పుస్తకప్రియులున్న ఇంటింటా తెలిసిన పేరు మల్లాది వెంకట కృష్ణమూర్తి. దాదాపు యాభైఏళ్ళుగా ఎత్తినకలం దించకుండా తెలుగుపాఠకులతో మమేకమైపోయిన రచయిత. అనువాదాలు సహా వేలాది రచనలతో అన్ని సాహితీప్రక్రియల్నీ సృజించారాయన. ‘దైవంతో సంభాషణ’ ఆయన తాజా పుస్తకం. ఈ డిజిటల్‌ యుగంలో దేవుడు–సైన్స్‌ రెంటిమధ్య సంఘర్షణ చెలరేగిన ఈ రూపాంతర దశ నేపథ్యంలో ఒక జర్నలిస్టుకు, దేవుడికీ మధ్య ఇంటర్నెట్‌ ద్వారా ఏర్పడిన అనుసంధానం ఎలా ఉంటుందో ఊహించి చేసిన రచన ఈ పుస్తకం. ఒక విలేకరి అనుకోకుండా దేవుడి వెబ్‌సైట్‌లోకి జొరబడతాడు. అతడు దేవుడే అని నిర్థారించుకున్నాక, విలేకరి అడిగిన సుమారు 1250ప్రశ్నలకు దేవుడిచ్చిన సమాధానాలే ఈ పుస్తకం. 

నిన్నెవరు సృష్టించారు? అనే ప్రశ్నకు ‘నీ భయమే’ అని జవాబిస్తాడు దేవుడు. ఆస్తికత్వం, నాస్తికత్వంతో సహా దేవుడు ఎక్కడుంటాడు? ఏ గుళ్ళో ఉంటాడు, ప్రేమకన్నా గొప్పదేది? విఐపి అంటే ఎవరు? కులం, కమ్యూనిజం, కోర్టుతీర్పులు, రూపాయి విలువ, ప్రజాస్వామ్యం, అవినీతి, రాజకీయనేతల తీరుతెన్నులు, భార్యాభర్తల అనుబంధం, కోపం, సహనం.........ఇలా అనేకమైన ఆసక్తికర ప్రశ్నలకు దేవుడు అంతే ఆసక్తికరంగా జవాబులిస్తాడు. ఒకరకంగా దేవుడితో విలేకరి ఇంటర్వ్యూ ఇది! మరోరకంగా మన వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసే పుస్తకమిది.

దైవంతో సంభాషణం

మల్లాది వెంకట కృష్ణమూర్తి
ధర 280 రూపాయలు
పేజీలు 250
ప్రతులకు ప్రిజమ్‌ బుక్స్‌, గాంధీనగర్‌, పదోవీథి, హైదరాబాద్‌–80 ఫోన్‌ 040–27612928/38
దేవుడితో విలేకరి ఇంటర్వ్యూ!!