‘దీవి’ లోపలి కవిత్వపు చినుకులు
‘గులకరాళ్ళ సీమదని/ నడకా సొబగూ లేనిదని/ పదం దాటి పొయ్యేవు’ అని వెంకటకృష్ణ మొహమాటానికి అనలేదు. ‘చినుకు దీవి’లో ఏ అక్షరమూ సుతిమెత్తగా ఉండదు. ‘వేదికనూ/ వేదిక మీది పాత్రలనూ/ పాత్రలనాడించే సూత్రధారులనూ/ ఒక కంట కనిపెట్టవలసిన / తరుణమిది’ అన్న హెచ్చరికతో సాగుతుంది. ‘ఆకసం పొయ్యిలోన/ పగలు మణిగిన జాబిల్లి పిల్లి/ రాత్రి సంచారానికి లేచి/ అంటిన బూదిని దులిపినట్లు’ వెన్నెల ఉందంటూనే కాలం ‘ఇంత గడ్డి తిని యిన్ని పాలిచ్చే/ జంతువు ముందు మనిషిని చేసింది హీనం’ అని వాపోతాడు. మనిషికి అన్నంలా, వెంకటకృష్ణ కవిత్వానికి వ్యవసాయమే జీవం. ‘రెండు గట్ల నడుమ ఎన్ని వేల మైళ్ళు/ కలిసి తిరిగిన సంచారులు/ మడకపట్టి భూమితో వేడుకోళ్ళు / పాడుకున్న సహబాటసారులు’ అంటూ రైతు, ఎద్దుల అనుబంధాన్ని వివరిస్తాడు. చివరికి కూతురు గురించి చెబుతూ కూడా ఎదిగొచ్చిన కూతురు కదిలే బంగారు పంటలా ఉందంటాడు. ‘పెట్టుబడుల చేతుల్లో/ పట్టుబడి గిలగిలలాడుతున్న/ పేదతండ్రుల గుండె దిగులు’ అంటూ రైతు కష్టంతోనే ఆడబిడ్డ తండ్రిని పోలుస్తాడు. ‘ఒక నవ్వు కోసం ఎంత దూరమైనా ప్రయాణిస్తాను’ అనే వెంకట కృష్ణ చాలా స్నేహశీలి. వరవరరావు, పాపినేని, నిర్మల, సాగర్‌, ‘మో’లపై ప్రశంసా పూర్వకమైన కవిత్వం అల్లినవాడే, ద్రోహం చేసిన దళిత ఉద్యమకారుడిని ‘లో-హితుడు’ అని నిందించడానికి వెనుకాడలేదు. ప్రతి కవితనీ ఆశావహంగా ముగించాలనే బరువును దించుకుంటే ‘శిల పుష్పించినట్లు ఏ అపరాత్రో’ పల్లవించే దీవి లోపలి కవిత్వ చినుకులు అందరినీ తడుముతాయి.
- దేరా
చినుకు దీవి, వెంకట కృష్ణ కవిత్వం, 
పేజీలు : 133, వెల : రూ.100, ప్రతులకు : 89850 34894