వ్యాసుని వ్యధ:భాగవత రచన

ద్వాపరయుగం చివరిదశలో కృష్ణద్వైపాయనుడు ఈ భరతభూమిపై అవతరించాడు. ఆయన తల్లి సత్యవతి. తండ్రి పరాశరమునీంద్రుడు. శ్రీమహావిష్ణువు అంశతో జన్మించిన కారణంగా కృష్ణద్వైపాయనుడు పుట్టుకతోనే యోగి అయినాడు. తపస్సు చేసి దైవానుగ్రహం సాధించి, సకల వేదశాస్త్రాలనూ అభ్యసించాడు. బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. త్రికాలవేత్తగా ప్రఖ్యాతి చెందాడు.ఒకనాడు వేకువనే స్నానానికై కృష్ణద్వైపాయనుడు సరస్వతినదీ తీరానికి చేరుకున్నాడు. స్నానం చేసి, ఏకాంత స్థలంలో కూర్చున్నాడు. ధ్యానం చేయసాగాడు. ఆ ధ్యానంలో జరగబోయేదంతా ఆయనకు తెలియ వచ్చింది. త్వరలోనే కలియుగం రానున్నది. ఆ యుగంలో మానవులంతా అవినీతి పరులై, అధర్మపరులై, పాపాలే ప్రాణవాయువుగా జీవిస్తారు. వారి వల్ల లోకం అనేక ఆపదలకూ, అనర్థాలకూ లోను కానున్నది.-అంతా తెలుసుకున్న కృష్ణద్వైపాయనుడు మానవకోటికి మేలు చేయ సంకల్పించాడు. వారికి ధర్మ స్వరూపాన్ని తెలియజెప్పాలనుకున్నాడు. అందుకు రాశిలా ఉన్న వేదాన్ని నాలుగు భాగాలు చేశాడు. వాటికి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అని పేర్లు పెట్టాడు. అంతటితో ఆగిపోక మానవుల క్షేమం కోరి వర్ణాశ్రమ ధర్మాలనూ, పురాణేతిహాసాలనూ రచించాడు. వాటిని పంచమవేదంగా పేర్కొన్నాడు. ఈ పంచమవేదాన్ని సర్వ వ్యాప్తం చేసేందుకు శిష్యులకు బోధించాడు. ఋగ్వేదాన్ని పైలుడికీ, యజుర్వేదాన్ని జైమినికీ, సామవేదాన్ని వైశంపాయనుడికీ, అధర్వణవేదం సుమంతుడికీ సవివరంగా బోధించాడు.

పంచమవేదం పురాణేతిహాసాలను రోమహర్షణుడికి చెప్పాడు. వారు, వారి శిష్యులకు చె ప్పారు. ఆ విధంగా వేదాలు శాఖోపశాఖలయినాయి. అయితే స్త్రీలూ, శుద్రులూ వేదం చదివే అర్హత లేకపోవడంతో వారిని తరింపజేసేందుకు వేదసారాన్నంతా క్రోడీకరించి, సకల ధర్మాలనూ తెలియజేస్తూ కృష్ణద్వైపాయనుడు ‘మహాభారతం’ రాశాడు. వేదాలను వేరు చేయడంతో కృష్ణద్వైపాయనుణ్ణి ‘వ్యాసుడు’ అన్నారు. ’వేదవ్యాసుడు’ అని కూడా అతన్ని పేర్కొన్నారు.

వ్యాసుని మనోవ్యధ

వేదాలను విభజించినా, పురాణేతిహాలను విరచించినా వ్యాసునికి మనశ్శాంతి లేకుండా పోయింది. ఏదో తెలియని దిగులూ, చింతా అతన్ని వేధించసాగాయి. ఆ వేదనతోనే సరస్వతినదీ తీరాన కూర్చున్నాడు మళ్ళీ.ఏమిటిది? ఎందుకీ వ్యధ? ఎలాంటి ఫలితాన్నీ ఆశించక లోక క్షేమం కోసం ఎంతో చేస్తున్నానే, దైవప్రార్థనే ప్రాణంగా జీవిస్తున్నానే, తనకెందుకిలా జరుగుతోంది? ఈ బాధ తీరేదెలా? అని వ్యాసుడు తలపట్టుకున్నాడు. అప్పుడక్కడికి నారదమహర్షి వేంచేశాడు. నారదుణ్ణి చూసి వ్యాసుడు చేతులు జోడించి నమస్కరించాడు. తగిన మర్యాదలు చేశాడు. ఉచితాసనాన్ని కల్పించాడతనికి. దీనంగా దిగులుగా ఉన్న వ్యాసుణ్ణి గమనించాడు నారదుడు. ఇలా అడిగాడు.‘‘పరబ్రహ్మ ఉపాసకుడివి, నువ్వేమిటి ఇలా ఉన్నావు? ఏమిటి నీ బాధ?’’‘‘ఏం చెప్పమంటావు మహర్షీ! ఎందుకో, ఏమిటో నా మనసంతా అల్లకల్లోలంగా ఉంది. తెలియని బాధ పట్టి పీడిస్తోంది. వేదాలను వేరు చేశాను. పురాణేతిహాసాలు రచించాను. పంచమవేదం మహాభారతం విరచించాను. అయినా ఏదో లోపం. వెలితి. మనశ్శాంతి లేదు. త్రిలోక సంచారివి, నీకు తెలియని రహస్యం లేదు. చెప్పు మహర్షీ, నేను చేసిన తప్పేమయినా ఉందా? ఉంటే చెప్పు, క్షమించమని భగవంతుణ్ణి వేడుకుంటాను. లేదంటే మనశ్శాంతి కోసం నేనేం చెయ్యాలో చెప్పు. కాస్తంత పుణ్యం కట్టుకో.’’ ప్రార్థించాడు వ్యాసుడు. సమాధానంగా ముందు సన్నగా నవ్వాడు నారదుడు. తర్వాత ఇలా అన్నాడు.‘‘ధర్మాలు నువ్వెన్నయినా చెప్పు, శ్రీహరి మహిమను చెప్పనప్పుడు అవన్నీ వ్యర్థాలే! నువ్వు రచించిన పురాణేతిహాసాల్లో భగవంతుడు ఒక పాత్రేగాని, ప్రధానం కాకుండాపోయాడు. అందుకే నీకు మనశ్శాంతి లేకుండాపోయింది.’’‘‘అవునా’’ ఆశ్చర్యపోయాడు వ్యాసుడు. తప్పు చేసిన వాడిలా చెంపలు వాయించుకున్నాడు.‘‘ఇప్పటికయినా మించిపోయింది లేదు, నువ్వు శ్రీమన్నారాయణుని లీలల్ని ప్రధానంగా చేసుకుని, ఓ గ్రంథాన్ని రచించు. అది లోకంలోని భాగవతోత్తములందరికీ శిరోధార్యమై, ‘భాగవతం’ పేర ప్రసిద్ధి చెందుతుంది. ఫలితంగా నువ్వు కూడా శ్రీమన్నారాయణునికి దగ్గరవుతావు.’’ అన్నాడు నారదుడు.