టెక్నాలజీపరంగా ప్రసారమాధ్యమాలు కొత్తపుంతలు తొక్కుతున్న నేటి నేపథ్యంలో కథ రూపంలోనూ మార్పులు వచ్చాయి, వస్తున్నాయి. కథ ఆడియో, వీడియో రూపాలను సంతరించుకుంది. విమర్శ దీనికి కొలమానాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. కథానిర్మాణంలో అతిక్లుప్తత చోటుచేసుకుంది. 

నానో కథలు లాంటి వాటికి సూత్రాలు నిర్మించాల్సిన పరిస్థితీ నేడు ఉంది.సాహిత్యలోకంలో చెలామణిలో ఉన్న సూత్రాలే కాదు, కొత్తగా కథాలోకంలోకి వస్తున్న, వచ్చిన కథకుల నాడిని గట్టిగా పట్టుకోవాలనుకున్న విమర్శకులు, పరిశోధకులు ఎప్పటికప్పుడు ఇతర భాషల్లో కథానిర్మాణ పద్ధతుల గురించి అధ్యయనం చేస్తూనే ఉండాలి.

కథలకు సంబంధించి కొత్త నిర్మాణ పద్ధతులను సూత్రీకరణ చేసే సృజనశక్తిని అలవర్చుకోవాలి. అప్పుడే కథలకు సంబంధించిన విమర్శ, పరిశోధన విస్తృతమవుతుంది. కథకు సంబంధించిన సంపూర్ణ సత్యాలు ఆవిష్కృతమవుతాయి.కథ ఎలా పుడుతుంది? ఎలా నడుస్తుంది? ఎలా ముగుస్తుంది? ఒక కథ రాయడానికి రచయితను ప్రేరేపించే అంశాలు ఏమిటి? ఆ ప్రేరణ కథగా మార డానికి మధ్య రచయిత ఏం చేస్తాడు? కథ రాసిన తర్వాత ఏ కొలమానాలతో ఆ కథను చూడాలి? కథలో రచ యిత చెప్పిన అంశాలనే ప్రామాణికంగా తీసుకొని కథను పరిశీలించాలా? కథను ఎలా చెప్పాడో చూస్తే సరిపోతుందా? కథలో రచయిత చెప్పిన అంశాలను, చెప్పిన విధానాన్ని సమతూకంగా చూస్తూ అధ్యయనం చేయాలా? రెండింటికి మధ్య ఉన్న తేడా ఏంటి? దేని ప్రాధాన్యత ఎంత? నేడు కథను తూచడానికి ఉన్న రాళ్లు సరిపో తాయా? కొత్త ప్రమాణాలు అవసరమా? అసలు ఇది గొప్ప కథ, ఇది తక్కువ అని ఒక కథ స్థాయిని నిర్ణయించడం సరైనదేనా? ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు.వస్తువు, శిల్పం అని రెండు ప్రధాన భాగాలుగా కథ స్వరూపాన్ని స్వభావాన్ని నిర్ణయించడం నేడు దాదాపు అందరూ చేస్తున్న పని. కొందరు రూపం అని, కథన పద్ధతి అనే పదాలను శిల్పానికి దగ్గరగా వాడుతున్నారు. కథలో రచయిత చెప్పిన అంశాన్ని వస్తువు అని, దాని నేపథ్యాన్ని ఇతివృత్తం అని పిలుస్తున్నారు. పరిశోధ నలు, విమర్శలు ఇదే మూస ధోరణిలో సాగుతున్న విధానాన్ని మనం గమనిస్తున్నాం. వీటిని మించిన కథా నిర్మాణ సూత్రాలు అందుబాటులో ఉన్నాయా అని ఆలో చించాల్సిన అవసరం ఉంది.

రచనకు సంబంధించిన అంశాన్ని రచయిత ఎంచుకోవడానికి, దాన్ని కథగా మార్చడానికి మధ్య కథకుడు ఏం చేస్తాడు? కథకుల మనసులో ఎలాంటి ప్రయోగశాల ఉంది? దానిలో ఎలాంటి ప్రయోగాలు జరుగుతాయి? దాన్ని బద్దలు కొట్టా ల్సిన అవసరం లేదా? కథ లిఖిత రూపంలో లేదా వాగ్రూపంలో బయటకు వచ్చిన తర్వాత మాత్రమే పరి శీలించి మంచిచెడులను బేరీజు వేస్తే సరిపోతుందా? కథా వస్తువుకు, కథకుడికి మధ్య జరిగే సంఘర్షణాత్మక మనో లోకాన్ని పూర్తిగా పట్టుకోవడం కూడా జరగాలి. అసలు కథకులు ‘‘ఈ వస్తువుకు ఈ కథన పద్ధతే సరిపోతుంది. ఈ కథను ఇలాగే రాస్తాను’’ అని ఎలా నిర్ణయించుకుంటారు? ఆ నిర్ణయంపై ఎలాంటి ప్రభావాలున్నాయి? రచయిత స్వేచ్ఛ వెనకున్న నేపథ్యాలను ముందుకు తీసుకురావాల్సిన అవసరమూ ఉంది.