నోబెల్‌ సాహిత్య పులకింత ‘పాలపుంత’
ఇంచుమించు పాతికేళ్ల క్రితం కె.సదాశివరావుగారు ‘నోబెల్‌ సాహిత్య వ్యాసాలు’ రాయడం ప్రారంభించారు. ప్రతి సంవత్సరం నోబెల్‌ సాహిత్య పురస్కార ప్రకటన వెలువడిన వెనువెంటనే ఆయన ఆ పురస్కార గ్రహీత గురించి సవివరమైన వ్యాసం రాసేవారు. అనితరసాధ్యమైన ఈ పనిని సాధించిన ఘనత సదాశివరావుగారొక్కరికే దక్కింది. ఆ రోజుల్లో కంప్యూటర్లూ, వెబ్‌ సైట్లూ వంటివి లేకపోయినా ఎన్నో ఏళ్లనుంచి  ‘వరల్డ్‌ లిటరేచర్‌ టుడే’, ‘ది న్యూయార్కర్‌’, ‘బుక్స్‌ ఎబ్రాడ్‌’, ‘పారిస్‌ రెవ్యూ’ వంటి పత్రికలు చదివే అలవాటు ఉండటం వల్ల  ఆయన తన వ్యాసాలతో పెద్దల మన్ననలూ, తోటివారి అభినందనలూ పొందగలిగారు. 

నోబెల్‌ పురస్కార గ్రహీతల పుస్తకాలు చదివి ఊరుకోకుండా, వారిలో కొందరిపై విపరీతమైన అభిమానాన్ని పెంచుకుని, వారితో వ్యక్తిగతంగా పరిచయం ఏర్పరచుకోవాలని కూడా ప్రయత్నించారు ఆయన. కథారచయిత్రి ఏలిన్‌ మన్రోకి ఉత్తరం రాసినపుడు ఆవిడ వృద్ధాప్య దశలో కాన్సర్‌ వ్యాధితో బాధ పడుతున్నా ఆయనకి స్వదస్తూరిలో మంచి జవాబు రాసింది. దాన్ని ఈ పుస్తకానికి రాసిన ‘ముందుమాట’లో చేర్చి పాఠకులకు స్ఫూర్తిని కలుగజేసేటట్లు చేశారు సదాశివరావుగారు.

1990లో నోబెల్‌ సాహిత్య పురస్కారం పొందిన ఒక్తావియో లొజానో పజ్‌తో ప్రారంభించి 2014లో అదే బహుమతి పొందిన పాట్రిక్‌ మోడియానో వరకు ప్రతి ఒక్క నోబెల్‌ సాహిత్య బహుమతి గ్రహీత గురించీ ఆయన ఈ పుస్తకంలో రాశారు. మొత్తం 25 మంది పురస్కార గ్రహీతల గురించిన వ్యాసాలతో పాటు ‘నోబెల్‌ ఎవరికి?’, ‘నోబెల్‌ గంధం ఎవరికి?’ అనే ఆసక్తిని రేకెత్తించే నోబెల్‌ పురస్కార ప్రదానపు నేపథ్య విశేషాల్ని తెలిపే వ్యాసాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇదంతా మొదటిభాగం. 

రెండవ భాగంలో నోబెల్‌ సాహిత్య పురస్కార గ్రహీతల కథలు ఐదింటికి తాను చేసిన తెలుగు అనువాదాల్ని చేర్చారు. ఆ కథల రచయితలు - హోర్హెలూయి బోర్హెస్‌ (స్పానిష్‌), కారెల్‌ ఛాపెక్‌ (చెక్‌), కెంజాబురో ఓయి (జపనీస్‌), ఆంటన్‌ ఛెకోవ్‌ (రష్యన్‌). బోర్హెస్‌వి రెండు కథల్ని అనువదించారు. మూడవభాగంలో ఆయన వైవిధ్య పూరితమైన అభిరుచినీ, సృజనాత్మకతనీ వ్యక్తం చేసే వ్యాసాలు, వివిధ శాఖల్లో విశిష్టవ్యక్తులపై ఆయనకున్న అభిమానాన్నీ, స్నేహాన్నీ వ్యక్తం చేసే రచనలూ ఉన్నాయి. 
కె. సదాశివరావు పోలీసు శాఖలో ఉన్నత స్థాయిలో ఉద్యోగ నిర్వహణ చేస్తూ కూడా విశిష్ట రచయితగా, చిత్రకారుడిగా, విమర్శకుడిగా ప్రసిద్ధులవడం అత్యంత అభినందనీయం. ఉద్యోగ విరమణ తరవాత కూడా అనుక్షణం తన అభిరుచుల ప్రకారం సృజనాత్మకంగా గడపటం హర్షణీయం, స్ఫూర్తిదాయకం.
- అబ్బూరి ఛాయాదేవి
పాలపుంత : నోబెల్‌ సాహిత్య వ్యాసాలు ఇతరాలూ ... ; కె. సదాశివరావు
పేజీలు : 282, వెల : రూ.150, ప్రతులకు : ఎమెస్కో - 040 - 23264028