కిరాణా కొట్టుకు వెళ్లి నాలుగు సరుకులు కొనగానే.. కవర్లో వేసి ఇవ్వు అనడం వినియోగదారులందరికీ అలవాటే.. అవే సరుకులు కాస్త ఎక్కువగా ఉంటే మనమే ఓ పెద్ద సంచీని తీసుకెళ్తుంటాం.. అసలు ఈ కిరాణా సరుకుల సంచీని మొట్టమొదట కనిపెట్టింది ఎవరు..? అనే ప్రశ్న వేస్తే మాత్రం ఎవరూ చెప్పలేరు. వేలల్లో ఒకరిద్దరు మాత్రమే ఈ ప్రశ్నకు సమాధానం చెబుతారేమో. కారణం.. సినిమా వాళ్ల గురించి, రాజకీయ నాయకుల గురించి, వ్యాపారవేత్తలు, నేరస్తుల గురించి తెలుసుకోవడానికి అమితంగా ఆసక్తి చూపుతున్న యువత.. శాస్త్రవేత్తల గురించి తెలుసుకోవడానికి మాత్రం పెద్దగా ఉత్సుకత చూపడం లేదు. అది కాలం వల్ల వచ్చిన ప్రభావం మాత్రమే అనుకుంటే పొరపాటే. అసలు శాస్త్రవేత్తల గురించిన పుస్తకాలంటూ అందుబాటులో ఉంటేనే కదా కొద్దిమంది యువతరం అయినా అటుగా మొగ్గుచూపేది. తెలుగులో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న రచయితల్లో డాక్టర్ చాగంటి కృష్ణకుమారి ఒకరు. 

 

ప్రముఖ రచయిత చాగంటి సోమయాజులు గారి కూతురిగా సాహిత్యరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంలో ఇప్పటికే చాగంటి కృష్ణకుమారి సఫలీకృతురాలు అయ్యారు. దాదాపు 22 ఏళ్ల నుంచే పుస్తకాలను రాస్తూ.. సాహితీ ప్రియులను అలరిస్తున్నారు. అందరికీ తెలిసిన విషయాలనే పుస్తకాల్లోకి ఎక్కించడం ఆమె శైలి కాదు. వృత్తి రీత్యా ప్రొఫెసర్ అయినందువల్ల యువతరం మేథస్సును పెంచేలా పుస్తక రచనలు ఉండాలన్నదే ఆమె అభిలాషగా ఉంటుంది. ఆమె కలం నుంచి జాలువారిన ‘వీరీ వీరీ గుమ్మడి పండు వీరి పేరేమి..?’ అనే ఒక్క పుస్తకం చాలు.. ఆమె గురించి, ఆమె రచనల తీరు గురించి చెప్పడానికి.