ఏ దివిలో విరిసిన పారిజాతమో.. అంటూ తెలుగు సంగీత ప్రేక్షకుడు మౌనంగా రోదిస్తున్నాడు. ‘జామురాతిరి జాబిలమ్మా.. జోలపాడనా ఇలా..’ అంటూ నిద్రలేని రాత్రిళ్లు గడుపుతున్నాడు. ఎన్నో వేల పాటలు పాడి తమ మదిని దోచిన గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అర్ధాంతరంగా తనువు చాలించి మరలిరాని లోకాలకు వెళ్లడాన్ని సంగీతాభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. గతేడాది సెప్టెంబర్ 25వ తారీఖున ఎస్పీ బాలు మరణించారు. కరోనా బారిన పడిన ఆయన కోలుకోవాలనీ, మళ్లీ ఆయన గొంతు వినాలని అశేష అభిమానులు ఆశించారు. కానీ విధి వక్రించి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో సంగీతాభిమానులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ సమయంలో ఎస్సీ బాలు గురించి ఎన్నో వార్తలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. ఆయన పుట్టుపూర్వోత్తరాల నుంచి, ఏఏ పాటలు పాడారు? ఏఏ పాటల రికార్డింగు సమయంలో విచిత్ర సంఘటనలు జరిగాయి.? ఏఏ పాటలు పాడటానికి ఆయన కష్టపడాల్సి వచ్చింది? అంటూ ఎన్నో వార్తలు షికార్లు చేశాయి. అయితే వాటిల్లో చాలా వరకు సమగ్ర సమాచారం లేనివే ఉండటం శోచనీయం. 

 
అయితే ఎస్పీ బాలు గురించి బాగా తెలిసిన ప్రముఖ రచయిత ‘భాస్కరుని సత్య జగదీష్’ మరోసారి పాఠకాభిమానులకు బాలూను సరికొత్తగా పరిచయం చేశారు. బాలు జీవించి ఉన్నరోజుల్లోనే ఆయనపై ‘బహుముఖ ప్రజ్ఞాశాలి బాలూ’ అనే పుస్తకాన్ని రాశారు. తాజాగా ‘మన బాలూ కథ’ పేరుతో సరికొత్త పుస్తకాన్ని సంగీత పాఠకాభిమానుల ముందుకు తీసుకొచ్చారు. ఎస్పీ బాలు జీవితంలో జరిగిన సంఘటనలు, చాలా మందికి తెలియని ఎన్నో విషయాలను ఆయన ఈ పుస్తకంలో రాసుకొచ్చారు. ‘బాలూను చెంపదెబ్బ కొట్టిందెవరు?, బాలూను ఏడిపించిన సంగీత దర్శకుడెవరు?, బాలూ ఖూనీ చేసిందెవరిని? బాలూను వద్దన్న ప్రముఖ నటుడెవరు?, బాలూతో గొడవపడ్డ దర్శకుడెవరు?, బాలూ చేయి విరగ్గొట్టిన ప్రబుద్ధుడెవరు?, ఆర్కోణరావు బాలూ కొడుకెలా అయ్యాడు?, బాలూను చిక్కుల్లో పడేసిన స్నేహితుడెవరు?, బాలూ ఏ సినిమా తీసి చేతులు కాల్చుకున్నారు?, బాలూను పడేసిన పక్కింటి అమ్మాయెవరు?’ అంటూ బాలూ జీవితంలో దాగిన కొన్ని నిగూఢ రహస్యాలను ‘మన బాలూ కథ’ పుస్తకంలో భాస్కరుని సత్య జగదీష్ పంచుకున్నారు. 
 
ఓ అరుదైన సంఘటన: బాలూ కోసం మూడు వారాల పాటు ఎంజీఆర్ నిరీక్షణ..
అవును తమిళ సినీ ప్రేక్షకాభిమానుల ఆరాథ్య దైవం ఎంజీఆర్ మన బాలూ కోసం ఏకంగా మూడు వారాల పాటు నిరీక్షించారు. ఓ రోజు సినిమా షూటింగ్ సమయంలో విరామం రావడంతో ఎంజీఆర్ ‘ఎంవీయం ఆర్.ఆర్.ఆర్. థియేటర్’ బయట కుర్చీలో కూర్చుని సేద తీరుతున్నారు. సరిగ్గా అదే సమయంలో ఎల్.ఆర్. ఈశ్వరితో కలసి బాలు ఓ పాటను పాడుతున్నారు. బాలు గొంతును ఎంజీఆర్ విన్నారు. అలా వింటూనే ఉన్నారు. ఆ తర్వాత బాలును పిలిపించారు. చూస్తే కుర్రాడిలా ఉన్నాడు. పేరు, వివరాలు అడిగారు. ఆ తర్వాత ‘నా సినిమాకు ఓ పాట పాడాలి’ అని అన్నారు. అదే అదృష్టంగా బాలు భావించారు. ఆ పాట కోసం రిహార్సల్స్ చేశారు. కానీ, ఊహించని రీతిలో బాలూ మంచాన పడ్డారు. దాదాపు మూడు వారాల పాటు టైఫాయిడ్‌తో ఇంటికే పరిమితయ్యారు. ‘అంత పెద్ద హీరో, పెద్ద పెద్ద నిర్మాతలు నేను పాడాల్సిన పాట కోసం సినిమాను ఆపుతారా? ఆపరు కదా. ఆ పాటను వేరే వాళ్లతో పాడించేసి ఉంటారు. మంచి ఛాన్స్ మిస్సయింది’ అని బాలు బాధపడ్డారు. కానీ మూడు వారాల తర్వాత ఆ పాటను బాలుతోనే ఎంజీఆర్ పాడించారు. ఆ ఒక్క పాటను రికార్డింగ్ చేసేందుకు బాలు కోసం నిరీక్షించారు. బాలు ఆ పాటను పాడిన తర్వాత పత్రికల వాళ్లను పిలిపించి ప్రత్యేకంగా బాలు గానామృతం గురించి చెప్పారు. ‘ఇకపై నా సినిమాల్లో కనీసం ఒక్క పాటను అయినా బాలుతో పాడించండి’ అంటూ నిర్మాతలకు కూడా ఎంజీఆర్ రికమెండ్ చేశారు.
 
ఇలాంటి ఎన్నో అరుదైన సంఘటనలకు సంబంధించిన సమాచారం ‘మన బాలూ కథ’ పుస్తకంలో ఉంది. మరి వీలుంటే ఆ పుస్తకాన్ని మీరూ సంపాదించి, బాలూ జీవితంలో జరిగిన సంఘటనల సమాహారాన్ని ఓ లుక్కేయండి. 

 

ప్రతులకు...
మధురం పబ్లికేషన్స్
ఫ్లాట్ నెంబర్. 3జి-08
వాసవి బృందావనం అపార్ట్‌మెంట్స్
మోతీనగర్, హైదరాబాద్ - 500114
ఫోన్ - 87121 53417