ఉండకుండా పోకు

ఉండకూడని చోటికి పోకు
నువ్వు లేని చోట
 
నీ ఉనికికోసం చూడకు
కాలం లోపలి కాలం
గడిచేకొద్దీ మారుతుంటుంది
 
ఎదురుచూస్తుంది
ఎద బరువు మోస్తుంది
అలసిపోతుంది
అలిగి పోతుంది
పగిలిపోయిన వేళ
కనుమరుగైపోతుంది..
 
కాలాన్ని దాచిన కాలం
శవమైపోతుంది
 
అందుకే
ఊపిరున్నంతసేపు
ఉండకుండా పోకు
ఉండకూడనిచోటికి
అసలే పోకు
 
వెళ్లిపోయిన అలతో
బయటి కాలం
కరిగిపోయింది
నువ్వు లేకుండా పోతే
భళ్ళున పరిగెత్తుకొచ్చి
నీ అడుగులు చెరిపేసి
నువ్వెవరో ఎవ్వరికీ
ఎప్పటికీ తెలియనట్లు
జీవన్మరణాలను కలిపి
అందుకోలేని తీరంలో
బందీ చేస్తుంది..
 
పుట్టడమూ చావడమూ
స్పృశించలేని వ్యధలో
నిన్ను మరచిన నేను
కాలం లోపలి కాలంలో
నిదురిస్తూనే ఉంటాను..
నిన్నప్పటికే పూర్తిగా
మరచివేయబడి ఉంటాను..
అంతకంటే ముందే
నాకు నువ్వు
ఉండకుండా పోకు..
 
స్వేచ్ఛ వొటార్కర్‌
swetcha.vs@gmail.com