ప్రేమ
బహుమతుల ఎర
కానుకల కొలమానం
నీటిమీద శిలాఫలకాల ప్రతిష్ఠ
ముళ్లు లోపలికి ముడిచి
కౌగిలింతకు ఆహ్వానం పలకటం
 
బంధం
తులనాత్మక తులాభారం
బరువుబాధ్యతల పంపకంలో
సమానత్వ సాకులు వెదకటం
దేహాలు అవిభక్తంగా అలరారుతున్నట్లు
కనికట్టు విద్య సాధన చెయ్యటం
 
భ్రమ
కాళ్లు నేలమీదే ఉన్నాయనుకోవటం
ఆన్‌లైన్‌లో దిగుమతి చేసుకున్న 
ఖరీదైన రెక్కల్ని రోజుకో రకం ధరించటం
విద్యుత్తీగల కన్నా పైన విహరిస్తూ
మట్టిని ముద్దాడుతున్నట్లు స్వప్నించటం
 
స్వచ్ఛత
హరితవనాల ఆగర్భ ప్రదర్శన
అద్దిన రంగులు ఎక్కడా కనిపించకుండా
ప్రకృతిని కీర్తిస్తూ జపమాల ధరించటం
దారి పొడవునా తనను తాను నెత్తికెత్తుకుని
పాదముద్రల వెంట పొగడ్తలు 
         చల్లుకుంటూ పోవటం
 
ప్రక్షాళన
పొదలకు నిప్పంటించటం
వక్రరేఖల్ని నికరంగా సరళీకరించటం
నిజమైన నిర్వచనాల కోసం అన్వేషించటం
పొగచూరిన అంతరాత్మను
నిప్పుల ఉప్పెనలో నవీకరించటం
 
ఎమ్వీ రామిరెడ్డి
98667 77870