నా దగ్గర కొంచెం

freedom of expression మిగిలిపోయింది
మీకు కావాలంటే తీసుకోండి
నా కవసరం లేదు
ఇప్పుడు నేనేమీ మాట్లాడటం లేదు
 
ప్రాథమిక హక్కుల్ని కూడ ఇచ్చేద్దామనుకుంటున్నాను
ఎవరికైనా పనికొస్తాయనుకుంటే తీసుకోండి
పౌరసత్వం అపహాస్యం చేయబడుతున్న వేళ
fundamental rights ఏం చేసుకోను?
 
IFC Section 124A ఎంత చదివినా
అర్థం కావడం లేదు
బహుశ ప్రశ్నించడమే దేశద్రోహమేమో!
dissent voice ఇప్పుడు దేశద్రోహి!
 
Indian Constitutionని అపురూపంగా పట్టుకొని
గుండెకు హత్తుకుంటూ,
law collegeకు వెళ్ళిన సమయాలు
ఈ రోజెందుకో గుర్తుకొస్తున్నాయి
 
preambleని ప్రేమించినంతగా
నేను దేన్నీ ప్రేమించలేదు
ఆ pageని ఎన్నిసార్లు ముద్దుపెట్టుకున్నానో చెప్పలేను
నిజానికి అదొక కవిత
democracy వైపు దారి చూపించే
అక్షరాల అమరిక
ప్రపంచానికి ఆదర్శమైన నా భారత సంవిధాన్‌లో
తొలి పేజీ అది
నా ఊపిరది
 
అయితే-
ఆ page అదృశ్యమైనట్టు
నిన్న రాత్రి కల ఒకటి వచ్చింది
నన్ను కలవర పెట్టి వెళ్ళింది
ఈ రోజేమో NRC, CAB/CAA
 
కల్లోల సముద్రమైంది నా ఇండియా
సొంత నేల మీద statelessness
వేల వేల గొంతుల అస్తిత్వ వేదన
కెరటమై ఎగసి పడింది
వర్తమాన భారతి తొలి రాజకీయ పాఠం నేర్పింది
మహెజబీన్‌