ప్రపంచ సినిమా విభిన్న కోణంలో...
 
 
తెలుగులో సినిమా పుస్తకాలంటే... తప్పకుండా ఎక్కడో చోట నుంచి ఎత్తిరాసినవేగానీ, సినిమాను కొత్తగా పరిచయం చేసే రచనలు అస్సలు రావట్లేదనేది నిజం. సినిమాపై అపారమైన ప్రేమ, దాన్ని అర్థం చేసుకునే దృక్పథం, దృశ్యాలను అక్షరాల్లోకి అనువదించే చాతుర్యం ఉన్నవాళ్లే ఆకట్టుకునే సినిమా సాహిత్యాన్ని సృష్టించగలుగుతారు. అలాంటివాడే వెంకట్‌ శిద్దారెడ్డి. ‘సినిమా ఒక ఆల్కెమీ’ అంటూ ఆయన ప్రపంచ సినిమాను తనదైన దృష్టికోణం నుంచి, అనుభూతి నుంచి పాఠకునికి పరిచయం చేయాలని చూశారు. నిజానికి ఇవి సినిమా సమీక్షలో, విశ్లేషణాత్మక వ్యాసాలో కావు. ఒక ఫార్మాట్‌లో సాగని కొత్తరకం సినిమా సాహిత్యం. అప్పటికే ఆయా సినిమాలు చూసినవారైనా సరే శిద్దారెడ్డి వ్యాసాలు చదివిన తర్వాత కచ్చితంగా మళ్లీ ఒకసారి వాటిని చూడాలనుకుంటారు. ‘ఫిజ్‌కరాల్డో’, ‘బైసికిల్‌ థీవ్స్‌’, ‘ఇకిరు’, ‘సిటిజెన్‌ కేన్‌’, ‘చిల్డ్రన్‌ ఆఫ్‌ హెవెన్‌’, ‘వైల్డ్‌ స్ట్రాబెర్రీస్‌’, ‘పూజాఫలము’, ‘షిప్‌ ఆఫ్‌ థీసియస్‌’ వంటి 30 సినిమాలపై ఒక పత్రికలో ఫీచర్‌లాగా రాసిన శిద్దారెడ్డి అనుభూతుల సమాహారమిది. రెగ్యులర్‌ సినిమా రచనలకు భిన్నంగా ఆయన రచన విధానం సాహితీ ప్రక్రియలాగా సాగింది కాబట్టే ‘సినిమా ఒక ఆల్కెమీ’ కవర్‌పేజీ నుంచి చివరి పేజీదాకా సాహిత్య సంపుటిని తలపిస్తుంది. 
- చల్లా
 
సినిమా ఒక ఆల్కెమీ,  వెంకట్‌ శిద్దారెడ్డి
పేజీలు: 272, వెల: రూ.180
ప్రతులకు: నవోదయ 040-24652387