ఇసుకతీరాన నేనూ తనూ

 
మొదల తేరిపారజూసుకొని తడుముకున్నాం.
 
కళ్ళు కలుపుకుని మనసులు తడుపుకున్నాం
 
తడి నీటి వొడ్డున ఆరబెట్టుకున్నాం
 
అంతే!... మేమొక్ఖ ముక్కా మాట్లాడుకోలేదు
 
ఎంతసేపో అలా... ఒకరినొకరు చూస్తో...
 
మౌనం వొకానొక విలువైన సంభాషణ
 
మా రెక్కల నావహించిన పిల్లగాలులనూపి
 
పలకరించుకున్నాం అప్పుడు... మనసారా
 
అసలూ బొంగరాల్లంటి నాలుగు కళ్ళు
 
ఒకదానిచుట్టేసి వొకటి తిరగటమే
 
విశ్వ మోహనం
 
శుష్క పాండిత్యం కన్నా
 
గొప్పలు కుప్పలుబోయడం కన్నా
 
పొడి పొడిమాటల వొడియాలను
 
నది నీడన అరబెట్టడం కన్నా
 
అస్సలు మాటలు లేకపోవటమే
 
సిసలైన పలకరింపు... అనేకసారి
 
వొకరి తడిసిన రెక్కలపైకి
 
మరొకరు వుఫ్‌ మని గాలి బూడగలూదడం
 
భల్‌ సరదాయింపు
 
స్నేహానికి ఫిదాయింపు కూడా
 
ఎదుటనున్నది ఎరిగినదైనా, కానిదైనా
 
పసి మనసును దూశాక
 
చల్లని నవ్వుల్‌ రువ్వాక
 
ఒకరి ముందొకరు యింక కరిగి నీరవ్వాల్సిందే
 
మనమంతే! ఎదుటనున్నది మనిషే అవక్ఖర్లేదు
 
కంటికి ఆనకపోయినా పర్లేదు
 
ప్రాణమున్న జీవి అయితే చాలు
 
గాలి తిత్తుల్లో కాస్త శ్వాస వుంటే చాలు
 
యే లోతుల్లోనో ప్రేమ పండే వుంటుంది
 
మంచి వెన్నతనాన్ని చిలికితీస్తూనే వుంటుంది
 
మన వెనుక కొండవంటి కష్టాల బండలున్నా
 
యీ దోస్తీతో యిక అన్నీ బలాదూర్‌
 
దీపం వెలిగించి బతుకు దాటడానికి
 
తోడునిలిచే ప్రాణి ఎంతదయితేనేం
 

మనసు దొడ్డదయితే చాలదూ

************

 
వాసు
 
74999 85329