీటి పాయల్లా
నిషేధాజ్ఞల పిడికిటి పట్టులోంచి
పోతూనే ఉండే... జారుడు జాడలు!
బిక్కు బిక్కుమంటూ ఇల్లు చేరాక
అకాల మరణం ఇవాళ, 
మనల్ని వెన్నంటుకుని వచ్చిందో ఏమో....
సకుటుంబ సపరివారంగా
కబళిస్తుందో ఏమో...
తేలేది రెండు వారాల తరవాతే!
 
 
 
అప్పటిదాకా వాక్‌, బుద్ధి 
మనో... ఏతత్‌ భవ కర్మలన్నింటికీ
క్వారంటైన్‌!
 
(కరోనా నిషేధాజ్ఞలు ఎన్ని ఉన్నా... రోడ్డునపడుతూ విధినిర్వహణలో ఉండే అత్యవసర సేవల సారథులందరికీ)
 
కె.ఎ. మునిసురేష్‌ పిళ్లె
99594 88088