మనిషి అజరామరం

మువ్వా వెంకటరామిరెడ్డి మూడో కవితా సంపుటి ‘అజరామరం’. ఇప్పటికే రెండు కవితా సంపుటాలు, ఒక కథా సంపుటి, ఒక నవల వెలువరించిన రామిరెడ్డిని పాఠకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రక్రియ ఏదైనా మనిషే ఆయనకు కేంద్ర బిందువు. ప్రస్తుతం ఎ.పి. రాజధానిగా రూపుదిద్దుకుంటున్న తుళ్ళూరు మండలానికి చెందినవాడు కావడంతో పచ్చదనం కనుమరుగైపోయి, కాంక్రీట్‌ కీకారణ్యంగా మారిపోతున్న తన ఊరి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ‘సగం ఇళ్ళు మరుగుదొడ్లకు నోచుకోని/ మారుమూల గ్రామంలో/ రియల్‌ ఎస్టేట్‌ ఆఫీసులు వెలిశాయి’ అంటాడు. ‘ఒక నిర్మాణం కోసం/ సామూహిక జీవన సూత్రం ధ్వంసం కావడం/ వ్యవస్థీకృత విషాదం’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు.

సామాజిక సంబంధాల్లోనే కాదు, వైవాహిక బంధాల్లోనూ మానవ సంబంధాలకు విలువనిస్తాడు. ‘దేహం నుంచి దేహానికి చేరడమంటే/ నీలో నువ్వు లీనం కావడమే’ నంటాడు. కేవలం సాహిత్యంలోనే కాదు, వృద్ధాలయం నిర్వహిస్తూ సామాజికంగానూ ఒకడుగు ముందుకు వేశాడు. వృద్ధాప్యం శాపం కాదు, రెండో బాల్యం అంటూ ఎందరో వృద్ధులను అక్కున చేర్చుకున్న రామిరెడ్డి కవిత్వంలోని ప్రతి అక్షరంలో ఆ మానవీయ స్పర్శ పరిమళిస్తూనే ఉంటుంది.

- దేరా

అజరామరం, ఎమ్వీ రామిరెడ్డి

పేజీలు : 102, వెల : రూ.80, ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు