ఆనందపుటాకాశాల్ని
మాటల పిడికిలిలో
ఒడిసిపట్టలేని వివశత్వం
ముప్పిరిగొన్నప్పుడు...
తొణకిసలాడిన విశ్వాసం 
తొట్రుపడి మనస్సు సంతులనం 
కోల్పోయినప్పుడు...
 
గుండెలోని బాధాపర్వతాల్ని
దుఃఖపుటద్దంలో ఇరికించలేని అశక్తత
నిండా ఆవరించినప్పుడు...
 
కడుపులోని వేదన కళ్ళలోసుళ్లు తిరిగి 
ఓదార్చలేక రెప్పలు చేతులెత్తేసినప్పుడు...
పరస్పర ప్రతిక్రియాలోచనా 
దుర్గమారణ్యంలో పడి
మనసు దారి తప్పినప్పుడు...
 
స్వీయ స్వప్నాలను 
అనువదించే తత్తరపాటులో 
ఉన్నట్టుండి ఉలిక్కిపడి లేచినప్పుడు...
 
ఇన్నాళ్ళుగా వాగి వాగి
గుట్టలుగా పోగేసుకున్న
మాటల మీదుగా 
నడిచి నడిచి మౌన శిఖరం
చేరుకున్నప్పుడు...
 
సుదూరపు చెట్టుకొమ్మ మీద
తోడుగా తానున్నానని
ఉదయాన్నే వినిపించే పక్షి స్వనంలా
జీవితానికంతా సరితూగే
ఒకే ఒక్క ఆప్తవాక్యమై
మెరవాలని...
 
ప్రతాప చంద్ర శేఖర్‌
99488 56377