ప్రవాసభారతీయులలో ప్రముఖులు వంగూరి చిట్టెన్‌రాజు. హ్యూస్టన్‌ నివాసి. ముఖ్యంగా ప్రవాస తెలుగువారిలో ఉన్న సాహిత్యవేత్తలను ప్రోత్సహించేందుకు స్థాపించిన వంగూరి ఫౌండేషన్‌ విస్తృత కార్యకలాపాలు నిర్వహిస్తూ తూర్పు–పడమరలలోని తెలుగువారిలో సాహితీ తృష్ణ తీరుస్తున్నది. తెలుగు భాషా సంస్కృల అభ్యున్నతికీ, తెలుగు కథా వికాసానికీ, తెలుగు ప్రవాసీయుల జీవనానుభవాలకు అద్దం పట్టే రచనలు ప్రచురిస్తోంది. అందులో భాగంగా తాజాగా ప్రచురించిన రెండు పుస్తకాలే పైవన్నీ.

‘అమెరికా తెలుగు కథానిక 14’. ‘ఫేసు బుక్కులు, బ్లాగులు సోషల్‌ మీడియాలో ఉన్నప్పుడు ముద్రణారంగాన్ని ఆశ్రయించడం ఎందుకు?’ అనే ప్రశ్నకు ఈ పుస్తక సంపాదకులు వంగూరి చిట్టెన్‌రాజు, శాయి రాచకొండ ‘ముందుమాట’లో సమాధానమిస్తూ, ‘కథలకూ, వ్యాసాలకూ పుస్తకాలు ఒక ఆల్బం లాంటివి’ అని చెప్పడం ఒక చారిత్రకాంశం.
రచయితల ఆలోచనలపై సామాజిక మార్పులు ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో, విభిన్న రచనల్లో అవి ఎలా ప్రతిబింబమవుతున్నాయో ఈ ప్రచురణల ద్వారా మనం తెలుసుకోవచ్చు. 
ఈ సంకలనంలో 32 కథలున్నాయి. వంగూరి ఫౌండేషన్‌ ఏటా నిర్వహించే కథలపోటీల్లో విజేతల కథలూ, ఎంపిక చేసిన వివిధ పత్రికల్లోని వైవిద్యమున్న కథలు ఇందులో ఉన్నాయి. ఈ కథకులందరూ దాదాపు వర్థమాన రచయితలే.  

కాగా ప్రవాస తెలుగు రచయిత వంగూరి చిట్టెన్‌రాజు. అమెరికా కాకమెడీ కతలు, అమెరికాలక్షేపం, అమెరికామెడీ కబుర్లు, అమెరికాకమ్మ కథలు, అమరికా అపహస్యనాటికలు...ఇలా ఇప్పటివరకు ఆయన తొమ్మిది పుస్తకాలు ప్రచురించారు. ఆయన మరో స్వీయ రచన ‘అమెరికులాసా కథలు, కమామీషులూ’. ఇందులోని 26కథలూ హాస్యం, వ్యంగ్యం, చతురత, సామెతలతో గొప్పభాషావిన్యాయంతో మనల్ని అలరిస్తాయి. వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా వారి 84వ ప్రచురణ ఈ పుస్తకం. 

అమెరికా తెలుగు కథానిక 14

సంపాదకులు: వంగూరి చిట్టెన్‌రాజు

ధర : 200రూపాయలు,

పేజీలు: 320

అమెరికులాసా కథలూ కమామీషులూ

వంగూరి చిట్టెన్‌రాజు

ధర : 100రూపాయలు, 

పేజీలు: 152

ప్రతులకు : వంగూరి ఫౌండేషన్‌, అమెరికా: వంశీరామరాజు (హైదరాబాద్‌), 

ఫోన్‌ 98 490 23 852 ఈ మెయిల్‌ ramarajuvamsee@yahoo.com