ప్రముఖ రచయిత శంకరమంచి పార్థసారధి. వందకుపైగా కథలు, పది నవలలు, ఫీచర్లు, ఇరవై హాస్య నాటికలు, రెండు నాటకాలు, పాతిక సినిమాలు, అనేక పురస్కారాలూ...రచయితగా ఇదీ ఆయన నాలుగు దశాబ్దాల ప్రస్థానం. ఇరవైఒక్క కథలున్న ఈ సంకలనంలో ఎక్కువ కథలన్నీ బహుమతులు అందుకున్నవే. ఈ కథలు చదివితే రచనకున్న పరమార్థం ఏమిటో తెలుస్తుంది. సారాంశం పఠిత మనసులోతుల్లోకి సులువైన పదాలతో సూటిగా చేరుకుని ఆలోచింపజేస్తాయి. తమనుతాము సవరించుకునేట్టు చేస్తాయి. ‘నువ్వు నడిచొచ్చిన దారేమిటో ఒకసారి వెనుదిరిగి చూసుకో’ అని సున్నితంగా హెచ్చరిస్తుంది టైటిల్ కథ ‘అద్దంలో మనం’. హాస్యం, వ్యంగ్యం, వంకరటింకర ఆలోచనలపై సెటైర్లు, చక్కటి వస్తువుతో అలరిస్తాయి ఆయన కథలు. మనసులో ఎలాంటి భావాలున్నా భార్యను సుఖపెట్టి హాయిగా జీవించే చక్కటి మంత్రం చెప్పేకథ ‘సోమరాజు సీక్రెట్‌’ కళ్ళు చమర్చే కథలు కూడా ఇందులో ఉన్నాయి. రచయిత పేరుకు తగ్గట్టే ఆయన కథలు కూడా ఎంతో ప్రశంసనీయంగా ఉంటాయి పఠితకి. 

 

అద్దంలో మనం  (కథల సంపుటి –1)
శంకరమంచి  పార్థసారధి 
ధర 200 రూపాయలు
పేజీలు 212
ప్రతులకు రచయిత, ఇం.నెం 1–1–336/121, ఫ్లాట్‌ నెం 201, 10వ వీధి, వివేక్‌ నగర్‌, చిక్కడపల్లి, హైదరాబాద్‌–20 సెల్‌ 9000917274., అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు